సైకిల్‌ ఎక్కితేనే చతికిలపడ్డాం... మరెలా... హస్తం నేతల అంతర్మథనం

సైకిల్‌ ఎక్కితేనే చతికిలపడ్డాం... మరెలా... హస్తం నేతల అంతర్మథనం
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది కాంగ్రెస్. ఇంకా పరాజయం నుంచి తేరుకోకముందే, పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఓటమికి కారణాలు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది కాంగ్రెస్. ఇంకా పరాజయం నుంచి తేరుకోకముందే, పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఓటమికి కారణాలు విశ్లేషించేలోపే, లోక్‌సభకు సిద్దం కావాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో, తెలంగాణలో మరోసారి టీడీపీతో జతకట్టాలా వద్దా అన్న అంశంపై, సీనియర్లు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. ఆంధ‌్రప్రదేశ్‌లో ఒంటరిపోరుకు కాంగ్రెస్ నిర్ణయించుకోవడంతో, ఈ చర్చ మరింత హాట్‌గా సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో మహాకూటమిపై భిన్నాభిప్రాయాలు, భిన్న వాదనలున్నాయి. పార్టీలో అత్యంత కీలక పాత్రలో ఉన్న నేతలు సైతం టీడీపీతోనే, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరగిందనే భావన వినిపిస్తున్నారు. మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, డికే అరుణలు టిడిపితో పొత్తు పెట్టుకోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో, పరాజయం పాలయ్యామని విమర్శించారు. పొత్తులు వద్దనిచెప్పినా పిసిసి, ఏఐసిసి పట్టించుకోలేదని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే, తానొకటి తలిస్తే, దేవుడు మరొకటి తలచినట్టుగా, కూటములొద్దని రాష్ట్ర నేతలు గగ్గోలు పెడుతుంటే, అధిష్టానం మాత్రం మరోటి తలుస్తోంది. దేశంలో బిజేపికి వ్యతిరేకంగా కూటములు కడుతోంది. ఆ కూటమిలో టిడిపిి కీలకపాత్ర పోషిస్తుండడంతో, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఇష్టమున్నా లేకున్నా.. అధిష్టానం ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల్లో కూటమి ఉండాలనే, అధిష్టానం ఆదేశాలు జారీ చేసేలా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవడం వల్లే టిఆర్ఎస్‌కి అత్యధిక స్థానాలు ప్రజలు కట్టబెట్టారనే భావనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు, హైకమాండ్ వ్యవహారం మింగుడుపడ్డంలేదు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఇష్టమున్నా లేకున్నా పొత్తులు తప్పేలా లేవు. కానీ కేవలం టీడీపీతో పొత్తు వల్లే కాంగ్రెస్ ఓడిందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు సీనియర్ నేత వి.హనుమంతరావు.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగడం, టీడీపీతో పొత్తు వద్దని వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వాదనకు బలమిచ్చినట్టయ్యింది. కానీ ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి, పొత్తులుంటాయని, సీనియర్ నేతలంటున్నారు. అన్నీ ఆలోచించే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.మొత్తానికి తెలంగాణలో మహాకూటమి ఓటమి, అటు ఏపీలో కాంగ్రెస్‌ ఒంటరిపోరు నిర్ణయం, తెలంగాణలో పొత్తులపై ఆసక్తికర చర్చకు దారి తీసింది. తెలుగుదేశంతో పొత్తును కొందరు నేతలు వద్దంటుంటే, మరికొందరు తప్పేంలేదంటున్నారు. మరి రాష్ట్రానికో విధంగా భాగస్వామ్య పక్షాలను ఎంచుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం, దెబ్బతిన్న తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories