ఈశాన్యంలో ఎవరికి వారే అంటున్న పార్టీలు.. కమలానికి ఫ్రెండ్లీ కాంటెస్ట్ లు తప్పవా?

ఈశాన్యంలో ఎవరికి వారే అంటున్న పార్టీలు..  కమలానికి ఫ్రెండ్లీ కాంటెస్ట్ లు తప్పవా?
x
Highlights

ఈశాన్యాన్ని గెలిచేశామన్న ధీమా కమలనాథుల్లో కరిగిపోతోందా? అసెంబ్లీ ఎన్నికల నాటికి పొడిచిన పొత్తులు కాస్తా సార్వత్రిక ఎన్నికల నాటికి మాయమైపోయాయా?...

ఈశాన్యాన్ని గెలిచేశామన్న ధీమా కమలనాథుల్లో కరిగిపోతోందా? అసెంబ్లీ ఎన్నికల నాటికి పొడిచిన పొత్తులు కాస్తా సార్వత్రిక ఎన్నికల నాటికి మాయమైపోయాయా? ఒకప్పుడు మోడీతో జోడీకి రెడీ అయిన ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పుడు ఎవరికి వారే ఎన్నికల రంగంలోకి దిగడానికి కారణమేంటి? బీజేపీ నేత రాం మాధవ్ జాదూ గిరీ ఏమైపోయింది?

కేంద్రంలో మళ్లీ అధికారం కోసం వ్యూహం రచిస్తున్న బీజేపీ మేజిక్ ఫిగర్ చేరుకోడానికి తనదైన శైలిలో స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగానే ఈశాన్య రాష్ట్రాల నుంచి మిత్ర పక్షాలతో కలిపి కనీసం 22 సీట్లు గెలవాలని లెక్కలేసుకుంది. అసలు కమలం ఉనికే లేని ఈశాన్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి రిజల్ట్ సాధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఆరునెలలు అక్కడే ఉండి పార్టీని అక్కడ బలోపేతం చేశారు. ఈశాన్య రాష్ట్రాలతో ఉన్న పొత్తు కారణంగా ఈసారి 22 ఎంపీ సీట్లు గెలవాలని అనుకున్నారు. కానీ ఈ ప్లాన్ కాస్తా వికటించింది. ఒకప్పుడు మోడీ స్నేహ హస్తం కోసం తపించిన ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలన్నీ ఈసారి ఒంటరి పోరుకు రెడీ అయిపోయాయి. గెలుపుపై ఎవరి ధీమా వారికుండటం ఒక కారణమైతే.. ప్రతిపాదిత పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడం మరో కారణం.

ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే ప్రధానంగా అక్కడ ఆరు ప్రాంతీయ పార్టీలున్నాయి. ఈపార్టీల కూటమిని నెడా అని పిలుస్తారు.2016లో బీజేపీ ఆధ్వర్యంలో ఈ కూటమి ఏర్పడింది. ఇందులో అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, ఇండైజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్టిక్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చ పార్టీలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో కలసి కాంగ్రెస్ ని ఒంటరిని చేసిన ఈ పార్టీలు ఇప్పుడు బీజేపీని కాదని ఒంటరి పోటీకి రెడీ అవుతున్నాయి.దీనికి కారణం పౌరసత్వ సవరణ బిల్లేననే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ బిల్లుకి పార్టీలన్నీ ఎదురు తిరగడంతో బీజేపీ డిఫెన్స్ లో పడిపోయింది. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఈ పరిణామంతో బహుముఖ పోటీ తప్పదని తేలిపోయింది. ఈ పరిణామంతో కంగుతిన్న బీజేపీ ఎన్నికల తర్వాతైనా వారితో పొత్తుకు రెడీ అంటోంది.

పౌరసత్వ సవరణ బిల్లు నెడా కూటమిలో కుంపట్లు రాజేసింది. దాంతో ఎవరికి వారు బీజేపీతో స్నేహం కాదనుకుని ఒంటరి పోటీకి రెడీ అయిపోతున్నారు.అంతేకాదు పొరుగు రాష్ట్రాల్లోనూ పోటీకి సై అంటున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ మణిపూర్, మిజోరం, నాగాలాండ్ లతో పాటూ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లు దెబ్బకు అసోం గణ పరిషత్ ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచే తప్పుకుంది. బిల్లు కోల్డ్ స్టోరేజ్ పాలవడంతో ఏజీపీ మళ్లీ బీజేపీకి దగ్గరవుతోంది.

ఇక సిక్కింలో కూడా బీజేపీ మిత్రులు దూరమై పోయారు. జమిలి ఎన్నికలకు వెడుతున్న సిక్కింలో ప్రాంతీయ పార్టీలే బలమైనవిగా అడుగులేస్తున్నాయి. ఒకప్పుడు వ్యూహాత్మక ఎత్తుగడలతో ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ జెండా పీకేసిన బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి మళ్లీ ఒంటరిదైపోయింది. కేంద్రంలో ఈసారి ప్రాంతీయ పార్టీల కూటమే అధికారం లోకి వచ్చే అవకాశముందన్న వార్తలు ఇక్కడి ప్రాంతీయ పార్టీలలో ఆశలు పెంచుతున్నాయి. అందుకే అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీకి సమదూరం పాటిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే పొత్తులపై ఇంకా ఆశ చావని బీజేపి ఎన్నికల తర్వాత నెడా కూటమితో మళ్లీ చేతులు కలుపుతామంటూ సంకేతాలు వదులుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories