ప్రజారాజ్యంతో చిరు ఎందుకు పోరాటం చేయలేదు?

ప్రజారాజ్యంతో చిరు ఎందుకు పోరాటం చేయలేదు?
x
Highlights

ఆగస్టు 26, 2008. వెంకన్న సాక్షిగా తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం మొదలైంది. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో పార్టీ పేరు,...

ఆగస్టు 26, 2008. వెంకన్న సాక్షిగా తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం మొదలైంది. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో పార్టీ పేరు, జెండా, అజెండా ఆవిష్కరించారు మెగాస్టార్ చిరంజీవి. కాంగ్రెస్‌, టీడీపీ పాలనకు ప్రత్యామ్నాయంగా, సామాజిక న్యాయం నినాదంతో పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు పార్టీ ప్రారంభించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఊరూవాడా తిరిగారు. యువరాజ్యం తరపున పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌ ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి ఉరికించాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసి, సంచలనం సృష్టించారు.

పార్టీ సిద్దాంతకర్తలుగా, మ్యానిఫెస్టో రూపకర్తలుగా డాక్టర్ మిత్ర, పరకాల ప్రభాకర్‌తో పాటు మరికొందరు వ్యవహరించారు. అల్లు అరవింద్ కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రైతులు, పేదలు, నిరుద్యోగులకు అనేక వరాలు ప్రకటించిన ప్రజారాజ్యం, 2009 ఎన్నికల్లో 294 స్థానాలకు పోటీ చేసింది. అటు వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్, ఇటు చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ వంటి బలమైన పార్టీల నడుమ పోటీ చేసి, కేవలం 18 స్థానాల్లో గెలిచింది ప్రజారాజ్యం. రెండు స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవి, సొంతూరిలో ఓడిపోయి, తిరుపతిలో గెలిచారు. దాదాపు 18 శాతం ఓట్లను కొల్లగొట్టిన ప్రజారాజ్యం, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిన పార్టీగానే మిగిలిపోయింది. అంతిమంగా అది కాంగ్రెస్‌కు మేలు చేసింది.

అయితే ఎంతో పట్టుదలతో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన చిరంజీవి, తర్వాత దాన్ని నడిపించడంలో విఫలమయ్యారు. ఎమ్మెల్యేల్లో కొందరు అధికార పార్టీవైపు చూశారు. అసెంబ్లీలోనూ చిరంజీవి ప్రజాసమస్యలపై ధాటిగా మాట్లాడ్డంలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. చివరికి పార్టీని నడపలేక 2011, ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తనతో పాటు 18 మంది ఎమ్మెల్యేలను అందులో కలిపేశారు. చిరంజీవికి రాజ్యసభతో పాటు కేంద్రమంత్రిపదవి రాగా, గంటా శ్రీనివాస రావు, రామచంద్రయ్యలకు మంత్రిపదవులు లభించాయి. అలా ప్రజారాజ్యం ప్రస్థానం ముగిసిపోయింది.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునిచ్చిన చిరంజీవి, అదే పార్టీలో విలీనం కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ప్రజారాజ్యం కోసం ఆస్తులతో పాటు తమ సర్వస్వాన్ని పణంగా పెట్టిన కార్యకర్తలు రగిలిపోయారు. కనీసం ఒక రెఫరెండం పెట్టి, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం తీసుకోకుండా, చిరంజీవి తన ఇష్టారాజ్యంగా ప్రజారాజ్యాన్ని విలీనం చేయడంపై ఆగ్రహం పెల్లుబుకింది. కాంగ్రెస్‌ తరపున ప్రచారానికి వెళ్లిన చిరంజీవిని చాలామంది కార్యకర్తలు నిలదీశారు కూడా. ఇన్ని లక్షల మంది ఆగ్రహావేశాల టైంలో, పవన్ కల్యాణ్‌ బయటికి రాలేదు. అప్పుడేమీ తెలీదని ఇప్పడు అమాయకంగా చెబుతున్న పవన్, తనను నమ్మి ఓట్లేసిన వారికి క్షమాపణ చెప్పలేదు. అప్పుడు అనుభవం లేదు, ఇప్పుడుందంటున్న పవన్, రేపొద్దున తన అన్నలాగే జనసేనను మరో పార్టీలో విలీనం చేయడన్న గ్యారంటీ ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు.

ఎన్టీఆర్‌ తరహాలో ప్రభంజనం వీస్తుందని, తాను సీఎం అవుతానని చిరంజీవి కలలు కన్నారు. కానీ వైఎస్, చంద్రబాబులాంటి బలమైన నాయకులున్న టైంలో, పరిస్థితులను అంచనావేయలేక బోల్తాపడ్డారు. నిజంగా రాజకీయాల పట్ల అంతచిత్తశుద్ది ఉంటే, 18మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించలేరా...ప్రజాసమస్యలపై నిరంతరంగా పోరాడలేరా....చాలా తక్కువ టైంలో అధికారంలోకి రావాలనుకోవడం, అవి సాధ్యంకాదని తెలిసి కాడి దింపేయడం రాజకీయ నాయకుడి లక్షణమా....అంత ఓపికలేకపోతే పార్టీనెందుకు పెట్టారన్న ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.

వైఎస్, సీఎం కావడానికి ఎన్నో దశాబ్దాలు పట్టింది...పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి, విభజన కష్టాలను తట్టుకుని చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చారు. మరి అలాంటి పట్టుదల లేకపోతే పార్టీ పెట్టడమెందుకు...విలీనం చేసి ప్రజా నమ్మకాన్ని వంచిండచమెందుకు...ఆవేశంతో రగిలిపోతున్న పవన్ కల్యాణ్‌ మాత్రం, ఇలాంటి ప్రశ్నలు వేయడు. చిరంజీవి సొంత అన్ననే కావచ్చు. అది కుటుంబం వరకు. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తరతమ బేధం లేకుండా, మంచిని ప్రశంసించి, చెడును ఖండించాలి. కానీ ఇప్పటికీ పవన్‌, చిరంజీవి చేసిన చారిత్రక తప్పిదంలో అమాయకుడి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

చిరంజీవిని బలి పశువు చేశారని పవన్ అంటున్నారు. సరే. మరి చిరంజీవికి తెలియదా....తాను ఎవర్ని నమ్ముతున్నాను, తన చుట్టూ ఎవరున్నారు...పార్టీ ఏదిశగా వెళుతోంది...తన కర్తవ్యమేంటి... ప్రజాభీష్టం ఏంటని ఆలోచించరా...ఏది తోస్తే అది చేసేయడానికి ఇదేమైనా సినిమా షూటింగా...మేకప్ తీసి ప్యాకప్ చెప్పడానికని అందరూ ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పాల్సింది చిరంజీవి, ఆయనకు ఓట్లేయండని పిలుపునిచ్చిన నాటి యువరాజ్యం అధినేత పవన్‌ కల్యాణ్‌...మరి సమాధానముందా...

Show Full Article
Print Article
Next Story
More Stories