హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష

హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష
x
Highlights

ప్రత్యేక హోదా పోరు ఉధృతమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఐదుగురు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన...

ప్రత్యేక హోదా పోరు ఉధృతమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఐదుగురు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి ఏపీ భవన్‌ వేదికగా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మధ్యాహ్నం 2 గంటలకు దీక్ష ప్రారంభమైంది.

ఆమరణ దీక్షకు దిగే ముందు వైసీపీ ఎంపీలు ఏపీ భవన్‌ ప్రాంగణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత దీక్షా శిబిరం దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి, ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించిన ఐదుగురు అమరుల చిత్రపటాలకు అంజలి ఘటించారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీకి భారీగా తరలి వచ్చారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని దీక్షా వేదిక దగ్గర నినాదాలు హోరెత్తాయి.

అంతకుముందు ఐదుగురు వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే లోక్‌సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి రాజీనామా లేఖలను సమర్పించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను స్పీకర్‌కు వివరించారు. రాజీనామాలపై ఓసారి పునరాలోచించుకోవాలని ఎంపీలకు స్పీకర్ సూచించారు. సభలోనే ఉండి పోరాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం పోయినందునే పదవీ త్యాగం చేసినట్లు వివరించిన ఎంపీలు...వెంటనే రాజీనామాలను ఆమోదించాలని కోరారు. మరి ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా.. లేదంటే పెండింగ్‌లో ఉంచుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories