ఈస్ట్‌ ఢిల్లీలో పిచ్‌ గంభీర్‌ పవర్‌ ఎంత?

ఈస్ట్‌ ఢిల్లీలో పిచ్‌ గంభీర్‌ పవర్‌ ఎంత?
x
Highlights

ఈస్ట్‌ ఢిల్లీ పొలిటికల్‌ పిచ్‌పై గౌతమ్‌ గంభీరంగా నిలబడుతారా? సమస్యలకు నిలయంగా మారిన ఈ నియోజకవర్గంలో ఓపెనర్‌గా నిలబడి రాణిస్తారా? గంభీర్‌కు ఉన్న...

ఈస్ట్‌ ఢిల్లీ పొలిటికల్‌ పిచ్‌పై గౌతమ్‌ గంభీరంగా నిలబడుతారా? సమస్యలకు నిలయంగా మారిన ఈ నియోజకవర్గంలో ఓపెనర్‌గా నిలబడి రాణిస్తారా? గంభీర్‌కు ఉన్న స్టార్‌డమ్‌ కమలానికి బీజేపీకి ప్లస్సా... మైనస్పా? క్రికెట్‌ అభిమానుల్ని ఆకట్టుకున్నట్టు ఓటర్లను ఆకర్షించగలరా? త్రిముఖ పోరులో హోరాహోరీ యుద్ధంలో ఎవరి అనుకూలతలేంటి... ప్రతికూలతలేంటి?

తూర్పు ఢిల్లీ అంటేనే సమస్యలకు నిలయం. రోజుకి గంట సేపు నీళ్లు వస్తే అది వాళ్లకి ఒక లగ్జరీ. అలాంటి నియోజకవర్గంలో ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మ్యాన్‌ రైట్‌ టర్నింగ్‌ ఇచ్చుకొని ఎన్నికల బరిలో దిగారు. తూర్పు ఢిల్లీలో పిచ్‌ గంభీర్‌కి ఏమంత అనుకూలంగా లేదన్నది విశ్లేషకుల అంచనా. ఆప్‌ అభ్యర్థి ఆతిషి, కాంగ్రెస్‌ అభ్యర్థి అరవింద్‌‌సింగ్‌ లవ్లీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఆతిషి రాజకీయ బరిలో దిగడం ఇదే మొదటిసారి. ఆమె ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు ఒకప్పుడు విద్యారంగంలో సలహాదారుగా ఉన్నారు. ఢిల్లీలో విద్యావ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టి పాఠశాలల్ని ఒక గాడిలోకి తీసుకువచ్చి మంచిపేరు సంపాదించారు. ఆప్‌ ఆతిషి అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే సిట్టింగ్‌ ఎంపీ మహేశ్‌ గిరికి ఆమెను ఎదుర్కొనే సామర్థ్యం లేదని భావించిన కమలదళం వ్యూహం మార్చింది.

గౌతమ్‌ గంభీర్‌ పేరు చెబితే క్రికెట్‌ అభిమానులే కాదు, ట్విట్టర్‌వంటి సామాజిక మాధ్యమాలను ఫాలో అయ్యేవారు కూడా ఆయనలో అపారమైన దేశభక్తినే గుర్తిస్తారు. దేశ భద్రత, దేశ ప్రయోజనాలపైనే ఎక్కువగా ట్వీట్లు చేస్తూ ఉంటారు. జాతివ్యతిరేక శక్తుల్ని ఎండగడుతూ ట్వీట్లు చేస్తూ ఉంటారు. 147కోట్ల రూపాయల ఆస్తులున్నాయని అఫిడివిట్‌లో ప్రకటించి అత్యంత ధనిక అభ్యర్థిగా రికార్డులకెక్కిన గంభీర్‌. ఇప్పుడు కాళ్లకి ప్యాడ్‌లు ధరించి ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఏసీ గదుల్లో కూర్చొని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ట్వీట్లు పెట్టేవారికి ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయన్నది గంభీర్‌పైనున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు గంభీర్‌ స్థానికుడు కాదు. అది కూడా ఆయనకు మైనస్‌గా మారింది. అందుకే తనకున్న వ్యక్తిగత స్టార్‌డమ్, దేశభద్రత, మోదీ కరిష్మాపైనే ఆధారపడి గంభీర్‌ ప్రచారం చేస్తున్నారు. గంభీర్‌కి రెండు ఓటరు కార్డులున్నాయని, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆప్‌ డిమాండ్‌ చేస్తూ ఉంటే, అనుమతుల్లేకుండా ర్యాలీల నిర్వహణపై గంభీర్‌పై ఈసీ సీరియస్‌ అవడం వంటివి మైనస్‌లుగా కనిపిస్తున్నాయి.

ఇక ఆప్‌ అభ్యర్థి ఆతిషి ఒక సామాజిక కార్యకర్త. ఢిల్లీలో సమస్యలపై మంచి అవగాహన ఉంది. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, రవాణా సౌకర్యాలు వంటి సమస్యలు ప్రధానమైనవి. బీజేపీ, కాంగ్రెస్‌లకు డబ్బులుంటే మనకి జోష్‌ ఉంది. కృష్ణానగర్‌లో కిరణ్‌బేడిని ఎలా ఓడించామో అలాంటి పనితీరు అందరూ కనబరచాలుటూ ఆతిషి ఉత్సాహపరుస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న అరవింద్‌ సింగ్‌ లవ్లీ రెండేళ్లలోనే కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి, మళ్లీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌కి పార్టీలు మారడం ప్రజల్లో ఆయనకున్న ఆదరణను తగ్గించిందనే చెప్పాలి. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉన్నా త్రిముఖ పోటీలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories