logo
జాతీయం

ఇంతకీ తలైవా ఏం చేయబోతున్నాడు?

ఇంతకీ తలైవా ఏం చేయబోతున్నాడు?
X
Highlights

రంగుల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. వేదాంతం నుంచి సిద్ధాంతాల వరకు వచ్చాడు. ఆధ్యాత్మిక రాజకీయమంటూ సరికొత్తగా...

రంగుల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. వేదాంతం నుంచి సిద్ధాంతాల వరకు వచ్చాడు. ఆధ్యాత్మిక రాజకీయమంటూ సరికొత్తగా నిర్వచించాడు. ట్రూత్‌, వర్క్‌, గ్రోత్‌... అంటే సత్యం, కార్యం, అభివృద్ధి అంటూ రాజకీయాలకు సరికొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఇంత జరిగాక తమిళ నేతల జాతకాలు మారవా అంటూ ఇక తారుమారేనంటూ అభిమానులు ఉబ్బితబ్బుబ్బయ్యారు. ఈ ఇంట్రడక్షన్‌ అంతా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ది. పొలిటిక్స్‌ అనే డిఫెరెంట్‌ బాల్‌ గేమ్‌లో రజనీ పాత్ర ఏంటి?

ఇండస్ట్రీలో బాక్సాఫీస్‌ బద్దలు కొట్టొచ్చు..సూపర్‌స్టార్‌గా ఇరగదీయ్యెచ్చు.. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకోవచ్చు..తలైవాగా ఆప్యాయంగా పిలిపించుకోవచ్చు

రంగుల ప్రపంచంలో ఇలా ఏమైనా చేయడానికి వీలుంది. బాషాగా బాక్సాఫీస్‌ బద్దలు కొడుతుంటే ముత్తుగా వెండితెరపై మురిపిస్తుంటే అరుణచలంగా అల్లడిస్తుంటే నరసింహగా ఉర్రూతలూగిస్తుంటే రోబోగా మనిషిలా నడిచొస్తుంటే కాలాగా గుండెల్ని కరిగిస్తుంటే అభిమానులు ఎగిరిగంతేశారు. తలైవా స్టారిజం చూస్తున్నంత సేపు తపించిపోయారు. ఆ నటన చూసి పులకించిపోయారు.

ఇలా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఇంకా వెలుగుతున్న రజనీకాంత్‌ ఆధ్యాత్మిక రాజకీయమంటూ సరికొత్తగా నిర్వచిస్తూ పొలిటికల్‌ బాల్‌ గేమ్‌లోకి అడుగు పెట్టారు. రెండు దశాబ్దాలుగా ఊరిస్తూ... ఊరిస్తూ... చివరకు ఊరడించేలా కిందటేడాది డిసెంబరు 31న రాజకీయాల్లోకి వస్తున్నాననంటూ ప్రకటించారు. ఇంకేం తమిళ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని అనుకున్నారు అభిమానులు ప్రజలు. పురిచ్చితలైవి జయలలిత లోటును భర్తీ చేసేలా రజనీ రాజకీయం సాగుతుందని, ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నమవుతాడనని భావించారు. కానీ మూడు నెలల దాటింది. నాలుగో నెల సమీపిస్తుంది. అయినా రజనీ ఆలోచన తెలియట్లేదు. ఆయన వ్యూహం అంతుచిక్కట్లేదు. ఇంతకీ తలైవా ఏం చేయబోతున్నాడు.?

ఈ అనుమానాలు సరే. అభిప్రాయలూ సరే. అసలింతకీ తలైవాకి తమిళనాట స్పేస్‌ ఉందా? స్టైల్‌కింగ్ అక్కడ కింగ్ అవుతారా? తమిళనాడుతో పాటు దేశమంతా రజనీ రాజకీయ ఎత్తుగడలపై ప్రత్యర్థులను ఎదుర్కొనే వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తమిళనాట నెలకొన్న సందిగ్ధ వాతావరణాన్ని చల్లబరిచి స్పిర్చువల్‌ పొలిటిక్స్‌తో సరికొత్త పవర్‌ను అందిస్తానన్న రజనీ తమిళ పాలిటిక్స్‌ను మారుస్తారా? మరి తలైవా ఏం తలస్తున్నాడు?

ఊహాగానాలకు తెరదించడం సరే... అసలు వ్యూహం ఏంటి..ట్రూత్‌, వర్క్‌, గ్రోత్... మూల సూత్రాలు సరే... జవాబుదారీతనం ఏది..రాజకీయ వ్యవస్థ చెడిపోయిందన్న మాట సరే... మరి ప్రక్షాళన దిశగా అడుగలేవి?

ఒక వేదాంతం నుంచి, ఒక తర్జనభర్జన నుంచి, ఒక ఊగిసలాట నుంచి బయటకు వచ్చారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. దేవుడు ఆదేశిస్తే అరుణాచలం పాటిస్తాడంటూ పేల్చిన ఫేమస్‌ డైలాగ్‌నే రాజకీయాలకు ముడిపెట్టిన తలైవా 2017 డిసెంబరు 31న ఎట్టకేలకు తెరదించేశాడు. రాజకీయ రంగ ప్రవేశమంటూ ఖాయమంటూ సత్యం, కార్యం, అభివృద్ధి అనే మూడు సూత్రాల మూలస్థంభమే తన రాజకీయభవనానికి పునాది అంటూ డైలాగ్‌లు దంచేశాడు. మరి ఆయన సఫలం అవుతారా? తమిళనాట ఇప్పుడున్న అస్థిర రాజకీయాల మధ్య పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌‌లోనే రజనీ పొలిటికల్‌ ఎంట్రీని ఖరారు చేశారు మంచిదే. కానీ ఇప్పుడు చేస్తున్నదేంటి?

జయలలిత కన్నుమూయడం, కరుణానిధి వృద్ధ్యాప్యభారం ఇలా కారణాలు ఏవైనా రజనీకాంత్‌కు రాజకీయంగా తమిళనాడులో ఓ స్పేస్‌ దొరికింది. అంతవరకు అందరూ ఆహ్వానించాల్సిన పరిణామమే. కానీ పార్టీ నిర్మాణపరంగా జరగాల్సిన ప్రక్రియ ఎంతో ఉంది. పార్టీకి ఓ పేరు లేదు ఓ క్యాడర్‌ లేదు. అభిమానులంతా ఓటర్లు అవుతారనుకుంటే పొరుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందో రజనీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంతది. అన్నేళ్లు పార్టీని నిలబెట్టుకోగలగాలి. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో స్వీప్ చేయగలిగే సత్తా కల్పించుకోవాలి. అప్పుడు రజనీకాంత్‌కు ఎదురు ఉండదు. కానీ అది జరగకపోతే పరిస్థితి ఏంటి?

పార్టీ పేరు ఖరారు కాలేదు పార్టీ నిర్మాణమే జరగలేదు క్యాడర్‌ను నిర్మించుకోలేదు అప్పుడే రజనీకాంత్‌కు విమర్శల తాకిడి పెరుగుతోంది. సుబ్రహ్మణ్యస్వామి రజనీ రాజకీయ నిరక్షరాస్యుడు అన్నారు ఇంకెవరో తప్పనసరిగా ఏదో అంటారు. వాటిని తెంచుకుని ఆయన ముందుకు వెళతారా? లేదా? అన్నది అనుమానమే. సినిమా రంగానికి, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉన్న మాట వాస్తవం. ఇంకా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలలో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. దీని ఎఫెక్ట్‌ను రజనీ నిలబెట్టుకుంటే వెండితెరపై సూపర్‌స్టార్‌ అనిపించుకున్నట్టే రాజకీయ రంగంలో కూడా చెరిగిపోని ముద్ర వేయడం ఖాయం. అభిమానులు కూడా కోరుకునేది ఇదే.!!

Next Story