మరోసారి కేంద్రంలో కమలం వికసిస్తుందా..? వాడిపోతుందా?

మరోసారి కేంద్రంలో కమలం వికసిస్తుందా..? వాడిపోతుందా?
x
Highlights

ఎన్నికల షెడ్యూల్ తో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇన్నాళ్ళుగా కొనసాగిన సర్వేలు అంచనాలు అన్నీ ఒక ఎత్తయితే రానున్న కొన్ని వారాల పాటు చేసే ప్రచారం మరో...

ఎన్నికల షెడ్యూల్ తో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇన్నాళ్ళుగా కొనసాగిన సర్వేలు అంచనాలు అన్నీ ఒక ఎత్తయితే రానున్న కొన్ని వారాల పాటు చేసే ప్రచారం మరో ఎత్తు. మరో వైపున పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ తో కూడా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా కూటములు, పార్టీల బలాబలాలు, శక్తిసామర్థ్యాలు, బలహీనతలు, పోలింగ్ సరళిలో చోటు చేసుకుంటున్న మార్పులు లాంటి అంశాలపై చర్చ. కేంద్రంలో గద్దెనెక్కేది ఎవరో తేలేందుకు మరో పదివారాల సమయం ఉంది. ఒక విధంగా చూస్తే అతి తక్కువ సమయమే మరో విధంగా ఎక్కువ కాలమే. ఒక్కటి మాత్రం నిజం మరెంతో జరిగేందుకు కూడా ఈ పదివారాల సమయం సరిపోతుంది. కాకపోతే అలా జరుగుతుందా జరగదా అనే దానిపైనే అన్ని పార్టీల ఆశలూ ఆధారపడి ఉన్నాయి.

అధికార పక్షానికి వ్యతిరేకంగా విపక్షం జట్టు కట్టడం ఆనవాయితీ. 1977 ఎన్నికల నుంచి ఈ విధమైన ధోరణికి బీజం పడింది. ఈ దఫా ఎన్నికల్లో మాత్రం సరికొత్త ట్రెండ్ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు దీటుగా ముక్కచెక్కలుగా మూడో ఫ్రంట్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ మూడో కూటమి అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ రెండింటినీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాల్లో గణనీయ మార్పు చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఒక సర్వే ప్రకారం బీజేపీ కీలకంగా ఉండే ఎన్డీఏ కూటమికి 233 సీట్లు వస్తాయని ఒక అంచనా. అదే విధంగా కాంగ్రెస్ ప్రధానంగా ఉండే యూపీఏ కూటమికి 167 స్థానాలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ మద్దతివ్వని ప్రాంతీయ పార్టీలు గనుక ఎన్డీయే కు మద్దతిస్తే దాని బలం 278కి పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అదే తరహా మద్దతుతో యూపీఏ బలం 257 కు చేరే వీలుంది. ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది. మూడు,నాలుగు నెలల కిందటి అంచనాలతో పోలిస్తే బీజేపీ గ్రాఫ్ పెరిగింది. అవునన్నా కాదన్నాపాకిస్థాన్ పై తాజా సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీ గ్రాఫ్ ను పెంచాయి. మరో సర్వే ప్రకారం ఎన్టీయే కు 264 సీట్లు, యూపీఏకి 141 సీట్లు వస్తాయని ఒక అంచనా. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. ఈ రెండు కూటములకు దీటుగా ముక్కచెక్కలుగా మూడో ఫ్రంట్ కూడా రూపుదిద్దుకుంటోంది. మూడో ఫ్రంట్ పేరిట ఉన్న ఈ ముక్కలన్నీ ఒక్కటి కాకున్నా ఆయా రాష్ట్రాల్లో అది త్రిముఖ పోటీకి దారి తీసే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో పలువురు నాయకులు మూడో ఫ్రంట్ కు సారథ్యం వహించే ఆలోచనల్లో ఉన్నారు. అయితే ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరుగనున్న నేపథ్యంలో ఊహించని సంఘటనలు ఎన్నో జరిగే అవకాశం ఉంది. అవి పోలింగ్ సరళిని మార్చే వీలుంది.

తాజా సర్వేలన్నీ కూడా పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో జరిగినవే. మరి దేశభద్రత అంశం ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకుంటుందా లేకపోతే బీజేపీ పాలన లోటుపాట్లు ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు ముఖ్యంగా మారుతాయా అన్నది కూడా కీలకంగా మారింది. నిజానికి దేశభద్రత అనేది పార్టీకి సంబంధించిన అంశం కానప్పటికీ, దానిపై ట్రేడ్ మార్క్ ను బీజేపీ సాధించగలిగింది. మరి ఎన్నికల్లో బీజేపీ దాన్ని సొమ్ము చేసుకోగలదా అనే దానిపైనే ఆ పార్టీ విజయం ఆధారపడింది. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. 1971లో భారత్ - పాకిస్థాన్ యుద్ధం జరిగి కొత్తగా బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కార్గిల్ యుద్ధ సమయంలోనూ అలానే జరిగింది. తాజా సర్జికల్ స్ట్రైక్స్ రెండు దేశాల మధ్య యుద్ధం స్థాయి తీవ్రత ఉన్నవి కావు. అదే సమయంలో వాటికి ఉన్న ప్రాధాన్యాన్ని కూడా తోసిపుచ్చలేం. కాకపోతే ఈ మెరుపు దాడుల ప్రభావం ఎన్నికల చివరి వరకూ అదే స్థాయిలో ఉంటుందా అనేది కూడా ఆలోచించాలి. చాలా సీట్లకు పోటీ ఏప్రిల్ 23 నుంచి మే 11 వరకు జరుగనుంది. దేశభక్తి, జాతీయ భద్రత అనేవి అంత తక్కువ ప్రాధాన్యం ఉన్న అంశాలేమీ కాదు. సర్జికల్ దాడుల అనంతరం మోడీ గ్రాఫ్ ఏడు శాతం పెరిగింది. కాకపోతే ఆ భావోద్వేగం ఓటర్లలో ఎంత కాలం ఉంటుందన్నదే ప్రశ్న మోడీ ఆకర్షణ, అమిత్ షా నిర్వహణ సామర్థ్యాలే బీజేపీకి ప్రధాన బలాలు కానున్నాయి. బీజేపీ ప్రచార ధోరణి చూస్తుంటే ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్ష తరహా ఎన్నికలను తలపిస్తున్నాయి. భారత ఓటర్లు మోడీని దేశాధ్యక్షుడిగా ఎన్నుకోవాలన్నంత దూకుడుగా బీజేపీ ముందుకు సాగుతోంది. పేదల పక్షపాతిగా, అవినీతి వ్యతిరేకిగా మోడీని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరో వైపున అమిత్ షా పోల్ మేనేజ్ మెంట్ టెక్నిక్స్ విపక్షాలను భయపెడుతున్నాయి. అదే సమయంలో బీజేపీ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఎదుర్కొంటోంది. నిరుద్యోగం, కాంగ్రెస్ కూటమి బలోపేతం కావడం, జీఎస్టీ పోటు, కొన్ని దళిత వర్గాల వ్యతిరేకత లాంటివి బీజేపీని కొంతవరకు దెబ్బతీసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories