ఏక పక్షమా... ఎదురీతా?ఎవరికి వారే యమునా తీరే..

ఏక పక్షమా... ఎదురీతా?ఎవరికి వారే యమునా తీరే..
x
Highlights

మరిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగబోతోంది. రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి.? లోక్‌సభ-అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న ఈ సమయంలో అధికారం మళ్లీ...

మరిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగబోతోంది. రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి.? లోక్‌సభ-అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న ఈ సమయంలో అధికారం మళ్లీ తెలుగుదేశం హస్తగతం అవుతుందా? ఫ్యాన్‌ హైస్పీడ్‌తో తిరుగుతుందా? జనసేనుడు పీఠమెక్కి జై కొడతారా? కమలం వికసిస్తుందా? కాంగ్రెస్‌ కదం తొక్కతుందా? ఏపీ మూడ్‌ ఏం చెబుతోందసలు?

ఏపీలో చంద్రబాబు అధికారాన్ని నిలబెట్టడానికి తెలుగుదేశం సంప్రదాయ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయినా కావచ్చుగానీ, కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లు మాత్రం తెలుగుదేశానికి వచ్చే ఛాన్స్‌ లేవంటున్నారు విశ్లేషకులు. అలాంటి పరిస్థితే వస్తే, కాంగ్రెస్ సాంప్రదాయ ఓటర్లు జగన్‌కు మద్దతు పలికే అవకాశాలున్నాయని చెబుతున్నారు. చంద్రబాబు కన్నా జగన్ తమకు దగ్గరివాడని వాళ్లు భావిస్తే సీను మారే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనుకోవడానికి ఇదొక కారణంగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉండనప్పటికీ జాతీయంగా బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మాత్రం చంద్రబాబు తమతోనే ఉంటారని కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం చెబుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక కోటి 57 లక్షల ఓట్లు రాగా వైసీపీకి ఒక కోటి 35 అయిదు లక్షల ఓట్లు వచ్చాయి. తేడా 22 లక్షల ఓట్లు మాత్రమే. అంటే. 4.63 శాతం. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీకి ఓ 12 లక్షల ఓట్లు తగ్గితే గెలుపు తమదే అనే ధీమాలో ఉంది వైసీపీ. గతంలో టీడీపీతో పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన ఈసారి విడిగా పోటీలో వున్నారు. అదీగాక ఐదేళ్ళ పాలన వల్ల అధికార పార్టీ మీద ప్రజల్లో అసంతృప్తి కూడా వుంటుంది. ఎన్నికల అర్థమెటిక్స్ ప్రకారం ఏపీలో ఇప్పుడు ప్రతి ఒక్క ఓటు అటు అధికార పార్టీకీ, ఇటు ప్రతిపక్షాలకు కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ! ఇక్కడ ప్రతి ఓటూ కౌంటే కాబట్టి.

ఏపీలో వాస్తవానికి కాంగ్రెస్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రాష్ట్ర విభజన ఆక్రోశం మొత్తాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మీద వెళ్లగక్కారు. ఆ పార్టీకి ప్రస్తుతం ఒక్క శాసనసభ్యుడు కూడా లేడు. పార్టీకి జవసత్వాలు పోయగల ఆర్ధిక స్తోమత కూడా లేదు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం సాగినపుడు కాంగ్రెస్ ప్రాధాన్యం ఒకటి రెండు నెలలు కొంచెం పెరిగినట్టు కనిపించినా అది కొనసాగలేదు. అయినప్పటికీ, కాంగ్రెస్‌కు ఎంతో కొంత ఓటు బ్యాంకు ఇప్పటికీ వుంది. ప్రియాంక ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ అభిమానుల్లో సహజంగానే కొంత ఉత్సాహం వచ్చింది. రాహుల్ శాంత స్వభావానికి, ప్రియాంక వేగం తోడయితే కాంగ్రెస్‌కు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆ పార్టీ ఏపీ నేతలు ఆశిస్తున్నారు. పైగా, కాంగ్రెస్‌కు సెక్యూలర్ పార్టీ అనే పేరుంది. పార్టీ ఏ మాత్రం పుంజుకున్నా మైనారిటీలు, మతసామరస్యవాదులు అటుగా చూసే అవకాశాలు లేకపోలేదు. ఈ ఎన్నికల వరకు యాంటి కుంబెన్సీ ఓట్లు ప్రత్యర్ధులకు పోకుండా కాంగ్రెస్‌కు పడినా చాలనే వ్యూహంతో ఆ రెండు పార్టీలు వున్నాయి.

రాజకీయ పొత్తులకు ఏపీలో ఇంకో కోణం కూడా వుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెంటనే.. చంద్రబాబు మనకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు... మనం కూడా తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. సామాన్య జనంతో సహా చాలా మంది కేసిఆర్ ప్రకటనను ప్రతీకారం తీర్చుకుంటారన్న అర్ధంలో అన్వయం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏపీలో జగన్‌తో కలిసి చంద్రబాబును ఓడించడానికి కృషి చేస్తుందని మరికొందరు అన్వయించుకున్నారు. కానీ తరచి చూస్తే, కేసీఆర్ మాటలకు వేరే ఫలితాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలుపు అనివార్యం అయినప్పటికీ 80 శాతం సీట్లు దక్కించుకోవడంపై కొన్ని విశ్లేషణలున్నాయి. అందుకు ప్రధాన కారణం చంద్రబాబునేని బహిరంగంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి కేసిఆర్‌కు తిరుగులేని మెజారిటీని సమకూర్చారన్నది అభిప్రాయం. ది చంద్రబాబు నుండి కేసిఆర్‌కు అందిన గిఫ్ట్. కేసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే తార్కికంగా ఏం చేయాలీ? ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌తో కలిసి చంద్రబాబును మళ్ళీ గెలిపించాలి అనే అర్థం వస్తుంది!. చంద్రబాబును తెలంగాణ ఓటర్లు ఎలా చూస్తారో కేసిఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అలానే చూస్తారు. ఈ మర్మం తెలియని జగన్... కేటిఆర్‌ను తన నివాసానికి ఆహ్వానించి భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలను చర్చించారు. జగన్, కేటిఆర్ సమావేశం ఏపీలో సహజంగానే టిడిపికి రిటర్న్ గిఫ్ట్‌గా మారిందంటున్నారు విశ్లేషకులు.

రాజకీయాల్లో చంద్రబాబు తిరిగినన్ని మలుపులు మరెవరూ తిరిగి వుండరు. అయితే, ఈ విషయంలో జగన్‌కూ చంద్రబాబుకు ఒక చిన్న తేడా వుంది. చంద్రబాబు రాజకీయ మార్పులన్నింటినీ బాహాటంగానే చేశారు. మోడీని నెత్తిన పెట్టుకుని ఊరేగినపుడు ఆయన్ను ప్రతిరోజూ పొగడ్తలతో ముంచేసేవారు. మోదీతో విభేదించాక ఆయన్ను ప్రతిరోజూ విమర్శిస్తూనే వున్నారు. మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే తమ ధ్యేయం అని బాహాటంగా అంటున్నారు. జగన్ అలా కాదు. వచ్చే ఎన్నికల్లో మోడీని వ్యతిరేకిస్తానని వారు గట్టిగా చెప్పలేకపోతున్నారు. పోనీ, మోడీని సమర్ధిస్తానని కూడా వారు నోరు విప్పి చెప్పుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో ఇదొక స్థితి.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంది పవన్‌ పవర్‌ గురించి. కాపు ఓట్లను కొల్లగొట్టడంలో కులం పోలరైజేషన్‌లో పవన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్న ప్రచారం ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆయన సోదరుడు నాగబాబు. గతంలో నాగబాబు... బాలయ్యతో జరిగిన వివాదాస్పద చర్చ... వారి కులాల మధ్య చర్చకు, రచ్చకు దారితీసిందన్న అభిప్రాయం ఆ రెండు కులాల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో కులక్యులేషన్‌ ఎటు వైపు నుంచి ఎటు తిరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories