Top
logo

బెంగాల్ లో కమ్యూనిస్టుల కథ కంచికి చేరిందా?

బెంగాల్ లో కమ్యూనిస్టుల కథ కంచికి చేరిందా?
X
Highlights

కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్ లో ఎర్రజెండా రెప రెపలు ఇక కలేనా? బెంగాల్ గడ్డను దశాబ్దాల పాటూ అజేయంగా ఏలిన ...

కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్ లో ఎర్రజెండా రెప రెపలు ఇక కలేనా? బెంగాల్ గడ్డను దశాబ్దాల పాటూ అజేయంగా ఏలిన లెఫ్ట్ పార్టీలు 2019 ఎన్నికల నాటికి పూర్తిగా చతికిలబడిపోయాయా? మమతా దీదీ రాజకీయ వ్యూ హం ముందు లెఫ్ట్ రాజకీయం ఎందుకు ఓడిపోతోంది?

బెంగాల్ లో లెఫ్ట్ పార్టీల హవా ముగిసిపోతోందా? 1977 నుంచి దశాబ్దం పాటూ రాష్ట్రాన్ని అజేయంగా ఏలిన లెఫ్ట్ ఫ్రంట్ ఆ తర్వాత రాను రానుకుప్ప కూలిపోయింది. చతికిలబడిపోయింది. జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీ లాంటి అగ్ర నేతల మరణం తర్వాత పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారు. సరైన నాయకత్వం లేక ఓటు బ్యాంకు, కేడర్ అధికార టీఎంసీ గూటికి చేరిపోతున్నారు. మరికొందరు కమలం పంచన సేద తీరుతున్నారు. బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ హస్తగతం అయ్యాక అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది . కొంత వరకూ సక్సెస్ అయింది కూడా రాష్ట్రంలో ఇప్పటికే చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది.

తృణమూల్, బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నాలుగు నాలుగు దార్లలో ప్రయాణిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసిన లెఫ్ట్ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే లెఫ్ట్ కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం.. అత్యంత కఠినమైన పరీక్ష. 2014 ఎన్నికల్లో42 ఎంపీ సీట్లకు వామపక్ష కూటమి గెలిచినది కేవలం రెండు సీట్లు. ఈసారి ఎన్నికలకోసం కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించినా అది వర్కవుట్ కాలేదు. సీట్ల సర్దుబాటు జరిగి ఉంటే కీలక స్థానాల్లో టీఎంసీ ఆధిపత్యానికి చెక్ పెట్టే వారమని వామపక్ష నేతలు చెబుతున్న మాట. గత ఎన్నికల్లో వామపక్షం గెలుచుకున్న ఆ రెండు సీట్లు కూడా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది. వామపక్షాలకు ఓటు బ్యాంకుగా పరిగణించే మైనారిటీలు, గ్రామీణ బెంగాల్ ఓటర్లు టీఎంసీ పక్షం చేరిపోగా, శరణార్ధులు బీజేపీ పక్షం చేరిపోయారు.

జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి నేతల సమర్ధ నాయకత్వం నేటి తరం నేతలలో కొరవడింది. వారు గతించి ఇన్నేళ్లయినా ఇప్పటికీ వారికి ప్రత్యామ్నాయం తయారు కాలేదంటేనే అక్కడ వామపక్షాలు ఎంత నిర్వీర్యమైపోయాయో అర్ధం చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని 77వేల పోలింట్ స్టేషన్లలో కనీసం 30 శాతం స్టేషన్లకు పోలింగ్ ఏజెంట్లు కూడా లేని దీన స్థితిలో లెఫ్ట్ పార్టీ ఉంది. 30 ఏళ్లు సుదీర్ఘ పాలనలో వామపక్షాలలో నిర్లక్ష్యం పెరిగిపోయింది. పార్టీని సంస్కరించే నాధుడే లేకపోయాడు. ఆ తర్వాత హటాత్తుగా అధికారం కోల్పోడంతో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కార్యకర్తలను పెంచడానికి బ్రిగేడ్ ర్యాలీ లాంటివి ఏర్పాటు చేస్తున్నా అవి ఓట్లుగా మారడం లేదు.

అధికార తృణమూల్ ధాటికి సీపీఎం కకావికలమైపోయింది. బీజేపీని ఎదిరించడంలో మమతా బెనర్జీ విపక్షాలను ఏకం చేసేస్తుండటంతో ప్రతిపక్ష పాత్ర కూడా దక్కడం లేదు.

1980లో మాత్రమే లెఫ్ట్ ఫ్రంట్ 38 ఎంపీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. 2004లో34 ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయక పాత్ర పోషించింది. మైనారిటీల అధ్వాన్న స్థితి, నందిగ్రామ్, సింగూర్ ఆందోళనలు మమతా బెనర్జీ బలాన్ని పెంచడమే కాదు.. రూరల్ బెంగాల్లో కమ్యూనిస్టుల ఓటు బ్యాంకును తుడిచి పెట్టేశాయి.2009 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మెజారిటీ 15కు పడిపోయింది. 2014 ఎన్నికల టైం వచ్చే సరికి అది కాస్తా రెండు సీట్లకు తగ్గిపోయింది.. ఈసారి ఎన్నికల్లో ఆ రెండు సీట్లు కూడా వచ్చే ఆస్కారం లేదని సర్వేలు చెబుతున్నాయి.. మమతా బెనర్జీ సమర్ధ నాయకత్వం బెంగాల్ పై ఆమెకు మంచి పట్టును పెంచాయి.మరోవైపు బీజేపీ కూడా బెంగాల్ లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో లెఫ్ట్ పార్టీల పని అయిపోయినట్లే కనిపిస్తోంది. మతతత్వ బీజేపీతో తలపడటానికి తృణమూల్ మాత్రమే సరైన లౌకిక వాద ప్రజాస్వామ్య బలగంగా బెంగాల్ ప్రజలు నమ్ముతున్నారు. మొత్తం 42 ఎంపీ సీట్లున్న బెంగాల్ లో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ కు 34, కాంగ్రెస్ కు 4, బీజేపీకి2, వామపక్షాలకు రెండు సీట్లు ఉన్నాయి. రేపటి ఎన్నికల్లో మరి ఏపార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.

Next Story