చెరువుల్ని చెరబట్టిన వాటర్ మాఫియా

చెరువుల్ని చెరబట్టిన వాటర్ మాఫియా
x
Highlights

వాటర్ మాఫియా లేని ప్రాంతాన్ని సిటీలో వెతుకుదామన్నా దొరకదు. భూగర్భజలాలను బోరు గొట్టాలతో ఇష్టారాజ్యంగా పీల్చేస్తున్న ఈ నీటిజలగలు..కోట్లలో వ్యాపారం...

వాటర్ మాఫియా లేని ప్రాంతాన్ని సిటీలో వెతుకుదామన్నా దొరకదు. భూగర్భజలాలను బోరు గొట్టాలతో ఇష్టారాజ్యంగా పీల్చేస్తున్న ఈ నీటిజలగలు..కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఇక ఎండాకాలం వచ్చిదంటే చాలు వీళ్లకు కాసులపంటే. ఐతే..ఇదంతా ఏదో సీక్రెట్ గా జరుగుతున్న దందా అనుకుంటే పొరపాటే. ఎందుకనో మన అధికారులకు కళ్లకు మాత్రం ఈ దందా కనిపించదు..అడిగితే అవునా అంటూ అమాయకంగా సమాధానమిస్తారు.

చెరువులు, కుంటలు, పంటపొలాలు.. నీటి వసతి ఉన్న ప్రాంతమైతే చాలు. వెంటనే అక్కడ టెంటేస్తుంది వాటర్ మాఫియా. ఆ అడ్డాలలో భూమాతకు తూట్లు పొడుస్తూ అడ్డదిడ్డంగా బోర్లు వేసేస్తుంది. రోజూ వందల కొద్దీ ట్యాంకర్లలో వేలాది లీటర్ల నీళ్లు నింపుకొని అమ్ముతూ కోట్లలో వ్యాపారం చేస్తుంది. అక్రమబోర్లతో జలవనరులను జలగల్లా పీల్చేస్తున్నా ఈ దారుణాన్ని అడిగే నాథుడే ఉండడు.

అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుంటారు తప్ప పన్నెత్తి ప్రశ్నించరు. కన్నెత్తి కన్నెర్ర చెయ్యరు. ఎందుకంటే ఎవరికి చేరాల్సిన సొమ్ము వారికి ఠంచనుగా చేరే వ్యవస్థ ఏర్పడింది. మాదాపూర్ సున్నం చెరువులో నీటిదందాపై పట్టుదలగా hmtv వరుస కథనాలు కొన్ని వారాలపాటు ప్రసారం చేస్తే కానీ రెవెన్యూ యంత్రాంగంలో కదలిక లేదు. ఇది నగరం నడిబొడ్డున ఉన్న సున్నం చెరువు ఒక్క కథే కాదు.. శివార్లలోని చెరువులదీ ఇదే పరిస్థితి.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగర శివారు ప్రాంతం ఉప్పల్. జనావాసాలు పెరిగినంత వేగంగానే నీటి ఎద్దడి పెరిగింది ఈ ప్రాంతంలో. దీంతో వాటర్ మాఫియా ఇక్కడా తన పడగ విప్పింది. ఉప్పల్, బోడుప్పల్ మధ్యలో ఉన్న నల్లచెరువు పరిసరాలపై కన్నేసింది. మిగతా తతంగం ఎప్పటిలాగే చకచకా జరిగిపోయింది. నల్లచెరువుని ఆనుకుని ఉన్న ప్రాంతంలో నీటి దందా జోరుగా మొదలైంది.

నల్లచెరువుని ఆనుకుని ఉన్న పంటపొలాల్లో వాటర్ మాఫియా అడ్డగోలు వ్యాపారం సాగిస్తోంది. పగలు.. రాత్రి తేడా లేదు. 24 గంటలు బోర్లు నడుస్తూనే ఉంటాయి. రోజూ వందలాది ట్యాంకర్లు నీరు నింపుకొని నిర్విరామంగా పరిసర ప్రాంతాల్లో అమ్ముతూనే ఉంటాయి. చెరువులు, ఆ చుట్టుపక్కల బోర్లు వేయరాదన్న నిబంధనను పాతరేస్తున్నా పట్టించుకొనే నాథుడే ఉండడు. ప్రశ్నించినవారిని ఊరికే వదలదు నీటి మాఫియా. నయానో.. భయానో వారి నోళ్లు నొక్కేస్తుంది.

అసలు చెరువుల్లో బోర్లు వేయడంపై నిషేధాన్ని ఎంత తెలివిగా ఉల్లంఘిస్తున్నారో తెలిస్తే అవాక్కవుతారు. నిబంధనల ప్రకారం చెరువుల్లో బోర్లు వేయడాన్ని అనుమతించరాదు. వాటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదు. దీంతో వీటిలో కొన్నిటిని వ్యవసాయ కనెక్షన్లు చూపించారు. వీటికి ప్రభుత్వం అందించే ఉచిత నిరంతర విద్యుత్ పథకం కూడా వర్తిస్తుంది. ఇలా ఓ మంచి పథకాన్ని నీటి మాఫియా విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోంది. కళ్ల ముందు ఇంత బహిరంగంగా నీటి దందా జరుగుతున్నా అధికార యంత్రాంగానికి పట్టదు. ప్రధాన రహదారులపై నీటి ట్యాంకర్లు తిరుగుతున్నా చర్యలు తీసుకోరు. బోడుప్పల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లితే ఎంతో అమాయకంగా అవునా తప్పకుండా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. తమ కళ్లెదుటే నిబంధనలు ఉల్లంఘిస్తూ భూగర్భాన్ని తోడేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు నిద్ర నటిస్తున్నారనేది స్థానికులు వేస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్న.

Show Full Article
Print Article
Next Story
More Stories