Top
logo

అసలు సిల్వర్‌స్క్రీన్‌పై ఎందుకీ బయో వార్‌

అసలు సిల్వర్‌స్క్రీన్‌పై ఎందుకీ బయో వార్‌
Highlights

పొలిటికల్ బయోపిక్‌లు, సిల్వర్‌ స్క్రీన్‌పై రచ్చరచ్చ చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నటీఆర్‌పై వస్తున్న ...

పొలిటికల్ బయోపిక్‌లు, సిల్వర్‌ స్క్రీన్‌పై రచ్చరచ్చ చేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నటీఆర్‌పై వస్తున్న రెండు సినిమాలు, విడుదలకు ముందే ఎంత సంచలనంా మారాయో, ప్రతిరోజూ చూస్తున్నాం. ఇక వైఎస్‌ జీవితంపైనా సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికల ముంగిట్లోనే ఇవన్నీ, విడుదల అవుతున్నాయి. అమెరికా నుంచి ఇండియా వరకూ, అనేకమంది రాజకీయ ఉద్దండుల జీవిత చిత్రాలు, వివాదాలయ్యాయి.

తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు, రాజకీయ ప్రభంజనమై చరిత్ర సృష్టించిన ఉద్దండుడు నందమూరి తారక రామారావు, జీవితం ఆధారంగా ఈ చిత్రం వస్తోంది. క్రిష్ దర్శకుడు. ఎన్టీఆర్‌ పాత్రలో, ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా, వరుసగా జనవరి, ఫిబ్రవరిలో విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక సరిగ్గా క్రిష్‌ మూవీ ఎండింగ్ పాయింట్ నుంచి మొదలవబోతోంది రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇదే అత్యంత వివాదం రేపుతోంది. చంద్రబాబును విలన్‌గా చిత్రీకరించేందుకే, ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ వెనకుండి ఈ సినిమాను నిర్మిస్తోందని, ఎన్నికల్లో లబ్ది కోసమే, కుట్ర చేస్తున్నారని అంటున్నారు. ఇది కూడా వచ్చే ఏడాది రిలీజ్‌ అవుతోంది.

ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి, జీవితం నేపథ్యంలో వస్తున్న యాత్ర కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో ఎవరు విలన్ అవుతారో, ఎలాంటి పొలిటికల్‌ క్యారెక్టర్లు దర్శనమిస్తాయోనన్న చర్చ జరుగుతోంది. గతంలో మహాత్మా గాంధీ బయోపిక్‌ కూడా అనేక వివాదాలు రేపింది. ఇండియాలో విడుదల చేయరాదంటూ నిరసనలు జరిగాయి. ఇందూ సర్కార్ సినిమా కూడా అనేక వివాదాలు రాజేసింది. ఎమర్జెన్సీ టైంలో ఇందిర, సంజయ్‌లు వ్యవహరించిన తీరు, ఇతివృత్తంగా సినిమా వచ్చింది. తమిళ ప్రజల ఆరాధ్య నటుడు, రాజకీయ దురంధరుడు ఎంజీ రామచంద్రన్‌ జీవిత కథ ఆధారంగా సినిమా. దీనిపై కావాల్సినంత కాంట్రావర్సీ. ఇక త్వరలో జయలలిత జీవితం కూడా తెరకెక్కబోతోంది. నిత్యామీనన్‌, జయలలితగా నటిస్తోంది.

సినిమా అనేది బలమైన మాధ్యమం. అనేక బయోపిక్‌లు వస్తుంటాయి. కానీ ప్రజాబాహుళ్యంలో ఎంతో పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖుల జీవితకథ చిత్రాలు మాత్రం, అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. పుస్తకాల రూపంలో చదివినా, సినిమాగా వస్తే, వారి జీవితం కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. సినిమా నిర్మించేవాళ్లకు విడుదలకు ముందే కావాల్సినంత పబ్లిసిిటీ వస్తుంది. కాంట్రావర్సితో కలెక్షన్లు కూడా పెరుగుతాయి. కానీ సినిమా ఇతివృత్తంలో కీలక పాత్రధారులను ఎలా చూపెడుతున్నారన్నదే అసలు విషయం. రాజకీయ కారణాలు, ప్రయోజానాలతో గొప్ప నాయకుని జీవితంలో కీలకమైన, వివాదమైన అంశాలను తప్పులుగా చిత్రీకరించి, జనంలో చెడుగా ముద్ర వేసేందుకూ ఆయుధంగా ప్రయోగిస్తారు కొందరు. అలాగే తమకు నచ్చిన నేతను, మరింత గొప్ప నాయకుడిగా చూపెడతారు. ఇందులో ఎవరికి కావాల్సిన రాజకీయ ప్రయోజనాలు వారికుంటాయి.

అయితే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌లు, సరిగ్గా ఎన్నికల సమయంలో వస్తున్నాయి. అదే అన్నింటికీ కాంట్రావర్సీకి కేంద్ర బిందువవుతోంది. జనాలను ప్రభావితం చేసేందుకేనని, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు, వైసీపీ, బీజేపీలపై విమర్శలు చేస్తున్నారు. అయితే సినిమాలతో జనాలు ప్రభావితం అవుతారా అన్నది చెప్పలేం. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ తమ అనుభవంలోంచి కూడా, ఫలానా క్యారెక్టర్లను అంచనా వేస్తారు. తప్పయితే, తప్పంటారు. సరైందయితే ఓకే అంటారు. అయితే భావ ప్రకటనా స్వేచ్చ రాజ్యాంగ హక్కు. సినిమా, పుస్తకాలకూ ఇదే వర్తిస్తుంది. సెన్సార్‌లతో దేననీ కట్టడి చేయలేరు. ప్రజలే సెన్సార్‌‌ వేస్తారు. ప్రజలే తీర్పిస్తారు. ప్రజలే కరెక్టేదో, తప్పేదో నిర్ణయిస్తారు.

Next Story