బాల్కా సుమ‌న్ ను మంద‌లించిన సీఎం కేసీఆర్

బాల్కా సుమ‌న్ ను మంద‌లించిన సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణలో విద్యుత్ సెగలు రగులుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ మాటల తూటాలు విసురుకుంటూనే ఉన్నాయి.. అధికార పార్టీని పలాయన వాదమని కాంగ్రెస్...

తెలంగాణలో విద్యుత్ సెగలు రగులుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ మాటల తూటాలు విసురుకుంటూనే ఉన్నాయి.. అధికార పార్టీని పలాయన వాదమని కాంగ్రెస్ ఆరోపిస్తే.. వాదించే సత్తా లేకే విమర్శిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎదురు దాడి చేసింది. ఈసారి అధికార, విపక్ష పార్టీలు వ్యక్తిగత స్థాయిలో విమర్శల జోరు పెంచాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య పవర్ వార్ కొనసాగుతోంది..విద్యుత్ కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, మోసమేనని కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడి చేసింది. కరెంట్ కొనుగోళ్ల ఒప్పందాలపై చర్చించలేక అధికార పార్టీ పలాయన వాదం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. బహిరంగ చర్చకు వస్తే తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయంతోనే టీఆర్‌ఎస్‌ వెన్ను చూపిందని ఎద్దేవా చేసింది. చర్చకు సై అంటే సై అన్న టీఆర్‌ఎస్‌ మాటతో కాంగ్రెస్ నేతలు నిన్న అమర వీరుల స్థూపం దగ్గర గంట సేపు టీఆర్‌ఎస్ నేతల కోసం ఎదురు చూశారు.

కాంగ్రెస్ సవాళ్లకు ప్రతిసవాల్ చేసిన టిఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ చివరి నిమిషంలో సవాల్‌కు మెలిక పెట్టడం ముఖ్యమంత్రి డైరక్షన్ మేరకే జరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. అధికార పార్టీ ఎక్కడా బహిరంగ చర్చలకు వెళ్లదని, అసెంబ్లీ వేదికగా మాత్రమే చర్చిస్తుందని సవాల్ ఎందుకు స్వీకరించారంటూ సుమన్, పల్లా రాజశ్వరరెడ్డిలను సీఎం మందలించినట్లు తెలుస్తోంది. అందుకే బాల్క సుమన్ చర్చకు మెలిక పెట్టి తప్పించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బహిరంగ చర్చకు సిద్ధమన్న బాల్క సుమన్ మరోసారి మీడియా ముందుకొచ్చి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రేవంత్‌ను వ్యక్తిగతంగా సుమన్ టార్గెట్ చేస్తే.. సీఎం రంగంలోకి దిగితే చర్చకు రెడీ అంటూ మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మరో సవాల్ విసిరారు. మొత్తం మీద అధికార, విపక్షాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతోనే కాలక్షేపం చేస్తున్నాయి తప్పితే.. బహిరంగ చర్చకు ముందుకు రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories