RRB Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. 22,195 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. 22,195 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల

CR Reddy
Published on: 4 Feb 2026 6:42 AM IST
RRB Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. 22,195 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల
X

RRB Group D Recruitment 2026 : రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనే మీ కల నెరవేరే సమయం వచ్చేసింది. భారీ స్థాయిలో కొలువుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా టెన్త్ క్లాస్ చదివిన వారికి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డీ (లెవల్-1) పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 2, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వేలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా సంబంధిత ట్రేడులో ITI పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. అంటే రిజర్వేషన్ ఉన్న వారికి ఇది మరిన్ని అవకాశాలను కల్పిస్తోంది.

ఎంపిక ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (శారీరక సామర్థ్య పరీక్ష) నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేసి తుది ఎంపికను ఖరారు చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు ప్రారంభ వేతనం రూ.18,000 నుంచి ఇతర అలవెన్స్‌లు కలిపి సుమారు రూ.25,000 వరకు వచ్చే అవకాశం ఉంది.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు కేవలం రూ.250 మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ లో లాగిన్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకుని, గడువు ముగియకముందే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షలు జూన్ లేదా జూలై నెలల్లో ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టడం మంచిది.

CR Reddy

CR Reddy

Next Story