ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు డీఎస్‌ కాన్సెప్ట్ ఏంటి?

ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు డీఎస్‌ కాన్సెప్ట్ ఏంటి?
x
Highlights

పార్లమెంట్ ఎన్నికల అనంతరం..ఆ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్న ఆ బడా నేత.. తన కుమారున్ని ఎంపీగా...

పార్లమెంట్ ఎన్నికల అనంతరం..ఆ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్న ఆ బడా నేత.. తన కుమారున్ని ఎంపీగా గెలిపించుకుని తన రాజకీయ చతురతను మరోసారి ప్రదర్శించారు. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన...24 గంటల వ్యవధిలోనే బీజేపీ అధినేత అమిత్ షాను సైతం కలవడం, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వెనుక అదృశ్య శక్తిగా ఉన్న నేత ఆయనేనా...అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తెలంగాణ రాజకీయ చాణక్యుడి వెంట నడిచేదెవరు..? ఆయన టార్గెట్ పెట్టిందెవరికి..?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి రుజువు చేసేలా.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్దమైందా అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. కాంగ్రెస్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం టీఆర్ఎస్ వయా బీజేపీ అన్నట్లుగా బీజేపీ ఛీఫ్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది.

తెలంగాణను టార్గెట్ చేసిన అమిత్ షా, డీఎస్ ద్వారా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వెనుక డి. శ్రీనివాస్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఐతే డి.ఎస్. కమలం గూటికి చేరితే జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన నేతలు ఆయన వెంట క్యూ కట్టే పరిస్ధితి కనిపిస్తోందన్న చర్చ వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, రూరల్ మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు డి.ఎస్. తో పాటే కమలం పార్టీకి క్యూ కట్టే అవకాశం ఉంది. వీరితో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్-టీఆర్ఎస్ నేతలు సైతం డి.ఎస్. తో పాటే వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు సైతం డి.ఎస్. తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీ అని ప్రచారం చేస్తున్న కమలం పార్టీ నేతలు, ఆ దిశలో తమ కార్యాచరణ ప్రారంభించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ ఛీఫ్ అమిత్ షా.. డి.ఎస్. ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్- టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు చేయిస్తున్నట్లు సమాచారం. చాలా కాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న డి.శ్రీనివాస్.. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో హాజరై.. చర్చకు దారితీయగా.. అది మరచిపోకముందే అమిత్ షాతో భేటి కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని డి.ఎస్. అనుచరులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరారు. డి.ఎస్. కూడా తిరిగి స్వగృహ ప్రవేశం చేస్తారని అందరూ భావించారు. కానీ మారిన రాజకీయ పరిణామాలతో.. డి.ఎస్. తన ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బీజేపీని బలోపేతం చేసే దిశలో కమలదళంలో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలపడాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగానే, డి.ఎస్.ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగానే కాకుండా పీసీసీ ఛీఫ్, మంత్రిగా కీలక పదవులు చేపట్టిన డి.శ్రీనివాస్ రాజకీయ మనుగడ కోసం పార్టీలు మారుతూ రావడం, విశ్లేషకులకు విస్మయం కలిగిస్తోంది. ఐతే డి.ఎస్. చేరిక బీజేపీకి ఎంత మేరకు లాభం చేకూరుస్తుందో ఆయనతో పాటు ఎంతమంది నేతలు బీజేపీలోకి చేరుతారన్నది తేలాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories