మాటల ఈటెల వెనక కథేంటి?

మాటల ఈటెల వెనక కథేంటి?
x
Highlights

తూటాల్లాంటి మాటలతో ఉద్యమంలో అగ్గిరాజేసిన ఈటెల రాజేందర్ భగ్గుమన్నారు. గులాబీదళంలో పరోక్షంగా ధిక్కారస్వరం వినిపించారు. అగ్నిపర్వతం బద్దలైనట్టు, ఎంత వేగంగా బద్దలయ్యారో, అంతే వేగంగా చల్లబడ్డారు.

తూటాల్లాంటి మాటలతో ఉద్యమంలో అగ్గిరాజేసిన ఈటెల రాజేందర్ భగ్గుమన్నారు. గులాబీదళంలో పరోక్షంగా ధిక్కారస్వరం వినిపించారు. అగ్నిపర్వతం బద్దలైనట్టు, ఎంత వేగంగా బద్దలయ్యారో, అంతే వేగంగా చల్లబడ్డారు. తన ప్రసంగం, మీడియాలో ఒక్కసారిగా సంచలనం కావడం, ఆ వెంటనే ఈటెల మరో ప్రకటన చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ మధ్యలో ఏం జరిగింది...అధిష్టాన పెద్దలు వెంటనే రంగంలోకి దిగి, ఈటెలను ఎలా చల్లబరిచారు...ఈటెల తన పంతం నెగ్గించుకున్నట్టేనా....తన సందేశం ఎవరికి చేరాలో, వారికి చేర్చడంలో సక్సెస్‌ అయ్యారా? గులాబీదళంలో ఈటెల దుమారం సద్దుమణిగినట్టేనా.. ఈ మొత్తం ఎపిసోడ్‌‌లో నెగ్గింది ఎవరు...తగ్గింది ఎవరు?.

గులాబీదళంలో ఎందుకీ అసంతృప్తి జ్వాలలు.. అధినేత మాటపై కట్టుదాటని టీఆర్‌ఎస్‌‌లో, ఆగ్రహ గళం ఎందుకు కట్టలు తెంచుకుంది...ఉద్యమంలో ఈటెల్లాంటి మాటలు పేల్చిన మంత్రి ఈటెల రాజేందర్‌, ఇప్పుడు తన అంతరంగంలో బడబాగ్ని ఒక్కసాగిరా అగ్నిపర్వతంలా బద్దలు చేసేశారా...కొన్నాళ్లుగా తనపై సాగుతున్న ప్రచారంపై, నివురుగప్పినా నిప్పులా వున్న ఆయన, ఒక్కసారిగా ఎందుకు బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది. మాటల ఈటెల వెనక, అసలు కథేంటి?

విన్నారుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు. ఈటెల మాటలు ఇప్పుడు, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృప్టిస్తున్నాయి. కేసీఆరే మా నాయకుడు, తానెప్పటికీ గులాబీ సైనికుడినేనన్న ఈటెల, పార్టీ అధిష్టానంపై పల్లెత్తు మాటా అనలేదు. హైకమాండ్‌కు చాలా దగ్గరగా ఉండే ఓ నేతపై తనకున్న ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారని అర్థమవుతోంది. కావాలనే తన గురించి కొన్ని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు రాతలు రాయిస్తున్నారని, అందుకే తన బాధనంతా వెళ్లగక్కారని కొందరు, ఈటెల మాటలను విశ్లేషిస్తున్నారు. మంత్రి పదవి తనకు భిక్ష కాదు, బీసీ కోటాలో మంత్రి పదవి అడగలేదన్నారు ఈటెల. న్యాయం, ధర్మం నుంచి ఎవరూ తప్పించుకోలేరు, ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదని ఘాటైన కామెంట్లు చేశారు. అంతేకాదు, త్వరలో హీరోలెవరో, జీరోలు ఎవరో తేలుతుందని, భవిష్యత్తులో తాను చెప్పబోయే విషయాలు, ఎలాంటి మంటలు రాజేస్తాయో చెప్పకనే చెప్పారు. ఈటెలలో ఉన్న ఇంత అసంతృప్తికి కారణమేంటి. ఈటెల కోపం ఎవరిపై అన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

టీఆర్ఎస్‌ తొలి ప్రభుత్వంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్. అయితే మలి ప్రభుత్వం మంత్రివర్గ ఏర్పాటు టైంలోనే, అనూహ్య పరిణామాలు కొన్ని జరిగాయన్న చర్చ జరుగుతోంది. 2018 డిసెంబర్‌లో ఎన్నికలు జరిగి, టీఆర్ఎస్‌ విజయం సాధించిన తర్వాత, ఏర్పాటు చేయబోతున్న కేబినెట్‌లో, ఈటెల పేరు చివరి వరకూ వినిపించలేదట. అందరి పేర్లనూ ఖరారు చేసిన తర్వాత, ఆఖరుకు, రాత్రి పదకొండున్నరకు, ఈటెల రాజేందర్‌ పేరును జాబితాలో చేర్చారట. అదే ఈటలను నొప్పించిందట. ఆర్థిక శాఖను కాకుండా, మరో శాఖను ఇవ్వడం ద్వారా, తన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని ఈటెల ఫీలయ్యారట. ఇది తొలి పరిణామంగా చర్చ జరుగుతోంది.

మరోవైపు పార్టీలో కొందరి కుట్ర కారణంగా మంత్రి పదవి ఇవ్వకుండా సతాయించారని ఈటెల భావించారు. బీసీ సమీకరణాల్లో భాగంగానే చోటు కల్పించాల్సి వచ్చిందని పార్టీ నేతలు ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. అటు కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి జరిగిన ఎన్నికల్లో, టీఆర్ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ గెలిచారు. అయితే ఈ ఓటమికి ఈటెల సమన్వయ లోపమే కారణమని, కొందరు టీఆర్ఎస్‌ నేతలే హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల కోసం, నియోజకవర్గాల సమన్వయకర్తగా వ్యవహరించారట ఈటెల. కానీ కొందరు ఎమ్మెల్యేలే సహకరించలేదని ఈటల రాజేందరే తన వెర్షన్‌ వినిపించారట. అంతేకాదు, మొత్తం నియోజకవర్గంలో వినోద్‌కు ఎక్కువ మోజార్టీ ఈటెల నియోజక వర్గంలోనే వచ్చింది.. అయినా వినోద్ ఓటమికి ఈటెలనే బాధ్యున్ని చేశారన్న చర్చ పార్టీ నేతల్లో జరిగింది. అది తనను బాధించిందని, ఈటెల తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారట.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మంత్రి పదవి కోటా కింద, రెండోసారి కూడా ఈటెలకే దక్కడాన్ని, పార్టీలోనే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారట. ఈటెలను తప్పించి, తమకు ఇవ్వాల్సిందిగా, అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట. బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే నుంచే, ఇలాంటి డిమాండ్‌ బలంగా వినిపిస్తోందట. ఈ పరిణామాల నేపథ్యంలో, రాబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఈటెలను తప్పిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటినీ గ్రహించే, ఈటెల ఎట్టకేలకు తన అసంతృప్తిని వినిపించారని కొందరు పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట.

రీసెంట్‌గానే కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం జరిగింది. ఇందులో రెవెన్యూ చట్టాలకు తీసుకురాబోతున్న సంస్కరణల గురించి, ఈటెల రాజేందర్‌ బయటకు లీక్ చేశారన్న ప్రచారం ఓ పత్రికలో అటు సోషల్ మీడియాలో జరుగుతోంది. తనను కలవడానికి ఇంటికి వచ్చిన రెవెన్యూ సంఘాల నేతలతో ఈటల మాట్లాడారని, కలెక్టర్ల సమావేశంలో జరిగిన విషయాలన్నీ చెప్పారని, అందుకే రెవెన్యూ ఉద్యోగులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ, ప్రభుత్వ చర్యలపై నిరసన వ్యక్తం చేశారని , టీఆర్ఎస్‌లోనే కొందరు మాట్లాడుకున్నారు. దీంతో ఈటెలపై అధిష్టానం సీరియస్‌ అయ్యిందని తెలుస్తోంది. తాను చెప్పకపోయినా, తన పేరును బదనాం చేశారన్న కోపంతో ఈటెల రగిపోయారట.

అయితే ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్లినప్పుడు, బీజేపీ అధిష్టాన పెద్దలను కలిశారని పుకార్లు గుప్పుమన్నాయి. తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ, ఎస్సీ, బీసీ సంఘాల్లో గట్టి మద్దతున్న ఈటలకు గాలం వేస్తోందని తెలుస్తోంది. ఈటెల సైతం సానుకూలంగా ఉన్నారన్న ఊహాగానాలు వినిపించాయి. అందుకే ఈటెలను అధిష్టానం టార్గెట్ చేసిందని, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తనలో ఉన్న బాధన్నంతా ఈటెల వెళ్లగక్కారన్న చర్చ జరుగుతోంది.

గులాభి పార్టీ అధిష్టానంలో కీలకంగా వ్యవహరించే ఓ నాయకుడితో, ఈటెలకు పడటం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఉద్యమ కాలం నుంచి సన్నిహితంగా ఓ సీనియర్ మంత్రి పార్టీ అధిష్టానానికి దూరంగా ఉన్నాడు..ఆయనతో ఈటెల సన్నిహింతంగా ఉండటం అధిష్టానం పెద్దలకు ఇట్టం లేదట...దాంతో మంత్రివర్గం నుంచి ఈటెలను కూడా తప్పించడం ఖాయమని, సదరు అధిష్టాన నేత నుంచి మెసేజ్‌ వచ్చిందట. అందుకే, ఈటెల పరోక్షంగా ఆయనపై ధిక్కార స్వరం వినిపించారని తెలుస్తోంది.

ఈమధ్యే హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట్‌లో, ఈటెల రాజేందర్‌ విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారు. టీఆర్‌‌ఎస్‌ నేతలను సైతం, గృహ ప్రవేశానికి పిలిపించి, విందు ఇచ్చారు. విశాలమైన ఇల్లు, ఇంపోర్టెడ్‌ ఇంటీరియర్, ఫర్నీచర్‌ చూసి, సదరు నేతలు ఆశ్చర్యపోయారట. ఇంతటి విలాసవంతమైన కట్టుకోవడంపై, కొందరు నేతలు ఈర్శ్య పడ్డారని, ఈటెల రాజేందర్‌ తాజాగా తన ప్రసంగంలో అసహనం వ్యక్తం చేశారు. తనకు ఎప్పటి నుంచో వ్యాపారాలున్నాయని, ఆ డబ్బుతోనే లగ్జరీగా ఇల్లు కట్టుకున్నాని, ఇది కొందరు నేతలకు కళ్లు కుట్టేలా చేసిందని, ఈటెల ఫైరయ్యారు.

మొత్తానికి టీఆర్ఎస్‌లో సీనియర్ నాయకుడు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే మంత్రి ఈటెల రాజేందర్‌, సంచలన వ్యాఖ్యల చేయడంతో, తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. తన ప్రసంగం మొత్తంలో కేసీఆర్‌పై అభిమానం చూపిన ఈటెల, పార్టీలో కొందరు వ్యక్తులపైనే తన అసంతృప్తిని వెళ్లగక్కారన్న చర్చ జరుగుతోంది. ప్రసంగం గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు, చర్చ జరగడంతో, వెంటనే ఈటెల మరో ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, తన ప్రసంగంలో రంధ్రాన్వేషణ చేశారని, అలాంటి పోకడ మంచిదికాదన్నారు. తానెప్పుడూ గులాబీ సైనికుడేనని చెప్పి, ఒక్కసారిగా రేగిన మంటలను చల్లార్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈటెల ప్రసంగం, ఆ తర్వాత ప్రకటన చూసిన తర్వాత, టీఆర్ఎస్‌ అధిష్టానం, ఈటెలపై ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories