థర్డ్‌ ఫ్రంటా.. ఫెడరల్‌ ఫ్రంటా... ఫ్రంట్‌ ఉండే పార్టీ ఏది?

థర్డ్‌ ఫ్రంటా.. ఫెడరల్‌ ఫ్రంటా... ఫ్రంట్‌ ఉండే పార్టీ ఏది?
x
Highlights

థర్డ్ ఫ్రంట్.. ఫెడరల్ ఫ్రంట్. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎప్పుడు వినిపించే మాట. ఈసారి అదే మాట సరికొత్తగా వినవస్తుంది. హస్తిన వేదికగా కొత్త రాజకీయం...

థర్డ్ ఫ్రంట్.. ఫెడరల్ ఫ్రంట్. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎప్పుడు వినిపించే మాట. ఈసారి అదే మాట సరికొత్తగా వినవస్తుంది. హస్తిన వేదికగా కొత్త రాజకీయం మొదలవబోతుందన్న సంకేతాలు అందాయ్. ఇంతకీ 2019 నాటికి బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతుందా? ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతాయా? ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే దాన్ని లీడ్ చేసేదెవరు? నిజం చెప్పాలంటే... పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవం సరికొత్త రాజకీయానికి తెరలేపింది. దీదీ పట్టాభిషేకానికి పలు ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు హాజరవ్వడం భవిష్యత్ రాజకీయాలకు బాట వేసింది. ఆ తర్వాత కర్ణాటక వేదికగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్స వేళ కూడా ఆసక్తికరమైన దృశ్యమే కనిపించింది. పరస్పరం బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలు ఏకమై... చేయిచేయి కలిపి... మోడీకి తామే ప్రత్యర్థులమంటూ సంకేతాలిచ్చాయి. వీరి కలయిక, ప్రత్యేక ఆసక్తి చూస్తుంటే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయానికి వీరంతా ఎన్డీఏ, యూపీఏకు వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

2014 ఎన్నికలప్పుడే థర్డ్ ఫ్రంట్ , ఫెడరల్ ఫ్రంట్...అనే మాట వినిపించింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో, మోడీ ప్రభంజనం ముందు అది సాధ్యం కాలేకపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయ్. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు తమ హవాను చాలా స్పష్టంగా సమీకరించాయ్. కమలం పరిస్థితి దిగజరాగా.. కాంగ్రెస్ కాస్త పుంజుకున్నట్టే కనిపించింది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడుతున్నాయ్. గతంలో మోడీ మేనియాను తట్టుకుని ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ, బిహార్‌లో జేడీయూ...ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించాయ్. తమిళనాడులో అన్నాడీఎంకే, బెంగాల్‌లో మమతా బెనర్జీ వరుసగా రెండోసారి గెలవడం ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తులో కీలకం కాబోతున్నాయన్న సంకేతాలనిచ్చాయ్.

కాంగ్రెస్, బీజేపీకి...మున్ముందు కష్టకాలం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ అవడమే ఇందుకు కారణం. ప్రాంతీయ పార్టీన్నింటిని కూడగట్టే ప్రయత్నాలు మొదలయ్యాయ్. జాతీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ప్రాంతీయ పార్టీలతో కలసి బీజేపీపై యుద్ధం ప్రకటించాలన్నది కూటమి లక్ష్యంగా కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది.... కానీ ఫ్రంట్‌కు ఎవరు నేతృత్వం వహించాలనే అసలు సమస్య. సాధారణ ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు. కాబట్టి ముందు ఫ్రంట్ ఏర్పడి... అది సక్సెస్ చేసి.. తర్వాత సంగతి తర్వాత చూసుకుందామనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. ఒకవేళ ఫ్రంట్ యత్నం విజయం సాధిస్తే ఎవరి లెక్కలు వారికుంటాయి. ఎలాగూ అప్పటి రాజకీయ సమీకరణల ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక్కడో విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. 2019 నాటికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై... కమలానికి చెక్‌ పెట్టి... కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడం కాస్త అటో ఇటో ఖాయంగానే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories