Top
logo

మోదీ కొలువుల్లో నవ దుర్గలు

మోదీ కొలువుల్లో నవ దుర్గలు
X
Highlights

ఇది మన జాతిపిత మహాత్మా గాంధీ గొంతుక. 1930లో గాంధీ ఈ స్టేట్‌మెంట్ చేశారంటే నాలుగు గోడల మధ్యనే కాకుండా బయటి...

ఇది మన జాతిపిత మహాత్మా గాంధీ గొంతుక. 1930లో గాంధీ ఈ స్టేట్‌మెంట్ చేశారంటే నాలుగు గోడల మధ్యనే కాకుండా బయటి ప్రపంచంలో కూడా మహిళలకు కలిసొచ్చే బలాబలాలను గాంధీ ఎంత చక్కగా చెప్పారో చూడండి.

9 మంది మహిళా మంత్రులు ...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ను ప్రస్తుతం ఏలుతున్నది ఈ ‘నవ దుర్గ’లే. భారత చరిత్రలోనే మొట్టమొదటిసారి తొమ్మిది మంది మహిళా నేతలకు కేంద్ర మంత్రులుగా పట్టం కట్టారు. మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ హయాంలో కూడా ఇంతమంది మహిళలకు చోటు దక్కకపోవడం విశేషం. సుష్మా స్వరాజ్ మంటి సీనియర్ మోస్ట్ మంత్రులు ఓవైపు, స్మృతి ఇరానీ వంటి యంగ్ లీడర్లు మరోవైపు.. ఇంకోవైపు ఉమా భారతి, నిరంజని జ్యోతి అనే ఇద్దరు సాధ్వీమణులు, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన మేనకా గాంధీ, హర్‌సిమ్రత్ కౌర్ వంటి మంత్రులు ఇలా ఈ 9మంది మహిళా మంత్రులు తమకంటూ ఎన్నో విశిష్ఠతలతో కూడిన వనితలుగా తమ సొంత ఇమేజ్‌తో కేంద్ర మంత్రివర్గంలో రాణిస్తున్నారు.

జగమెరిగిన సుష్మ..
పరిచయం అక్కర్లేని బీజేపీ నేతగా, మహిళా కోటాతో ఏమాత్రం సంబంధం లేకుండా సుష్మ స్వరాజ్ తన రాజకీయ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. స్టూడెంట్ యూనియన్ (ఏబీవీపీ) నేతగా ప్రారంభమైన ఆమె పొలిటికల్ కెరీర్ 62 ఏళ్ల వయసులోనూ ఆకాశమంత ఎత్తుకు సాగుతోంది. విదేశాంగ శాఖామంత్రిగా సుష్మ చేస్తున్న కృషి స్వతంత్ర భారతంలో ఇప్పటివరకూ ఏ మంత్రీ చేయలేని రీతిలో సాగుతోంది. ప్రవాస భారతీయుల సమస్యలను క్షణాలు, నిమిషాల్లో పరిష్కరిస్తూ, ఎన్‌ఆర్‌ఐలు, వారి కుటుంబాలకు తలలో నాలుకలా తనకంటూ విశిష్ఠ స్థానాన్ని వారి మదిలో పదిలం చేసుకున్నారు. సుష్మకు ట్వీట్ చేశారో.. ఇక ట్రబుల్ షూటర్ చేతిలో పడ్డట్టే. ఏకంగా పాకిస్థానీయులు సైతం ఈమె మా ప్రధానమంత్రి అయితే ఎంత బావుండు అని గట్టిగా డిమాండ్ చేసేలా సుష్మ ప్రశంసలు సంపాదించుకున్నారంటే విదేశాంగ మంత్రిగా ఆమె పనితీరు ఎలా ఉందో చెప్పకనే చెప్పినట్టుంది. ఇక అమెరికా మొదలు పలు ప్రపంచ దేశాలు సుష్మ అత్యుత్తమైన భారతీయురాలని కీర్తిస్తూనే ఉన్నాయి. భారత రాజకీయాలకు, నేతలకు ఒక దశలో ఆమె ముఖచిత్రంగా ప్రపంచస్థాయిలో ఇమేజ్ దక్కించుకున్నారు. అంతకు ముందు కూడా వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా, భారతీయ జనతా పార్టీలోనూ పనిచేసిన సుష్మ, 1998లో మొట్ట మొదటి ఢిల్లీ సీఎంగా కూడా విజయవంతంగా బాధ్యతలు చక్కపెట్టారు. స్వతహాగా లాయర్ అయిన సుష్మ, కెరీర్ మొదట్లో పలు సంచలన కేసులను అత్యద్భుతంగా వాదించారు కూడా. అచ్చమైన భారతీయతకు నిదర్శనంగా, రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలందరికీ రోల్ మోడల్‌గా నిలిచిన సుష్మను అనుసరించని మహిళా నేతలుండరు. లీడర్‌గా ఎదగాలనుకు నేవారంద రికీ, కట్టు, బొట్టు, మాట అన్నింటిలోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. లీడర్‌గా హిందీ, ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలిగే వాక్‌చాతుర్యం, పని పట్ల అంకితభావం నేర్చుకోవాలంటే అందుకు సుష్మ బెస్ట్ ఎగ్జాంపుల్.

ఈమెది... బార్న్ విత్ సిల్వర్ స్పూన్...
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ అంటే పంజాబ్, హర్యానాలో సెలబ్రిటీకి పర్యాయపదంగా మారిపోయిన బ్యూటిఫుల్ కేంద్ర మంత్రి. పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కుమారుడు, డిప్యూటీ సీఎం కూడా అయిన సుఖబీర్ సింగ్ బాదల్‌ను వివాహం చేసుకున్నాక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేవలం మెట్రిక్యులేషన్ చదివినా వివాదాలకు దూరంగా, విజయవంతంగా కేంద్రమంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ నేతగా, సిక్కుల ఊచకోతపై ఈమె చాలా కఠినంగానే తన గొంతును వినిపిస్తారు. పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా లో ప్రొఫైల్‌లో తన పని ముగించేయడం ఈమె ప్రత్యేకత.

యంగెస్ట్ వుమెన్ మినిస్టర్ స్మృతి ఇరానీ..
బుల్లితెర మొట్టమొదటి రారాణిగా ఎదిగిన అందాల తార స్మృతి ఇరానీ అతరువాత రాజకీయాల్లోనూ తన స్థానాన్ని అతి తక్కువ సమయంలోనే చాటుకున్నారు. ప్రధాని మోదీ మెచ్చిన బహుభాషా పండితురాలైన స్మృతి వివాదాలకు కేరాఫ్ అడ్రసే. కానీ తన మోడలింగ్ కెరీర్‌ను, అందాల పోటీల అనుభవాన్ని, టీవీ సోప్స్‌లో నంబర్ వన్‌గా నిలిచిన గర్వాన్ని ఎన్నడూ రాజకీయాల్లో, అది కూడా మంత్రి పదవిపై చూపలేదు. తన గ్లామర్ ప్రభావం రాజకీయాలపై పడకుండా దీన్ని ఓ పునర్జన్మలా భావిస్తూ పొలిటికల్ కెరీర్‌ను నిష్ఠా గరిష్ఠంగా కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడినా.. వచ్చే ఎన్నికల్లోనైనా విజయం సాధించేందుకు అమేథీ ప్రజలను సొంత నియోజకవర్గ ప్రజలుగా భావిస్తూ, తరచూ వారిని కలిసి కష్ట సుఖాలు తెలుసుకునే జననేతగా ఎదిగారు. అమేథీ ప్రజలు మీ ఎంపీ ఎవరంటే ఠకీమని స్మృతి అని చెప్పేస్తారు ఇది అతిశయోక్తి కానేకాదు, ఎందుకంటే అమేథీకి ఎప్పుడోగానీ వెళ్లి ముఖం చూపించని రాహుల్ గాంధీ కంటే స్మృతితోనే వీరికి చనువు ఎక్కువ మరి. ఇక నిప్పులు చెరిగే నేతగా ఈమె చేసే ప్రసంగాలు ఎంతటి నేత నోరైనా ఇట్టే మూయిస్తాయి. ‘ఎ గుడ్ స్పీకర్ కెన్ బికం ఎ గుడ్ పొలిటీషన్’ అనే నానుడికి అతికిన ట్టు సరిపోయే స్మృతి ఇరానీ ప్రసంగాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఆద్యంతం ఆసక్తిగా సాగుతాయి.

దినసరి కూలీలకు పుట్టిన, మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లో క్లీనర్‌గా, వెయిట్రెస్‌గా సంపాదన మొదలుపెట్టిన స్మృతి అత్యున్నత స్థానానికి చేరుకుని అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నారు. పార్టీ పనులు, కేంద్ర మంత్రిగా తన శాఖాపరమైన విధులను నిర్వహించడంలో ఏమాత్రం మొహమాటం, భయం లేకుండా రెబెల్ స్టార్‌లా తన డ్యూటీ చేస్తున్నారు.

ఫైర్ బ్రాండ్ ఉమ...
ఉమాభారతి పేరు పలకాలన్నా, రాయాలన్నా ముందు ‘అగ్గిబరాటా‘ అన్న పదం వాడాల్సిందే. అలా ఫైర్‌బ్రాండ్ ఆమె సర్‌నేమ్‌గా మారిపోయింది. పార్టీలో, సంఘ్ పరివార్‌లో ఉమాజీ అంటూ అందరికీ తల్లో నాలుకలా గత కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈమె కనీసం పదోతరగతి కూడా చదువుకోలేదు. కేవలం భగవద్గీతను ఆసాంతం ఔపోసన పట్టి, బాల్యంలోనే సంఘ్ పరివార్‌కు ఫేవరెట్‌గా మారారు.. అంతే ఆతర్వాత ఇక వెనక్కి తిరిగి చూడనే లేదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఓవైపు కోర్టు మెట్లు ఎక్కుతూ, సొంత పార్టీపై తిరుగుబాటు చేసి ..సొంత కుంపటి, భారతీయ జనశక్తి పార్టీ పెట్టి.. ఆతరువాత మళ్లీ పార్టీకి తానే దిక్కై.. చివరికి మధ్యప్రదేశ్ సీఎంగా కూడా విధులు నిర్వహించిన కార్యద క్షురాలు ఉమ. వివాదాలు ఎప్పుడూ ఈమె వెన్నంటే ఉంటాయి, అయినా తాను విశ్వసించిన సిద్ధాంతాన్ని అస్సలు పక్కనపెట్టదు సరికదా.. బాహాటంగానే దానిపై పెదవి విప్పడం ఈమె స్టైల్. పాతికేళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ కేంద్రమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికే తాను కట్టుబడి ఉన్నానని నేటికీ ధైర్యంగా ప్రకటిస్తూ, నిలకడ ఉన్న లీడర్‌గా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.
మేధావి రాజకీయాలకు

కేరాఫ్ నిర్మల....
సాధారణంగా రాజకీయాలంటే చిన్నచూపు, చులకనగా చూసే విద్యాధికులు మనదేశంలో చాలా ఎక్కువ. ‘పాలిటిక్స్ ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ’ అనుకునే మేధావులకు రాజకీయాలు అతికినట్టు సరిపోతాయి, వారికున్న అపారమైన విజ్ఞాన సంపదను దేశాభివృద్ధికి ఎలా ఉపయోగించవచ్చో ప్రత్యక్షంగా చేసి చెబుతున్నారు నిర్మలా సీతారామన్. రక్షణశాఖకు మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళామంత్రిగా (ఫుల్ టైం రక్షణ మంత్రిగా మొదటి మహిళ, అంతకు ముందు ఇందిరాగాంధీ రెండుసార్లు ప్రధాని హోదాలో ఈ శాఖను తనవద్దే అట్టిపెట్టుకున్నారు) సరికొత్త చరిత్ర సృష్టించారు. సింపుల్‌గా, లో ప్రొఫైల్‌లో పనిచేస్తే పదవులు మనల్ని వరిస్తాయని, నమ్మిన సిద్ధాంతాలపట్ల అంకితభావం ఉంటే చాలు అది మనల్ని కెరీర్‌లో అత్యున్నత స్థానంలో నిలబెడుతుందని చాటిన నిర్మలకు, దేశవ్యాప్తంగా లెక్కకు మించి అభిమానులున్నారు. స్వయంగా మోదీ మెచ్చిన బీజేపీ నేతగా, కేంద్ర మంత్రిగా ఈమె వివాదాలకు అతీతంగా తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. అంతర్జాతీయ వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలను అవలీలగా పర్యవేక్షించే మేధావిగా నిర్మల మన ‘నవ దుర’్గలకు చక్కగా ఇమిడిపోతారు.

అనుప్రియ పటేల్...
దళిత నేతగా అనుప్రియకు ఉత్తరప్రదేశ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. మాస్‌లో, క్లాస్‌లో పట్టున్న అనుప్రియకు రాజకీయాలు కొత్తేం కాదు. తల్లిదండ్రుల సొంత పార్టీ అప్నాదళ్ నేతగా ప్రజల్లోకి వచ్చిన అనుప్రియ చిన్న వయసులోనే తల్లితో పోట్లాడి, పార్టీని చీల్చి కాసింత అపప్రధ మూటగట్టుకున్నా ఆ తరువాత తనకంటూ సొంత గుర్తింపును, ఇమేజ్‌ను సంపాదించుకు న్నారు. నాన్ యాదవ్ ఓబీసీల్లో దూకుడు ప్రదర్శించే అనుప్రియ మోదీ క్యాబినెట్‌లో యువమంత్రిగా కొనసాగుతున్నారు. పరుష పదజాలంతో మాట్లాడే అనుప్రియకు ఉత్తరాదిలో యంగ్ ఫైర్ బ్రాండ్‌గా పేరుంది.

బీజేపీ దళిత ఫేస్‌గా..
ఉత్తరాదిన అందునా ఉత్తరప్రదేశ్‌లో కమలనాథులకు దళిత ఫేస్‌గా వెలుగొందుతున్న మరో కేంద్ర మంత్రి కృష్ణరాజ్ చాలా కామ్‌గా తన పదవిని నిర్వహిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన ఈమె సోషల్ వర్కర్‌గా పాపులర్ అయ్యారు. సంఘ్‌పరివార్‌కు యూపీలో డిపెండబుల్ నేతగా మారారు. కానీ పబ్లిసిటీకి దూరంగా తనకు అప్పగించిన పనిని సాధించేయడం ఈమె స్టైల్. హడావుడి, దర్పం ప్రదర్శించకుండా ఒద్దికగా పనులు చేసే మంత్రిగా కృష్ణరాజ్ వ్యవహరిస్తారు. యూపీలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా వెలిగిన ఈమె.. కేంద్రమంత్రి అయినా మధ్యతరగతి కుటుంబంగానే ఉండిపోయారు.

బ్యాక్‌వర్డ్ నేతగా.. సాధ్వి నిరంజన్
సాధ్వి నిరంజన్ వివాదాలను రాజేసే నేతగానే ఉన్నా కేంద్రమంత్రిగా తన విధులు కామ్‌గానే నిర్వహిస్తున్నారు. బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ నేతగా, సన్యాసినిగా కూడా రెండు పడవల్లో ప్రయాణిస్తూ మహిళలకు రాజకీయాలు అవసరం, దేశానికి మహిళా నేతలు చాలామంది కావాలి అని గట్టిగా చెప్పే సాధ్వి నిరంజన్ జ్యోతి అంటే హిందీ బెల్ట్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. విశ్వహిందూ పరిషత్‌లో కీలక పదవులు చేపట్టిన సాధ్విగా ఈమె సుపరిచితురాలే. పెద్దగా రాజకీయాలు మాట్లాడకుండానే పార్టీ పనులు చక్కబెట్టే శక్తిసామర్థ్యాలు మెండుగా ఉన్న నేతగా సాధ్వి జ్యోతికి పేరుంది.

ఇందిరమ్మ కోడలైనా...
మేనకా గాంధీ.. మాజీ ప్రధాని ఇందరిమ్మ కోడలైనా తనకంటూ సొంత ఇమేజ్‌ను సంపాదించుకుని, సొంత పార్టీ, రాష్ట్రీయ సంజయ్ మంచ్‌ని నిర్వహించారు. సొంత మరిది అయిన రాజీవ్ గాంధీకి ప్రత్యర్థిగా అమేథీ నుంచి కూడా బరిలోకి దిగి, మెట్టినింటికి, కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిన ధైర్యశాలి. ఆతరువాతి కాలంలో తన పార్టీని జనతా దళ్‌లో విలీనం చేసి పార్టీ జనరల్ సెక్రెటరీ అయ్యారు. యంగెస్ట్ వుమెన్ మినిస్టర్‌గా కేంద్రమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి తన సత్తా చాటారు. 6 సార్లు ఎంపీగా, పలుమార్లు కేంద్ర మంత్రిగా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించి, ఆయా డిపార్ట్‌మెంట్లపై తన స్టాంప్ వేశారు. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణం వంటి తన ఫేవరెట్ సబ్జెక్ట్‌లే తనకు శాఖలుగా అప్పగించినప్పుడు సంచలనాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటూ, కాంగ్రెస్ నేతలపై దశాబ్దాలుగా పోరాడుతూ, టీవీ వ్యాఖ్యాతగాసైతం రాణించిన టాలెంటెడ్ మంత్రిగా మేనకా ఆతరువాతి కాలంలో కాంగ్రెస్‌కు రాజకీయ ఆగర్భ ప్రత్యర్థి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో చే రారు. 18 ఏళ్లకే సంజయ్‌గాంధీని పెళ్లిచేసుకున్న ఈ జేఎన్‌యూ స్టూడెంట్ చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని, ఇందిరాగాంధీతో విభేదాల వల్ల సొంతంగా జీవితాన్ని గడపాల్సి వచ్చింది. పెద్దింటి కోడలైనా సామాన్య మహిళలా ఈమె పడ్డ కష్టాలు శత్రువులకు కూడా రాకూడదనే గుణపాఠంగా మిగిలిపోయింది. సక్సెస్‌ఫుల్ సింగిల్ మదర్‌గా ఈమె చేసిన యుద్ధం కూడా అసాధారణమైనదే.

మంత్రులకే కాదు.. పనిమనుషులకూ!
కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ చెప్పిన ఒక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తన ఇంట్లో పనిమనిషి కుమార్తె వివాహానికి వెళ్లిన సుష్మకు ఒక గొప్ప అనుభవం ఎదురైందట. ఆ మర్నాడు తన పనిమనిషి ఒకటే ధన్యవాదాలు చెబుతూ పోయిందట, ఏమైంది నీతో మా కుటుంబానికి అనుబంధం ఉంది కదా అని ప్రశ్నించిన సుష్మకు పనిమనిషి చెప్పిన సమాధానం కళ్లు తెరిపించిందట.. అదేమిటంటే..‘అమ్మో పెళ్లికూతురుకి పొలిటికల్ సపోర్ట్ ఉంది, ఆమెను వేధిస్తే ఇక అంతే, రాజకీయ నేతనే పెళ్లికూతురుకు రక్షా కవచం, ఆమెకు ఏ అఘాయిత్యం తలపెట్టరాదు’ అంటూ పెళ్లి కుమారుడి తరఫు వారు భయపడ్డారు, దీంతో తన కూతురికి మెట్టింట్లో ఏ ఆపదా రాదని తల్లి మురిసిపోతూ సుష్మకు చెప్పింది. అందుకే సుష్మ అంటారు రాజకీయాల్లో ఉన్న మహిళలకు రక్షణ ఎక్కువ, దీంతో ఆటోమేటిక్‌గా వీరి చుట్టుపక్కల ఉన్నవారు కూడా క్షేమంగా, హ్యాపీగా ఉంటారని. ఇది రాజకీయాల్లో మహిళలకున్న ప్రాధాన్యతను చాలా లోతుగా వివరిస్తుంది.

Next Story