సీటు మారితే ఫేటు మారుతుందా? ఎల్‌.రమణ పోటీ ఎక్కడి నుంచి!!

సీటు మారితే ఫేటు మారుతుందా? ఎల్‌.రమణ పోటీ ఎక్కడి నుంచి!!
x
Highlights

మహాకూటమి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీట్లు పోయినా పర్వాలేదు, సమిష్టిగా విజయం...

మహాకూటమి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీట్లు పోయినా పర్వాలేదు, సమిష్టిగా విజయం సాధిద్దామంటున్నారు. ఇన్ని అంటున్న ఆయన సీటుకే ఎసరు పడుతోంది...ఇంతకీ ఆయన ఎవరు...ఆయన సీటు కథేంటి?

టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణను ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఎందుకంటే, గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల నుంచి రమణ పోటీ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ జీవన్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి మళ్లీ అదే స్థానం కోరుతున్నారు ఎల్‌.రమణ. కానీ పొత్తులో భాగంగా జీవన్‌ రెడ్డికే జగిత్యాల దక్కే ఛాన్స్ ఉంది. దీంతో రమణను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలన్న విషయంపై చంద్రబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కొత్త స్థానాలను అన్వేషిస్తున్నారు.

ఎల్‌. రమణను కూకట్‌పల్లి నుంచి, లేదంటే జూబ్లీహిల్స్ నుంచి పోటి చేయించాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు టిడిపి నుంచే పోటీ చేశారు. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు టిఆర్ఎస్‌లోకి వెళ్లారు. అయితే లీడర్లు పోయినా క్యాడర్ బలంగా ఉందని, కార్యకర్తలు టిడిపిని వదిలి వెళ్లలేదని, పార్టీ బలంగా ఉందని, గట్టి నమ్మకంతో ఉన్నారు చంద్రబాబు. అందుకే ఇక్కడ ఏదో ఒక స్థానం నుంచి రమణను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారు. జగిత్యాల స్థానం జీవన్‌ రెడ్డిని కాదని, తనకు దక్కే ఛాన్స్‌ ఎలాగూ లేదు కాబట్టి, ఎవరినీ నొప్పించకుండా, ఎవరికీ పోటీ కాకండా సర్దుకుపోవాలని కూడా రమణ భావిస్తున్నారు.

ఒకవేళ రమణను జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దింపితే, కూకట్‌పల్లి నుంచి పెద్దిరెడ్డి పేరుతో పాటు మరో మహిళా నాయకురాలు అనుషారామ్ పేరును కూడా పరిశీలిస్తున్నారని, తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. మహాకూటమి అభ్యర్థల జాబితా వెల్లడైన తర్వాతే, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో క్లారిటీ వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories