ఫెడరల్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయమేనా?

ఫెడరల్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయమేనా?
x
Highlights

ఇప్పుడు అందరి దృష్టి అంతా కూడా థర్డ్ ఫ్రంట్ పైనే ఉంది. నిజానికి ఈ ఫ్రంట్ ఇంకా ఏర్పడలేదు. అయినా కూడా ఎక్కడికక్కడ ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల...

ఇప్పుడు అందరి దృష్టి అంతా కూడా థర్డ్ ఫ్రంట్ పైనే ఉంది. నిజానికి ఈ ఫ్రంట్ ఇంకా ఏర్పడలేదు. అయినా కూడా ఎక్కడికక్కడ ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకులు తామే థర్డ్ ఫ్రంట్ కు సారథ్యం వహించాలని తహతహలాడుతున్నారు. దీంతో దేశంలో త్వరలోనే ఒకటి, రెండు కాదు.....మూడు నాలుగు థర్డ్ ఫ్రంట్ లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అదెలానో చూద్దాం.

పొత్తుల రాజకీయాలు దేశానికి కొత్తేమీ కాదు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ప్రాంతీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, కేంద్రంలో అధికారాన్ని అనుభవించేందుకు ఎక్కువ లోక్ సభ స్థానాలను కోరుకుంటున్నాయి. మరో వైపున జాతీయ పార్టీలు రాష్ర్టాల్లో బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ అంశం కూడా పొత్తుల్లో కీలకంగా మారి ఆయా ఫ్రంట్ ల బలాబలాల్లో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బాగా బలహీన పడడం కూడా వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఆలోచించేందుకు కారణమైంది. అంతేగాకుండా నిధుల పంపిణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం మధ్య తగాదాలు తలెత్తుతున్నాయి. వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులు రాష్ట్రాలకు మరిన్ని అధికారాలను కోరుతున్నారు. కేంద్రం అధికారాలు దేశ రక్షణ లాంటి కొన్ని కీలక అంశాలకే పరిమితం కావాలని అంటున్నారు. ఇలాంటి నాయకులంతా ఎవరికి వారుగా తమ గొంతు వినిపిస్తూ, ఒకే వేదికపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నారు. పాలనలో గుణాత్మక మార్పు తీసుకురావడం తమ లక్ష్యమని ఆయన అంటున్నారు. దేశరాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఎలాంటి మార్పు తీసుకురానుందో చూద్దాం.

గత రెండు దశాబ్దాలుగా దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీలుగా నిలిచాయి. కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏర్పడింది. బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ఏర్పడింది. వామపక్షాలు, మరికొన్ని పార్టీలను మినహాయిస్తే దేశంలోని ప్రాంతీయ పార్టీలెన్నో ఈ రెండు కూటముల్లో ఉన్నాయి. దేశంలో 1951 నుంచి 1971 వరకు కాంగ్రెస్, వామపక్షాల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండింది. వరుసగా ఆరు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. 1975 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారింది. ప్రజలు విపక్షాలకు పట్టం కట్టారు.1977లో జనతా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. అంతర్గత కలహాలతో జనతా ప్రభుత్వం మూడేళ్ళలోనే కుప్పకూలింది. 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అలా జనతా కూటమి ప్రయోగం మూడేళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది.

ఇక థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాల విషయానికి వస్తే..... 1989 ఎన్నికల్లో సంచలనం చోటు చేసుకుంది. బోఫోర్స్ కుంభకోణం లాంటివి కాంగ్రెస్ పతనానికి కారణమయ్యాయి. దేశంలో రెండో సారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. జనతాదళ్, తెలుగుదేశం, డీఎంకే, అస్సాం గణపరిషత్ లాంటివి కలసి నేషనల్ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి. నేషనల్ ఫ్రంట్ కు ఎన్టీఆర్ సారథ్యం వ్యవహరించారు. 1989 డిసెంబర్ లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. వి.పి. సింగ్ ప్రధాని అయ్యారు. బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. అప్పట్లో రామ్ రథయాత్ర సందర్భంగా అద్వానీని అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించింది. 1990 నవంబర్ 7న వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. ఒక్క ఏడాది కూడా వీపీ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉండలేకపోయింది. ఆసమయంలోనే జనతాళ్ ను చీల్చి సమాజ్ వాదీ జనతా పార్టీని ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇచ్చింది. రాజీవ్ గాంధీపై నిఘా వేశారన్న కారణంతో కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించడంతో 1991 మార్చి లో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. ఎనిమిది నెలలు కూడా ప్రభుత్వం కొనసాగలేకపోయింది.

1996 థర్డ్ ఫ్రంట్ రెండోసారి ఉనికిలోకి వచ్చింది. నిజానికి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన ఏకైక పార్టీగా బీజేపీ 161 సీట్లు సాధించింది. వాజ్ పేయి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిండి. బల నిరూపణ చేసుకోలేక అది 13 రోజుల్లో పడిపోయింది. 140 సీట్లు సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకుండా యునైటెడ్ ఫ్రంట‌్ కు మద్దతు ఇచ్చింది. జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే, టీడీపీ, ఏజీపీ, లెఫ్ట్ ఫ్రంట్, టీఎంసీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర 13 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. యునైటెడ్ ఫ్రంట్ కు చంద్రబాబు నాయుడు కన్వీనర్ గా వ్యవహరించారు. 1996 జూన్ లో దేవెగౌడ ప్రధాని అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీతారాం కేసరి ఉన్నారు. దేవెగౌడ తనను చిన్న చూపు చూడడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో 1997 ఏప్రిల్ లో కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకుంది. రాజీ సూత్రంతో 1997 ఏప్రిల్ లో ఐ.కె. గుజ్రాల్ ప్రధాని అయ్యేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఆ తరువాతి పరిణామాల్లో ప్రభుత్వం నుంచి డీఎంకే మంత్రులను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ ను గుజ్రాల్ అంగీకరించకపోవడంతో 1998 మార్చిలో ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది. అంటే ఒక ఏడాది కూడా ఆ ప్రభుత్వం కొనసాగ లేకపోయింది.

మొత్తం మీద చూస్తే థర్డ్ ఫ్రంట్ ఏర్పరిచిన ఏ ప్రభుత్వం లోనూ ఒక ప్రధాని పట్టుమని ఏడాది కూడా పదవిలో ఉండలేకపోయారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఉరకలు వేస్తున్న నాయకులు విస్మరిస్తున్న అంశం ఒకటుంది. అదేమిటంటే వీటిలో ఏ పార్టీ కూడా జాతీయ స్థాయిలో లేదు. ఉరకలు వేస్తున్న పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలే. మరో వైపున లెఫ్ట్ ఫ్రంట్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ తో లెఫ్ట్ ఫ్రంట్ కలుస్తుందా లేకపోతే లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ తో కలుస్తుందా లాంటి మరెన్నో అంశాలు తెరపైకి రానున్నాయి. థర్డ్ ఫ్రంట‌్ కు జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం లేదు. ప్రజాకర్షణ గల నాయకులు లేరు. మరో వైపున థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయగలవని భావిస్తున్న పార్టీలలో అధిక శాతం గతంలో వివిధ అలయన్స్ లలో ఉండి అటూ ఇటూ మారిపోయి ఒక నిబద్ధత లేనివన్న ముద్ర వేసుకున్నాయి. ఇప్పటి వరకైతే మూడో ఫ్రంట్ భారత రాజకీయ చరిత్రలో ఒక విఫల ప్రయోగంగా మిగిలింది. భవిష్యత్తు లో అది ఎలా ఉంటుందో ఎన్నికల సమయానికి తేలనుంది. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories