9లక్షల మందికి తుపాను అలర్ట్‌ మెసేజ్‌లు..

x
Highlights

టెక్నాలజీని ఉపయోగించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే రాష్ట్రాన్ని భారీ నష్టం నుంచి బయటపడేశామని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా...

టెక్నాలజీని ఉపయోగించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే రాష్ట్రాన్ని భారీ నష్టం నుంచి బయటపడేశామని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు తుపాను వల్ల ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 2వేల విలువైన సరుకులు పంపిణీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. తుపాను పరిస్థితిపై ఐఎండీ ఇవ్వలేని సమాచారాన్ని సైతం మన సొంత వ్యవస్థతో ప్రజలను అప్రమత్తం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐవీఆర్‌ఎస్‌, ఆర్టీజీఎస్‌ ద్వారా 9లక్షల మందికి తుపాను అలర్ట్‌ మెసేజ్‌లను పంపామన్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోగానే జనరేటర్ల సాయంతో విద్యుత్‌ను సరఫరా చేశామని చెప్పారు.

గతంలో తుపాను ఎక్కడ తీరం దాటుతుందే తెలియని పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఆర్టీజీఎస్‌తో కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా తుపాను బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశామని సీఎం వివరించారు. తుపాన్ ఎక్కడొస్తుంది, ఎంత తీవ్రతతో వస్తుందన్న విషయాలను కరెక్టుగా అంచనా వేశామని, అందువల్లే ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని సీఎం తెలిపారు. పెథాయ్ తుపాన్ కారణంగా ఎవరూ చనిపోలేదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందో అంచనా వేస్తున్నామన్న సీఎం ఎవరికీ నష్టం లేకుండా ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని, నష్టపోయిన రైతులందరికీ మరికొన్ని రోజుల్లోనే ఆర్థికసాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

దెబ్బతిన్న రోడ్లను గంటల వ్యవధిలోనే అధికారులు పునరుద్ధరించారని సీఎం వివరించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో 129 జనరేటర్లను, తాగునీటి కోసం 140 ట్యాంకర్లను వినియోగించామన్నారు. మత్స్యకారులకు చెందిన 25 బోట్లు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. అధికారులంతా సమన్వయంతో వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దారని సీఎం ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని గ్రామాల్లో మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్ పర్యటించారు. పంట పొలాలను, చేపల చెరువులను వారు పరిశీలించారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు హెక్టారుకు 25వేల పరిహారం చెల్లిస్తామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పంట చేలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, అధికారులు పర్యటిస్తూ రైతులకు, ప్రజలకు భరోసా ఇస్తున్నారు. పరిహారం చెల్లించి ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories