Top
logo

ఫుల్వామా దాడి.. ఈ ఎన్నికల్లో మోడీ మైలేజీ పెంచుతుందా..?

ఫుల్వామా దాడి.. ఈ ఎన్నికల్లో మోడీ మైలేజీ పెంచుతుందా..?
X
Highlights

నువ్వా నేనా అన్న రీతిలో సాగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గెలుపెవరిది? రాఫెల్ స్కామ్ తో బీజేపీ అసలు రంగు...

నువ్వా నేనా అన్న రీతిలో సాగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో గెలుపెవరిది? రాఫెల్ స్కామ్ తో బీజేపీ అసలు రంగు బయట పెడదా మనుకున్న రాహుల్ కు పుల్వామా రూపంలో దురదృష్టం వెంటాడిందా? దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్న వేళ ఉగ్ర దాడితో సీన్ మొత్తం మారిపోయిందా? దేశ భద్రత ముసుగులో మోడీ వైఫల్యాలు తుడిచి పెట్టుకు పోతున్నాయా?

2019 సార్వత్రిక ఎన్నికలు జోరందుకున్నాయి. మోడీ అయిదేళ్ల పాలనపై విపరీతమైన విమర్శలొచ్చాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలు బీజేపీ పాలనపై వ్యతిరేకతను పెంచాయి. మోడీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. అదే సందర్భంలో రాఫెల్ డీల్ పై అనేక అనుమానాలూ రేగాయి. విపక్షం ఎన్నిసార్లు అడిగినా.. ప్రభుత్వం ఆ వివరాలు ఇవ్వకపోవడం ఏదో రహస్యం దాస్తోందన్న అనుమానాలను పెంచింది. అంబానీలకు మేలు చేకూర్చే విధంగా మోడీ నిర్ణయాలు ఉంటున్నాయని, రక్షణాయుధాల తయారీలో ఏ మాత్రం అనుభవంలేని రిలయెన్స్ కంపెనీకి సబ్ కాంట్రాక్టు అప్పగించడం వెనక మోడీ ప్రమేయం ఉందనీ రాహుల్ ఆరోపించారు. తన ఆరోపణలకు తగిన ఆధారాలనూ చూపుతూ వచ్చారు. పార్లమెంటులో దీనిపై అనేక సార్లు రభస జరిగింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సర్కార్ పై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు..

కాగ్ కూడా రాఫెల్ కొనుగోలులో ఏం గోల్ మాల్ జరగలేదంటూనే కొన్ని అంశాల విషయంలో సర్కార్ పై సందేహాలు వ్యక్తం చేసింది . ప్రభుత్వం రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి లొసుగులూ లేవని చెబుతున్న సమయంలోనే దాని ధరకు సంబంధించిన వివరాలున్న కాగితాలు మిస్ అయ్యాయంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియ చేసింది. అయితే రాఫెల్ ను ఎక్కువ ధరకు కొంటున్నారన్న ఆధారాలను హిందూ పత్రిక బయట పెట్టింది. రాఫెల్ పై రాహుల్ స్వరం పెరగడం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో బీజేపీ గెలుపు అవకాశాలపై సందేహాలు పెరిగాయి.

అదే టైమ్ లోనే పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. పుల్వామా ఉగ్రదాడిని బీజేపీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించింది. మోడీ ప్రచార విధానం మారిపోయింది. దాడి అనంతరం భారత్ వాయుదాడులపై బీజేపీ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంది. మోడీ అనేక బహిరంగ సభల్లో యువతలో ఉద్రేకాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. పుల్వామా దాడిని అడ్డు పెట్టుకుని బీజేపీ ఈసారి ఎన్నికల యుద్ధం చేస్తోందన్న అనుమానాలు ఆ నేతల ప్రకటనలు చూస్తే కలుగుతాయి. ఈ సారి ఎన్నికల ఎజెండాగా స్థానికాంశాలను ప్రస్తావించాలని ప్రతిపక్షాలు తహతహలాడుతుంటే.. ఉగ్రదాడితో సీన్ మొత్తం మారిపోయింది. రైతుల కనీస మద్దతు ధర వివాదం,కుంగిపోతున్న ఆర్థిక స్థితి, ప్రజల వ్యక్తిగత ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న వాగ్దానం, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న వాగ్దానాల సంగతేంటని విపక్షాలు నిలదీసే టైమ్ లోనే పుల్వామా ఉగ్రదాడి సీన్ మొత్తాన్ని తిప్పేసింది.

ఈ దాడి ఈసారి ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని మోడీ పదే పదే చెబుతుండటంతో విపక్షాలకు దానిని ఖండించే ఆస్కారం లేకపోయింది. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో మోడీని మించిన వారు లేరు.. ప్రతీ బహిరంగ సభలోనూ ఆయన పుల్వామా దాడినే ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ ను తిట్టి పోస్తూ మాట్లాడారు.మోడీ లౌక్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుంటే రాహుల్ మోడీని ఖండించబోయి మోడీ ట్రాప్ లో పడిపోయారు. బీజేపీ కుట్రే ఫుల్వామా దాడి ఫలితం అని ఆరోపిస్తూ పుల్వామా టైమింగ్ పై సందేహాలు లేవనెత్తారు. రాహుల్ లేవనెత్తిన అనుమానాలకు పాకిస్థాన్ లో ప్రశంసలు వచ్చాయి.. కానీ మన దేశంలో మాత్రం విమర్శలు మూట కట్టుకున్నారు. బీజేపీ రాహుల్ ను ముస్లిం ఛాందస వాదుల కొమ్ము కాసే వ్యక్తిగా బీజేపీ ప్రచారం చేస్తోంది. రాహుల్ భారత వాయుదళాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడారంటూ దుమ్మెత్తి పోసింది. రాఫెల్ తో రాహుల్ సాధించిన మైలేజీ అంతా ఫుల్వామా దాడితో కొట్టుకుపోయింది. దేశ భద్రత అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీ సర్కార్ బాలాకోట్ దాడులను రాజకీయం చేసి లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో దేశ భద్రత పేరుతో పాక్ తో పరోక్ష యుద్ధంపై బీజేపీ రోజుకొక ప్రకటన చేస్తోంది.

Next Story