గెలుపు గుర్రాల కోసం కమలం అన్వేషణ..

గెలుపు గుర్రాల కోసం కమలం అన్వేషణ..
x
Highlights

దేశవ్యాప్తంగా పూలు వికసిస్తున్నాయి. మొన్నటి వరకూ తెలంగాణలో పువ్వులు పుష్పించాయి. కానీ మొన్న అసెంబ్లీ పోరులో మాత్రం, పువ్వులన్నీ నలిగిపోయాయి. అందుకే...

దేశవ్యాప్తంగా పూలు వికసిస్తున్నాయి. మొన్నటి వరకూ తెలంగాణలో పువ్వులు పుష్పించాయి. కానీ మొన్న అసెంబ్లీ పోరులో మాత్రం, పువ్వులన్నీ నలిగిపోయాయి. అందుకే బయటకు రావడానికి భయపడుతున్నాయ్. తరుముకొస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి, పువ్వు గుర్తు పార్టీకి, గెలుపు గుర్రాలు కరువయ్యారు. ఒకట్రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ఉండడంతో మిగత 15 స్థానాలకు క్యాండిడేట్స్‌ కావలెనంటూ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. పలు రాష్ట్రాల్లోనూ పవర్‌లో ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. మోడీ, అమిత్ షాలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. తమకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి నిలిచే, పెద్ద నేతలు ఎవరూ కనిపించడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే కనీసం ప్రభావం చూపెట్టే నేతలు కూడా వెతికినా దొరికే పరిస్థితి లేదు.

17 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నా, బీజేపీకి ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే అంతోఇంతో ప్రభావం చూపెట్టే వ్యక్తులు పోటీలో ఉండే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో ప్రస్తుతానికి ఆ స్థాయి నేతలు లేరనే అభిప్రాయం పార్టీలోనే వ్యక్తమవుతోంది. 2009లో అన్ని స్థానాలకు పోటీ చేసిన బీజేపీ, చాలా స్థానాల్లో నామ్‌కే వాస్తే అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చింది. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ, మంచి అభ్యర్థులనే బరిలోకి దించింది. ఈసారి మాత్రం అలాలేదు. 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన నాగం జనార్దన్ రెడ్డి, నరేంద్రనాథ్‌లు పార్టీని వీడారు. విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా వెళ్లారు.

ఈసారి ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కొత్త ముఖాలే బరిలోకి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఫలితాల దెబ్బతో, ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్లో పార్లమెంట్‌కి పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్న వారెవరూ పెద్దగా లేరు. పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉన్న లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఒకరిద్దరు ఆసక్తి చూపుతున్నా, మిగతా స్థానాల్లో మాత్రం మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూశాక అమ్మో అంటున్నారు. పార్లమెంటు షెడ్యూల్ వచ్చినా మార్పు రాలేదనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. పార్టీలో కేవలం సికింద్రాబాద్, నిజామాబాద్ పార్లమెంటుకు మాత్రమే సీనియర్లు పోటీపడుతున్నారు తప్ప మిగత స్థానాలను అడిగే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు కేవలం.. సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయ టిక్కెట్టు ఆశిస్తుండగా, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి అదే స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇక నిజమాబాద్‌ పార్లమెంటు స్థానానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ధర్మపురి అర్వింద్ పోటీకి సిద్దమవుతునయ్నారు. అధిష్ఠానం కూడా అర్వింద్‌ వైపే మొగ్గుచూపుతుందన్న ప్రచారంతో ఆయన ప్రచారంపై దృష్టి పెట్టారు.

ఇక మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం కోసం ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్ టిక్కెట్టు ఆశిస్తుండగా కరీంనగర్ టికెట్‌ కోసం బండి సంజయ్ పోటీలో ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంటు నుంచి భగవంత‌రావు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన స్థానాల్లోనైతే బీజేపీకి అసలు అభ్యర్థులే కరవయ్యారు. ఆయా స్థానాలల్లో పోటీ కోసం క్యాండిడేట్స్‌‌ను అన్వేషిస్తుంది కమలం పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏ ఎన్నికలు వచ్చిన ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న ప్రచారం ఉంది. తెలంగాణ కార్యకర్తల్లో జోష్‌ పెంచే విధంగా కొత్త వారికి టికెట్‌ కేటాయించి వారిని గెలిపించుకోవాలని కొందరు నేతల అభిప్రాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories