Top
logo

కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోరులో కలిసొచ్చేదెవరికి?

కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోరులో కలిసొచ్చేదెవరికి?
Highlights

ఏడుదశల పోలింగ్‌ ఐదు దశలు ముగిశాయి. మిగిలినవి రెండు దశలు. మరి పూర్తయిన దశల్లో ఏం జరిగింది. కీలకంగా భావిస్తున్న...

ఏడుదశల పోలింగ్‌ ఐదు దశలు ముగిశాయి. మిగిలినవి రెండు దశలు. మరి పూర్తయిన దశల్లో ఏం జరిగింది. కీలకంగా భావిస్తున్న రెండు దశల్లో ఏం జరగబోతోంది? భావి భారత ప్రధాని ఎవరో తేల్చబోయే ఎన్నికల్లో హస్తిన పీఠం ఎక్కేదెవరు? బయటకి కనిపించడం లేదు కానీ జనం ఓటు ఎవరికన్నది తేలడం లేదు. ఓటరు నాడి అందడం లేదు. 2014లాగా ఈసారి నమో మంత్రాన్నే జపిస్తున్నారా? రాగాకు శృతి కలుపుతున్నారా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.

ఏడు దశల ఎన్నికల్లో ఇప్పటికే ఐదు దశలు ముగిశాయి. చివరకు రెండు దశలు మిగిలాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోరు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని కమలనాథులు చెబుతున్నారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో బీజేపీ విసిరిన సవాళ్లకు ఒడిశాలో బీజేడీ, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, యూపీలో బీఎస్పీ, ఎస్పీ కూటమి, బిహార్‌లో ఆర్‌జేడీ కూటమి బెదిరినట్టుగా కనిపించడం లేదన్నది మహాకూటమి అంచనా. కాంగ్రెస్‌ పార్టీ తమ బ్రహ్మాస్త్రం అంటూ తీసుకువచ్చిన ప్రియాంకగాంధీ, అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపించలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏమైనా ప్రధాని మోడీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఎన్నికల ర్యాలీల దగ్గర్నుంచి మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూల వరకు తనని తాను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వారణాసిలో నామినేషన్, గంగాహారతి, ఆ తర్వాత పడవలో ప్రయాణిస్తూ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎంతో కొత్తగా కనిపించాయి. మోడీ బయోపిక్‌ విడుదలకు బ్రేక్‌ పడిన తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై ఓటర్లలో ఆసక్తి కనిపించిందంటున్నారు విశ్లేషకులు. గత ఎన్నికల్లో గుజరాత్‌ అభివృద్ధిని ఒక మోడల్‌గా చూపించిన మోడీ ఈసారి ఎన్నికల్ని గత అయిదేళ్లలో ప్రభుత్వం పనితీరుపై కాకుండా, తన వ్యక్తిగత ఇమేజ్‌ చుట్టూ తిప్పుకోవడమే కాదు, జాతీయ భద్రత అనే అంశాన్ని ఎక్కడికెక్కడ ప్రస్తావిస్తూ ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించారన్న అభిప్రాయమూ ఉంది.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వంటి కీలక రాష్ట్రాల్లో సామాజిక వర్గాల పోటాపోటీ సమీకరణలు బీజేపీకి కలిసివస్తున్నాయా? యూపీలో యాదవులు సహా కొన్ని బీసీ కులాలు, మాయావతి వర్గమైన దళితుల్లోని జాటవులు, ముస్లింల ఓట్లు ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీతో కూడిన మహాకూటమికి ఇప్పటివరకు జరిగిన దశల్లో పడినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అగ్రవర్ణాలతో పాటు మిగిలిన సామాజికవర్గాలైన యాదవేతర బీసీలు, జాటవేతర దళితులు బీజేపీకి అనుకూలంగా మారారు. ఇదంతా బీజేపీకి అనుకూలంగా మారుతుందని ఎన్నికల విశ్లేషకుల అంచనా.


లైవ్ టీవి


Share it
Top