చుక్కాని లేని నావ.. టీ-టీడీపీ? తమ్ముళ్లకు ఏమవుతోంది?

చుక్కాని లేని నావ.. టీ-టీడీపీ? తమ్ముళ్లకు ఏమవుతోంది?
x
Highlights

మొన్న రేవంత్..నిన్న మోత్కుపల్లి. ఇలా ఒక్కరుగా వెళ్ళిపోతున్నారు..వేరు వేరు కారణాలతో నేతలంతా టీడీపీకి గుడ్‌ బై కొట్టేస్తున్నారు. ఏడాదిలో ఎన్నికల్ని...

మొన్న రేవంత్..నిన్న మోత్కుపల్లి. ఇలా ఒక్కరుగా వెళ్ళిపోతున్నారు..వేరు వేరు కారణాలతో నేతలంతా టీడీపీకి గుడ్‌ బై కొట్టేస్తున్నారు. ఏడాదిలో ఎన్నికల్ని ఎదుర్కోబోతున్న పసుపు దళానికి..ఇది జీవన్మరణ సమస్యగా మారింది. రేపు ఎవరు వెళ్ళిపోతారో... అనే అనుమానాల మధ్య టీటీడీపీ పడవ సాగుతోంది.

టీటీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ బలహీనపడుతోంది. గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లను గెలిచిన సంతోషం నిలవకముందే..ఇద్దరు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా గులాబీ కండువాలు కప్పేసుకున్నారు. తర్వాత ఓటు కు నోటు కేసులో కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం నేతల్ని మరింత కలవర పెట్టింది. రేవంత్‌తో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలు..జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు పార్టీకి గుడ్ బై చెప్పడంతో పార్టీ మరింత బలహీన పడింది.

టీటీడీపీలో ఇప్పుడు పార్టీకి పెద్దదిక్కుగా చెప్పుకునే మోత్కుపల్లి నర్సింహులు వంతొచ్చింది. మోత్కుపల్లి..టీడీపీ అధినేత చంద్రబాబుపై ఊహించని రీతిలో విమర్శలు చేయడం..ఆయనపై బహిష్కరణ వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి క్లిష్ట సమయాల్లో పార్టీకి అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుపై రాజకీయ దాడి జరుగుతున్న కాలంలో వెన్నంటి నిలిచారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేయడం కలకలం రేపింది. టీటీడీపీని టీఆర్ఎస్‌తో విలీనం చేయాలని ఎన్టీఆర్ వర్థంతి రోజున ప్రతిపాదించి కలకలం రేపిన మోత్కుపల్లి.... ఎన్టీఆర్ జయంతి రోజు అంతే సంచలన రీతిలో చంద్రబాబును టార్గెట్ చేయడం కల్లోలం సృష్టిస్తోంది.

ప్రస్తుతం టీటీడీపీ చుక్కాని లేని నావలా తయారైందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. తెలంగాణ టీడీపీకి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఆర్.కృష్ణయ్య ఇప్పటికే పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ పండగైన మహనాడుకు కూడా హాజరుకాని ఆయన..వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో ఉంటారో లేదో చెప్పలేని పరిస్థితి. కొందరు టీటీడీపీ నేతలు కూడా గోడదూకే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండవని తేలిన మరుక్షణం మిగలిన నాయకులు కూడా పార్టీని వీడటం ఖాయని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories