ఓట్ల క్రీడలో పావులవుతుంది ఎవరు... ఆయోధ్యతో ఆడుకుంటున్నదెవరు?

ఓట్ల క్రీడలో పావులవుతుంది ఎవరు... ఆయోధ్యతో ఆడుకుంటున్నదెవరు?
x
Highlights

ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయింది అయోధ్య రామమందిరం-మసీదు వివాదం. 1992 బాబ్రీ విధ్వంసం తర్వాత, బీజేపీకి ఈ ఇష్యూ దేశమంతా ఓటు బ్యాంకుకు పునాది...

ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయింది అయోధ్య రామమందిరం-మసీదు వివాదం. 1992 బాబ్రీ విధ్వంసం తర్వాత, బీజేపీకి ఈ ఇష్యూ దేశమంతా ఓటు బ్యాంకుకు పునాది వేసింది. రాముని మందిరం నిర్మిస్తామని ప్రతి ఎన్నికల టైంలోనే వాగ్ధానమిస్తూనే ఉంది. అయితే కొన్నేళ్లు అయోధ్య ఇష్యూను అసలు పట్టించుకోలేదు. ముఖ్యంగా 2009, 2014లో అయోధ్యను ఒక అంశంగా భావించలేదు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం, ఎన్నికల ముంగిట్లో అయోధ్యను మరోసారి రగిలించాలని, ప్రయత్నిస్తోంది. అటు శబరిమల అయ్యప్ప టెంపుల్‌ ఎంతోకొంత మైలేజ్ ఇవ్వగా, అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్‌ కూడా ఓట్లు రాలుస్తుందని దీమాగా ఉంది. ఇదే టైంలో అయోధ్యను అస్త్రంగా ప్రయోగిస్తే, ఇక తిరుగే ఉండదని ఆలోచనలు చేస్తోంది. అయితే, బంతి కోర్టు పరిధిలో ఉండటం, మోడీ ముందరికాళ్లకు బంధనం వేస్తోంది. కోర్టుతో పనిలేకుండా ఎన్నికల్లోపు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని, ఆరెస్సెస్, వీహెచ్‌పీతో పాటు కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోనూ కాషాయ సర్కారే. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సిద్దమని ప్రకటించారు. అయితే కోర్టు పరిధిలో ఉందని అంటున్నారు. మరోవైపు అయోధ్యపై వేడి చల్లారకుండా, రాముని పేరుతో అనేక కట్టడాలు నిర్మిస్తున్నారు యోగి. అయోధ్య చుట్టూ ఆధ్యాత్మిక, టూరిజం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముని విగ్రహాన్ని అయోధ్యలో నిర్మిస్తామంటున్నారు. బీజేపీకి కీలకమైన యూపీలో, ఇలాంటి చర్యలు, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తాయని, కాషాయ నేతలు లెక్కలేస్తున్నారు. అయితే మందిర నిర్మాణం బీజేపీ కావాలనే వాయిదా వేస్తోందని, అందుకే భక్తుల దృష్టిని మళ్లించేందుకు రాముని విగ్రహం గురించి మాట్లాడుతోందని విశ్లేషిస్తున్నారు. అయోధ్యపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో, జనవరిలో ఏఎన్‌ఐతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, కోర్టు ప్రక్రియ పూర్తయిన తర్వాతే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

మరోవైపు ముస్లిం సంఘాలు కూడా సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం నియమించడాన్ని స్వాగతించాయి. అతితర్వలో ఈ వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే కోర్టు తీర్పును బట్టి, తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశాయి. మరోవైపు కోర్టు బయట రాజీ మార్గమే మేలని, సుప్రీం కోర్టు ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి సిద్దమని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ ప్రకటించారు. కానీ రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల ఫలప్రదం ఎండమావిలానే కనిపిస్తోంది. అయితే అయోధ్యపై మరికొన్ని రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదో ఒకటి చేయబోతోందని అందరూ అనుకుంటున్నారు. ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్‌ కోసం, అయోధ్యపై ఆర్డినెన్స్ తీసుకురావొచ్చని తెలుస్తోంది. కానీ అంతలోపు సుప్రీం ధర్మాసనం తీర్పు రాదు. మరోవైపు కోర్టు తీర్పు తర్వాతే, ఏ నిర్ణయమైనా అని బీజేపీ అంటోంది. దీన్ని బట్టి చూస్తుంటే, అయోధ్య ఇష్యూ, ఇప్పుడు సమసిపోయేలా లేదు. అటు అయోధ్యకాండలో తాము వెనకబడకుండా నిశితంగా గమనిస్తోంది కాంగ్రెస్. బీజేపీ అడుగులను బట్టి, పావులు కదపాలనుకుంటోంది. అయోధ్య నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నా, సామరస్యపూర్వక పరిష్కారం కోరుతున్నామంటోంది. కానీ అయోధ్య వివాదందో, భావోద్వేగాలను రెచ్చగొట్టాలని బీజేపీ చూస్తోందని ఆరోపిస్తోంది. ఇప్పటికే అనేక టెంపుల్స్ సందర్శిస్తూ బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని భావిస్తున్న రాహుల్ గాంధీ, మూడేళ్ల క్రితం అయోధ్యనూ దర్శించారు. ఇలా అయోధ్య రెండు పార్టీలకూ ఓట్లు కుమ్మరించే అక్షయపాత్రలానే కనిపిస్తోంది. అందుకే అమ్ములపొదిలోని రామబాణాన్ని ఖర్చు చేయకుండా, ఇష్యూనే అలాగే ఉంచేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. కానీ పార్టీల ఓట్ల క్రీడలో పావులు జనాలే.

Show Full Article
Print Article
Next Story
More Stories