నిజామాబాద్ టీఆర్ఎస్ లో కలకలం

x
Highlights

నిజామాబాద్ అధికార పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. కొంతకాలంగా రగిలిపోతున్న సీనియర్ నాయకులు ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ...

నిజామాబాద్ అధికార పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. కొంతకాలంగా రగిలిపోతున్న సీనియర్ నాయకులు ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యేవర్గీయులు కూడా ప్రత్యారోపణలతో మాటల తూటాలు పేల్చారు. దాంతో కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంది.

నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు- బీటీ బ్యాచ్ మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఉద్యమకారులను పక్కనపెట్టి ఇతర పార్టీల నాయకులను ఎమ్మెల్యేలు అందలం ఎక్కిస్తుండడం పార్టీ జెండాలు మోసిన నేతలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే కోవకు చెందిన పార్టీ వ్యవస్ధాపక నేత పొలిట్ బ్యూరో సభ్యుడు ఎ.ఎస్.పోశెట్టి ఉద్యమ కారులను కూడగట్టి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను టార్గెట్ చేశారు. మార్కెట్ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో
పోశెట్టి ఆరోపణలు పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.

పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న పోశెట్టి గత కొంత కాలంగా స్తబ్దుగా ఉండి, ఒక్కసారిగా ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. ఆరోపణలు నిజం కాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ఎమ్మెల్యే దగ్గరే కార్యకర్తలా పనిచేస్తానంటూ సవాలు విసరడం పార్టీ అగ్రనేతలను విస్మయానికి గురిచేస్తోంది. అయితే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎ.ఎస్.పోశెట్టి ఆరోపణలను ఎమ్మెల్యే అనుచరులు, బంగారు తెలంగాణ బ్యాచ్ తిప్పికొట్టింది. పోశెట్టి పార్టీకి రాజీనామా చేసి విమర్శలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

టీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన విమర్శల్లో నిజానిజాలు ఎంతున్నా, ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో పార్టీ పరువు బజారున పడుతోంది. అధిష్ఠానం జోక్యం చేసుకుని ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది గులాబీ పార్టీలోని కొందరు నేతల అభిప్రాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories