గులాబీ మేనిఫెస్టో ఘుమఘుమల మెనూ

గులాబీ మేనిఫెస్టో ఘుమఘుమల మెనూ
x
Highlights

ఊహకందని వ్యూహాలు. ఆలోచనకు చిక్కని అస్త్రాలు. ఎత్తుకు పైఎత్తు. ప్రజలను కనికట్టు చేసే మ్యాజిక్కు. ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేసేలా స్ట్రాటజీలు....

ఊహకందని వ్యూహాలు. ఆలోచనకు చిక్కని అస్త్రాలు. ఎత్తుకు పైఎత్తు. ప్రజలను కనికట్టు చేసే మ్యాజిక్కు. ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేసేలా స్ట్రాటజీలు. అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన, ప్రచార హోరులో ముందంజ, ఇలా రకరకాల అస్త్రాలు సంధిస్తున్న గులాబీ దళాధిపతి, మినీ మేనిఫెస్టోతో, ఆకర్షణీయ ఆయధాలు వదిలారు. కొన్నిరోజులుగా ఊరిస్తున్న గులాబీ ఘుమఘుమల రుచి ఎలా ఉంటుందో, మినీ మ్యానిఫెస్టోతో మసాలా వాసన వదిలారు.


ఒకవైపు ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడుతున్నాయి నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్‌ పాలనపై మండిపడుతున్నాయి ఇప్పటికే ఉన్న ప్రభత్వ పథకాలను మించేలా, మ్యానిఫెస్టోను వండివారుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా స్కీముల అస్త్రం వదిలారు గులాబీ దళాధిపతి. పాత పథకాలకు పదునుపెడుతూ, కొత్తవాటికి రెక్కలు తొడుగుతూ, ప్రతిపక్షాల ఊహలకు అందనివిధంగా, మినీ మ్యానిఫెస్టోతో, ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు.

అందర్నీ ఆశ్చర్యపరిచేలా, వంటకాలను వండివార్చారు.

ఆసరా పెన్షన్లు భారీగా పెంచుతామన్నారు కేసీఆర్. ఈ పెన్షన్లురూ.2,016 చేస్తామన్నారు. అంతేకాదు, 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్‌ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు పెన్షన్లు రూ.3,016 అందిస్తామన్నారు.

ఇక నిరుద్యోగ భృతి కింద రూ.3,016 అందజేస్తామని చెప్పి, ప్రతిపక్షాల కంటే, ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామని చెప్పకనే చెప్పారు. సొంత స్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు.

ఇలా మినీ మ్యానిఫెస్టోతో ఊహించని వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రణాళిక కమిటీకి వివిధ వర్గాల నుంచి 300 పైచిలుకు విజ్ఞప్తులు వచ్చాయని, వచ్చిన విజ్ఞప్తులను క్రోడీకరించి చర్చించినట్లు కేసీఆర్ చెప్పారు. ప్రజలు కోరిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. నాలుగేళ్లుగా ప్రజలు కోరిన అంశాలను గమనంలోకి తీసుకున్నామని చెప్పారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు గేమ్‌లాంటిదని....టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం టాస్క్‌ వంటిదన్నారు. ఓట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలను ప్రజలకు చెబుతామని వెల్లడంచారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని, మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింతగా బయటకు లాగుతామని చెప్పారు. చంద్రబాబు వచ్చి, ఆంధ్రా-తెలంగాణ గొడవలు పెడదామనుకుంటున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్. తెలంగాణలో ఉన్నవాళ్లంతా, తెలంగాణవారేనని అన్నారు.

మొత్తానికి మినీ మ్యానిఫెస్టోతో మరో వ్యూహాత్మక అస్త్రం సంధించారు కేసీఆర్. ఇప్పటికే లబ్దిదారులుగా ఉన్నవారిని, రెట్టింపు హామీలిస్తున్న కాంగ్రెస్‌ వైపు మళ్లకుండా, తానే రెట్టింపు చేసి, ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అన్ని సభల్లోనూ ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల రెట్టింపు వాగ్ధానాల కంటే, అంతకుమించి అన్నట్టుగా ప్రామిస్‌లిచ్చారు. ఒకరకంగా కాంగ్రెస్‌నే డిఫెన్స్‌లో పడేశారని వి‌శ్లేషకులంటున్నారు. ఇక టీఆర్ఎస్‌ మినీ మ్యానిఫెస్టోను బట్టి, కాంగ్రెస్‌, మహాకూటమి తిరిగి వండివార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ హామీలకు దీటుగా కూటమి రెట్టింపు హామీలు ఇప్పుడే ప్రకటిస్తే, పూర్తిస్తాయి ప్రణాళికతో కేసీఆర్‌ మరో బ్రహ్మాస్త్రం సంధించే ఛాన్సుందని విశ్లేషకులంటున్నారు.

మొత్తానికి ఎన్నికల ముంగిట్లో అత్యంత ఆకర్షణీయ వరాలు ప్రకటించిన గులాబీ బాస్, మ్యానిఫెస్టో గేమ్‌ మొదలెట్టారు. ఇప్పుడు మహాకూటమి ఇంతకు మించేలా ఎన్నికల ప్రణాళిక లేకపోతే, అదే గులాబీ దళానికి అస్త్రమవుతుంది. చూడాలి. కేసీఆర్‌ వ్యూహాత్మక అస్త్రానికి, మహాకూటమి ఎలాంటి ఆయుధం వదులుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories