యోగి ప్రతిష్ఠ మసకబారుతోందా? కమలం కలవరం వెనుక కథ ఇది!!

యోగి ప్రతిష్ఠ మసకబారుతోందా? కమలం కలవరం వెనుక కథ ఇది!!
x
Highlights

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో సీఎం పీఠం ఎక్కారు యోగి. కానీ అవన్నీ తాటాకుచప్పుళ్లేనని, ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నపిల్లల మరణ మృదంగంతో తేలిపోయింది....

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో సీఎం పీఠం ఎక్కారు యోగి. కానీ అవన్నీ తాటాకుచప్పుళ్లేనని, ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నపిల్లల మరణ మృదంగంతో తేలిపోయింది. గోరఖ్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక కొందరు, మెదడువాపు వ్యాధితో మరికొందరు పిల్లలు, పిట్టల్లా రాలిపోయారు. 42 గంటల్లో 42 మంది కన్నుమూశారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 323 మంది పిల్లలు చనిపోయారు. ఆక్సిజన్‌ సిలిండర్ల బకాయిలు చెల్లించకపోవడంతో, చిన్నారులు ఊపిరందక చనిపోయారు. ఏదో చేస్తాడని భావించిన యోగి ఆదిత్యనాథ్‌‌, పాలన ఇంతేనా అని పిల్లలు పోగొట్టుకున్న తల్లులు రోదించారు. గోరఖ్‌పూర్‌ ఫలితంలో వారి వేదన, ఆవేశం ఓట్ల రూపంలో యోగిని నైతికంగా ఓడించింది. ఇప్పుడు కైరానా, నూర్పుర్‌లోనూ అదే ప్రతిధ్వనించింది.

రాబోయే కాలంలో, కాబోయే మోడీ అని అందరూ ఊహించారు. గుజరాత్‌ నుంచి మోడీ ఎగసిపడ్డట్టే, యూపీ నుంచీ అలాగే దూసుకొస్తాడని అంచనా వేశారు. కానీ సీన్‌ మొత్తం రివర్స్‌ అవుతోంది. తన ఏలుబడిలో ఒక్కో ఎంపీ స్థానాన్ని, ప్రతిపక్షాలకు అప్పగిస్తున్నాడు. బీజేపీకి ఆక్సిజన్‌ అందిస్తుందనుకున్న రాష్ట్రంలో, ఆశలు ఆవిరి చేస్తున్నాడు. ఇంతకీ యోగి ఆదిత్యనాథ్‌ సామ్రాజ్యంలో ఏం జరుగుతోంది...ఉప ఎన్నికల్లో వరుస ఓటములు సూచిస్తున్నదేంటి?

ఉత్తరప్రదేశ్‌లో, ప్రతిపక్షాలన్నీ ఏకమై, బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక మోడీ పాలనకు మూడిందని చెలరేగిపోతున్నాయి. కానీ యూపీలో వరుస ఓటములకు, యోగినే కారణమని, సొంత పార్టీ నాయకులే విమర్శించడం, యోగిని ఆత్మరక్షణలో పడేస్తోంది. నిజంగా ఏడాదిలోనే యోగి ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడన్న విమర్శలున్నాయి. సన్యాసి సీఎంపై జనం ఒకింత ఆగ్రహంతోనే ఉన్నారన్న ఆరోపణలున్నాయి.

యూపీ జంగిల్‌ రాజ్‌కు పాతరేసి, రామరాజ్యం తెస్తానన్నాడు. యూపీ రూపురేఖలు మారుస్తానన్నాడు. గోరఖ్‌పూర్‌ను ఏలినట్టే, రాష్ట్రాన్నీ పాలిస్తానని చెప్పాడు. కానీ అవన్నీ అడియాశలవుతున్నాయంటున్నాయి విపక్షాలు. ఇది ఇలాగే కొనసాగితే చివరికి యోగీ సీటుకే ఎసరు వస్తుందన్న ఆరోపణలున్నాయి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీ అనూహ్య విజయం సాధించింది. దీంతో సడన్‌గా యోగి పేరు సీఎం రేసులో వినపడింది. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఏడాదిలోనే నివురుగప్పిన నిప్పులా మారుతున్న వ్యతిరేకతను గ్రహించలేకపోయారు. మొన్న గోరఖ్‌పూర్‌, పూల్‌పూర్‌ ఎంపీ స్థానాల్లో ఓడిపోతే, నేడు కైరానా, నూర్పుర్‌‌లో ఘోర పరాజయం.

మొత్తానికి హిందూత్వ ఫైర్‌బ్రాండ్‌గా, మోడీ తర్వాత అజేయనాయకుడిగా చక్రంతిప్పాలనుకున్న యోగికి, ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం బ్రేకులేశాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు, హిందూత్వ నినాదాలనే నమ్ముకుంటే సరిపోదని, ప్రజల జీవితాల్లో మార్పుకు నాంది పలకడమే అసలైన నాయకుడి లక్షణమని, తేల్చి చెప్పారు యూపీ ప్రజలు. బైపోల్స్ ఫలితాలను గుణపాఠంగా తీసుకుని, యోగి తన పనితీరు మార్చుకుని, ప్రజల మన్నన పొందేలా పాలిస్తాడో, లేదంటే ఇదే రీతిలో ముందుకెళతారో కాలమే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories