2019 ఎన్నికలు బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడతాయా?

2019 ఎన్నికలు బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడతాయా?
x
Highlights

2019 ఎన్నికలు బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడతాయా? గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈ ఎన్నికలలో ఎన్ని సీట్లు...

2019 ఎన్నికలు బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడతాయా? గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈ ఎన్నికలలో ఎన్ని సీట్లు సాధిస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయిదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలు, వైఫల్యాలపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈఎన్నికల్లో ఆయనకు పోటీగా ప్రియాంక నిలబడాలంటూ కాంగ్రెస్ శ్రేణులు కొందరు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు కూడా గత ఎన్నికల్లో మోడీ వారణాసి, వడోదర రెంటిలోనూ పోటీ చేశారు. రెండింటిలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆ తర్వాత వడోదరకు రాజీనామా చేసి కాశీ విశ్వేశ్వరుని సెంటిమెంట్ కారణంగా వారణాసిని ఉంచుకున్నారు.

గంగానదిని ప్రక్షాళన చేస్తానని, హ్యాండ్ లూమ్ వర్కర్ల సంక్షేమానికి కృషి చేస్తాననీ మోడీ హామీ ఇచ్చారు. కాశీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతానన్నారు. టూరిజం పెంచుతాననీ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతాననీ మోడీ గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే ఈ హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వారణాసికి మోడీ కొత్త సొబగులద్దారు. నగరాన్ని అందంగా తీర్చి దిద్దారు. కానీ అక్కడి జన జీవితాల్లో మాత్రం మార్పు తేలేకపోయారు. వారణాసిలో ఇప్పుడు ఫ్యాన్సీ వీధిదీపాలు వెలుగుతున్నాయి. అలాగే రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ ను అందంగా తీర్చి దిద్దారు.. గంగా నదిపై విహారానికి క్రూయీజ్ బోట్లను ఏర్పాటు చేశారు. హై ఓల్టేజ్ బల్బుల స్థానంలో ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాట్లు నగర శోభను ఇనుమడింప చేస్తాయి తప్ప స్థానిక జనం జీవితాల్లో మార్పు మాత్రం లేదు.మోడీ వారణాసి ప్రతినిధిగా ఎంపికయినందున ఆ ప్రాంతానికి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత మాత్రం పెరిగింది. స్థానికంగా మోడీ పేరున ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. అక్కడకు ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తుతాయి. కానీ వాటిని పరిష్కరించే పరిస్థితి మాత్రం కనిపించదన్నది స్థానికుల వాదన

అయితే మోడీ వారణాసికి చాలా చేశారంటుంది బీజేపీ.. అయిదేళ్లలో 18 సార్లు వారణాసి వచ్చిన మోడీ వచ్చిన ప్రతీసారి నియోజక వర్గానికి సంక్షేమ కార్యక్రమాలు తెస్తూనే ఉన్నారని బీజేపీ నేతలంటున్నారు. వారణాసి అభివృద్ధికి ఇప్పటి వరకూ34 వేల కోట్లు నిధులిచ్చారు. వారణాసిలో మోడీ ప్రారంభించిన ప్రతీ స్కీము విఫలమైందనే అంటున్నారు స్థానికులు.. గంగా నదిలో కాలుష్యం తగ్గించడానికి బ్యాటరీ బోట్లను ప్రవేశపెట్టారు. జపాన్ లోని సాంస్కృతిక నగరం క్యోటో మాదిరిగా కాశీనీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక వాణిజ్య సహకార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ స్కీములేవీ సరిగా నడవడం లేదు.

మోడీ వారణాసి ఎంపీగా గెలిచాక నగర రోడ్లు మెరుగు పడ్డాయి. స్వచ్ఛ భారత్ బాగా అమలవుతోంది. నదీ తీరాలు అందంగా మారాయి. రోడ్ల విస్తరణ జరిగింది. కానీ ఆయనిచ్చిన వాగ్దానాలు మాత్రం తీరలేదు..పరిశ్రమలు తెస్తాననీ, యువతకు ఉపాధి చూపుతానని, కొత్త కొత్త సంస్థలు పుట్టుకొస్తాయనీ, మౌలిక వనరులను పెంచుతాననీ మోడీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. కానీ అవేమీ నెరవేరలేదు. వారణాసి కనెక్టివిటీని పెంచడానికి ఒక రింగు రోడ్డును, ఒక ఫ్లై ఓవర్ ను ఏర్పాటు చేస్తానని మోడీ 2014లో హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆ రోడ్ల పనులు మొదలయ్యాయి.

కాశీలో అత్యంత ఇరుకుగా ఉన్న కాశీ విశ్వ నాధ ఆలయాన్ని బ్యూటిఫికేషన్ చేసి రద్దీని తట్టుకునేలా ఆలయాన్ని విస్తరిస్తామని మరో ప్రాజెక్టు పనులు కు కూడా కేంద్రం మొదలు పెట్టింది.600 కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు స్థానికులకు కష్టాలు మిగులుస్తోంది. ఆలయ విస్తరణ పేరుతో చాలా మంది ఇళ్లు, షాపులను తొలగించడంపై స్థానికులు మండి పడుతున్నారు. నగరం పాత కళను కోల్పోయిందని, ఈ ప్రాజెక్టుతో ఇబ్బందులు తప్ప మరేం మిగలలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

మోడీ గొప్ప జాతీయ నేత అని స్థానికంగా ఏం చేయకపోయినా, ఆయనవ్యక్తిత్వం, సమర్ధత మళ్లీ ఓటేసేలా చేస్తున్నాయని కొందరు చెబుతుంటే, నియోజక వర్గంలో మరో ప్రత్యామ్నాయం లేక మోడీనే ఎన్నుకోవాల్సి వస్తోందని మరికొందరంటున్నారు.మోడీ గొప్ప నేతే కావచ్చు.. కానీ స్థానికంగా మాకు ఉపయోగ పడటం లేదన్నది మరికొందరి వాదన. గత ఎన్నికల్లో మోడీకి ప్రత్యర్ధులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పోటీలో నిలబడ్డారు. కానీ ఈసారి ఇప్పటి వరకూ ఈ నియోజక వర్గం నుంచి మోడీ ప్రత్యర్ధులెవరన్నది ఇంకా తేల లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక పేరును పరిశీలిస్తోందని వార్తలొస్తున్నాయి.. వారణాసి నుంచి పోటీకి సిద్ధమేనని ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక పేరును పరిశీలిస్తోందన్నది మరో కథనం. కానీ ప్రియాంకను యూపీ అసెంబ్లీ సీఎం అభ్యర్ధిగా దింపుతారన్నది మరో టాక్.. వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిఎవరన్నది సస్పెన్స్ కాగా, ఎస్పీ, బీఎస్పీ కూటమి కూడా తమ అభ్యర్ధి ఎవరన్నది ప్రకటించలేదు.

మొత్తం మీద వారణాసి ప్రజలకు మోడీపై కొంత అసంతృప్తి ఉంది.. ప్రత్యర్ధులెవరైనా మోడీని ఈసారీ గెలిపించి తీరతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.దేశవ్యాప్తంగా జాతీయ వాదాన్ని రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్న మోడీ వారణాసికి రాగానే మరోసారి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తారా అన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories