కడలి విలయనర్తనం... ముప్పు ముంగిట్లో మనం

కడలి విలయనర్తనం... ముప్పు ముంగిట్లో మనం
x
Highlights

మనం ఏదైనా పెను ప్రమాదాన్ని ముందే ఊహించి చెప్పడానికి తుపాను ముందర ప్రశాంతతతో పోలుస్తాం.. తుపానుకు ముందు ప్రశాంతత అంటే? జరగబోయే పెను విపత్తుకు సంకేతంగా...

మనం ఏదైనా పెను ప్రమాదాన్ని ముందే ఊహించి చెప్పడానికి తుపాను ముందర ప్రశాంతతతో పోలుస్తాం.. తుపానుకు ముందు ప్రశాంతత అంటే? జరగబోయే పెను విపత్తుకు సంకేతంగా ఉండే సైలెన్స్. సైక్లోన్ కూడా సైలెంట్ కిల్లరే.. అలల రూపంలో విరుచుకు పడటానికి ముందు సముద్రం ఎంతో గంభీరంగా స్థిరచిత్తంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంతలోనే చెలరేగి అలలతో దాడి చేసి వేటు వేస్తుంది. ఇప్పుడు... పెనువిపత్తు.. తుపాను ముప్పు ముగింట్లో ఉన్నామ్మనం. ఊళ్లకు ఊళ్లనే తుడిచి పెట్టేసే భయంకరమైన విలయతాండవం మన ముంగిట్లో తిష్ట వేసుకు కూర్చుంది. ప్రకృతి ప్రకోపానికి చేష్టలుడిగిన మనిషి బిక్క మొహం వేస్తున్నాడు. శీతాకాలంలో జనాన్ని గడగడలాడిస్తోంది పెనుతుపాను పెథాయ్‌. తుపాను ముప్పు నెమ్మదిగా తప్పిపోవాలని, కడలి శాంతించాలని శతకోటి దేవుళ్లకు మొక్కుతున్నారు అక్కడి జనం. కానీ ఇలా విరుచుకుపడుతున్న పెనుతుపాన్లు ఇలా ఎందుకు విరుచుకుపడుతాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కడలిలో కల్లోలం ఎందుకు పుడుతుంది? గంభీరంగా ఉండే సముద్రుడు విశ్వరూపమెత్తి ఇలా ఎందుకు గర్జిస్తాడు.

అమ్మఒడిలాంటి ప్రకృతి ఒక్కోసారి ప్రళయాన్ని సృష్టిస్తుంటుంది. విలయతాండవం చేస్తూ విరుచుకుపడుతుంది. అలాంటి ప్రళయ భయానక బీభత్స ఉత్పాతాల్లో సైక్లోన్లు ఒకటి. సముద్ర జలాల్లో ఉద్భవించే ఈ తుపాన్ల ప్రభావం తీర ప్రాంతాలను కుదేలయ్యేలా చేస్తుంది. అపార నష్టాన్ని చవిచూపిస్తుంది. ఏడున్నర వేల కిలోమీటర్లకు పైగా తీరరేఖ ఉన్న భారతదేశానికి ఈ విపత్తులు కొత్తేమీ కాదు. సముద్రంలో నీరు ఆవిరై, మేఘంగా మారి, వర్షమై మళ్లీ చినుకు రూపంలో భూమిని చేరుతుంది. ఇదొక నిరంతర చక్రభ్రమణం.. మన రుతువులు, కాలాలు ఈ చక్రభ్రమణం ఆధారంగానే ఏర్పడుతుంటాయి. అయితే ఒక్కసారిగా డైలీ రొటిన్‌కు భంగం కలిగితే... దారి తప్పితే... అసహజమయితే.. ప్రకృతి ప్రకోపిస్తే.. ఏర్పడే పెనువిపత్తులే తుపాన్లు. గతంలో ఉప్పెనలను ఎదుర్కొన్న అనుభవమున్న తీర ప్రాంత ప్రజలు ఇప్పుడు మరోసారి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతకాల్సి పరిస్థితులు ఎదురవుతున్నాయి.

సాధారణంగా తీరప్రాంతాలకు తుపాన్లు, ఉప్పెన ముప్పు ఎక్కువే.. బంగాళాఖాతంలో తరచుగా ఏర్పడుతున్న వాయుగుండాలు ప్రజల పాలిట గండంగా మారుతున్నాయి. ఇతర తీర ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కే ఈ సమస్యలు కాస్త ఎక్కువ. బలమైన గాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడే ఈ విపత్తులను ముందుగానే గుర్తించగల విజ్ఞానం పెరుగుతున్నా.. ఆపగలగడం అసాధ్యం. కోట్లాది మంది నివసిస్తున్న ఉత్తర, దక్షిణ హిందూ మహాసముద్ర తీరాల్లోనూ, పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోనూ, తూర్పు, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీరాల్లోనూ ప్రతి సంవత్సరమూ సైక్లోన్ల తాకిడి తప్పడం లేదు.
అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలోనే అధిక తీవ్రతతో కూడిన తుపాన్లకు ఆస్కారం ఎక్కువ. సాధారణంగా 5:1 నిష్పత్తిలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు పుట్టుకొస్తాయి. నైరుతి రుతుపవనాలకు ముందు, ఆ తరువాత భారత్‌లో తుపాను సంభవించే తీవ్రత ఉంటుంది. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే... మన దేశంలో బంగాళాఖాతంలోనే తుపాను తీవ్రత ఎక్కువగా ఉండటం విషాదం.

Show Full Article
Print Article
Next Story
More Stories