ఎన్నికల్లో హిందూ సెంటిమెంట్.. ఓట్ల వేట కోసమేనా?

ఎన్నికల్లో హిందూ సెంటిమెంట్.. ఓట్ల వేట కోసమేనా?
x
Highlights

2019 ఎన్నికలు కురుక్షేత్ర మహాయుద్ధాన్ని తలపిస్తున్నాయి. పార్టీలన్నీ ఎవరికి తోచిన రీతిలో వారు హిందూ సెంటిమెంట్ ను ఎజెండాగా పెట్టకుని ఓట్ల రాజకీయం...

2019 ఎన్నికలు కురుక్షేత్ర మహాయుద్ధాన్ని తలపిస్తున్నాయి. పార్టీలన్నీ ఎవరికి తోచిన రీతిలో వారు హిందూ సెంటిమెంట్ ను ఎజెండాగా పెట్టకుని ఓట్ల రాజకీయం చేస్తున్నారు. అన్ని పార్టీలు అభివృద్ధి సంక్షేమంపై చర్చను గాలి కొదిలేశారు. కేవలం హిందూమతంపైనే రాజకీయ ఓట్ల వేట మొదలు పెట్టేశారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో హిందూవాదం గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తోంది.

తాజాగా మమతా బెనర్జీ కూడా ఇదే గోదాలోకి దిగిపోయారు. హిందువునని పదే పదే చెప్పుకునే మోడీ, అమిత్ షాలకు ఆమె నేరుగా సవాల్ విసిరారు. దమ్ముంటే వారిద్దరూ సంస్కృత మంత్రాలను సరిగా ఉచ్ఛరించాలని సవాల్ విసిరారు. మోడీ, అమిత్ షా ఇద్దరూ హిందూత్వ రాజకీయాలకు తెర తీశారంటూ మండిపడ్డారు. వారిద్దరికీ నోరు తిరిగితే ముందు సంస్కృత మంత్రాలను ఉచ్ఛరించి చూపాలన్నారు. నుదుటన తిలకం పెట్టుకుని కాషాయం కట్టి పూజలో కూర్చుంటే సరిపోదని మంత్రాలు వల్లించడంలో తనతో పోటీకి రావాలని మమతా రెచ్చగొట్టారు. గతంలో మమతా దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గా పూజను ఆపేయడంపై బీజేపి మండిపడింది. అప్పటి నుంచి మమతా, మోడీల మధ్య వార్ జరుగుతూనే ఉంది.

ఇక బీజేపీ హిందూత్వ గురించి చెప్పనక్కర లేదు. మోడీ ఆలయాలలో పూజలు చేయడంలో ముందుంటారు. సాక్షాత్తూ తన నియోజక వర్గాన్నే ఆలయాల సన్నిధి అయిన వారణాసిని ఎంచుకున్నారు. బీజేపి రామ మందిర నినాదంతో అడుగులేస్తోంది. ఇక అధికారానికి కీలకమైన యూపీని యోగీ పూర్తి హిందూ రాజ్యంగా మార్చేసారు. హిందూ సంస్కృతి, సంప్రదాయలకు పెద్ద పీట వేశారు. అమిత్ షా, మోడీ ప్రసంగాల్లోనూ తరచుగా హిందూత్వ నినాదమే ఉంటుంది.

గెలుపుకు హిందూత్వ నినాదం ఒక సెంటిమెంట్ గా మారడంతో పార్టీలన్నీ ఇదే గోదాలోకి దిగిపోయాయి. వందేళ్ల వయసున్న కాంగ్రెస్, సెక్యులర్ వాదాన్ని బలంగా నిలిపే కాంగ్రెస్ సైతం హిందూ సెంటిమెంట్ కు తలవంచేసింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో రాహుల్ హిందూత్వను జపిస్తున్నారు.. రాహుల్ హిందూ సెంటిమెంట్ రంగరించడంతో మంచి ఫలితాలే కనిపించాయి. గుజరాత్ లో అధికారం దక్కకపోయినా తక్కువ మెజారిటీతో ఓడిపోయింది కాంగ్రెస్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు హిందూ సెంటిమెంట్ కూడా కలిసొచ్చిందన్న భావన ఉంది. ఈసారి యూపీ ఎన్నికల కోసం, మోడీని ఢీ కొనేందుకు రాహుల్ ప్రియాంకను రంగంలోకి దింపారు. ప్రియాంక గాంధీ వాద్రా గంగానది యాత్ర కూడా హిందూత్వ సెంటిమెంట్ లో భాగమే..పూర్తిగా ఆలయాలు సందర్శిస్తూ దేవుళ్లను మొక్కుతూ ప్రజల్లో మమేకమవుతూ ఆమె సాగించారు.

గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కూడా ఇదే హిందూ సెంటిమెంట్ నే నమ్ముకున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు రాహుల్ హిందూ సెంటిమెంట్ పైనే ఓట్లడిగారు.. గత సార్వత్రిక ఎన్నికల నాటినుంచి యూపీలో రాహుల్ హిందూ ఆలయాలను దర్శించడం మొదలు పెట్టారు. నుదుటన తిలకం దిద్దుకుని, జంధ్యం ధరించి గోత్ర నామాలతో పూజలు చేశారు.తాను హిందువునని చాటుకున్నారు. కైలాస మానస సరోవరం వెళ్లారు. అసలైన శివభక్తుడినని చెప్పుకున్నారు.

ఇలా బీజేపీ వేసిన ట్రాప్ లో రాజకీయ పార్టీలన్నీ ముందూ వెనకా ఆలోచించకుండా హిందూత్వ గోదాలో దూకేశాయి. శక్తివంతమైన మమతా బెనర్జీ లాంటి నేతలు సైతం బీజేపీ జిమ్మిక్కుల ట్రాప్ లో పడిపోయారు. పరిస్థితి చూస్తుంటే బీజేపి ఈసారి గెలిస్తే హిందూ రాజ్యస్థాపన దిశగా అడుగులు పడినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories