ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం... రాజా సింగ్‌పై పోటీ...

ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం... రాజా సింగ్‌పై పోటీ...
x
Highlights

ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపు. అందరి కళ్లూ ఆ అభ్యర్థి వైపు. కొందరు అవాక్కవుతున్నారు. మరికొందరు ఔరా అంటున్నారు. కిందా మీదా చూసి, ఎన్నికల్లో...

ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపు. అందరి కళ్లూ ఆ అభ్యర్థి వైపు. కొందరు అవాక్కవుతున్నారు. మరికొందరు ఔరా అంటున్నారు. కిందా మీదా చూసి, ఎన్నికల్లో పోటీ చేయడమేంటని, నొసలు చిట్లించేవారికీ లెక్కలేదు. ఎవరు వింతగా చూసినా, విడ్డూరంగా మాట్లాడినా, ఎన్నికల్లో నిలబడి తీరతాం హక్కుల సాధనపై చట్ట సభల్లో నినదిస్తామంటూ, ప్రజాతంత్ర యుద్ధంలో అడుగుపెట్టాలనుకుంటున్నారు వాళ్లు. ఇంతకీ ఏదా నియోజకవర్గం...ఎవరా అభ్యర్థి...ఎందుకింత ఆసక్తి...చూడండి ఆ మూడో రూపాన్ని వినండి ఆ మూడో గళాన్ని.

మూడో వర్గం. మూడో గళం. ఆడ, మగ కాకుండా మరో వర్గం. అందరిలాంటి మరో మనిషి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తానంటున్న నూతన స్వరం. సమాజంలో ఛీత్కారాలు, ఈసడింపులు, అసలు మనిషిలా కూడా గుర్తించని వర్గం నుంచి, సరికొత్త గొంతు దూసుకొస్తోంది. చట్టసభల్లో తమ బాధలను, గాథలను వినిపించేందుకు, పోరాటం చేసేందుకు, హక్కుల సాధనకు, మూడో వర్గం వస్తోంది. ఇదిగో ఈమె చంద్రముఖి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి ట్రాన్స్‌జెండర్.


గోషామహల్‌ బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్‌ చంద్రముఖి పోటీకి సిద్దమైంది. బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోటీకి రెడీ అంటోంది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌ చతుర్ముఖ పోరులో సత్తా చాటుతానంటోంది. సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న తమ ట్రాన్స్‌జెండర్‌ వర్గానికి ప్రతినిధిగా, తమ వాదన వినిపించేందుకు చట్టసభలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెబుతోంది చంద్రముఖి.

అయితే మొన్ననే నామినేషన్ వేసిన చంద్రముఖికి, చిన్న సమస్య వచ్చిపడింది. ఓటరు గుర్తింపుకార్డులో రాజేష్‌ అని ఉంది. పక్కనే ‘చంద్రముఖి’ పేరును బ్యాలెట్‌పేపర్‌లో చేరుస్తామని ఈసీ హామీ ఇచ్చిందని, ప్రజలెవరూ కన్‌ఫ్యూజ్‌ కాకుండా, ఇంటింటి ప్రచారంలో వివరిస్తానని చెబుతోంది చంద్రముఖి.

గోషామహల్‌ నియోజకవర్గంలో, ఏళ్లతరబడి సమస్యలు తిష్టవేశాయని, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు అంతకుముందు ఎమ్మెల్యేలు కూడా పరిష్కరించలేదని చెబుతోంది చంద్రముఖి. ప్రధానంగా బాల కార్మికులు, గుడుంబాపై ఆధారపడిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తానని, హామీఇస్తోంది. ‘మీ సమస్యలేంటో చెప్పండి, ఆ తర్వాతే ఓటేయండి’ అని ప్రజలకు విన్నవించుకుని, వారి మనసు గెలుస్తానంటోంది.

మొత్తానికి సమాజంలో రకరకాల వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్లు, చట్టసభల్లోకి ప్రవేశించేందుకు ఇప్పుడిప్పడే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా హక్కులు కొట్లాడి సాధించుకున్నారు. 1994లో తొలిసారి ఓటు హక్కు పొందారు. వీరి జనాభా కూడా గుర్తించగలిగే స్థాయిలో ఉండటంతో, రాజకీయ పార్టీలు కూడా అనేక హామీలిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ కూడా అనేక వాగ్దానాలు వీరికిచ్చింది. తమిళనాడు, కేరళ, ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో, పార్టీలు మేనిఫెస్టోల్లో ట్రాన్స్‌జెండర్ల సమస్యలు పరిష్కరిస్తామని ప్రామిస్‌ చేస్తున్నాయి.

అయితే, రాజ్యాంగబద్దంగా తమకున్న హక్కులను సాధించాలంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని చంద్రముఖి లాంటి ట్రాన్స్‌జెండర్లు పట్టుదలగా ఉన్నారు. దేశంలో తొలి ట్రాన్స్‌‌జెండర్ ఎమ్మెల్యేగా షబ్నం మౌసి చరిత్ర సృష్టించారు. 1998లో మధ్యప్రదేశ్‌లోని సోహాగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చట్టసభల్లో స్వరం వినిపించిన హిజ్రాగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 2003లో జీతి జితాయి పాలిటిక్స్‌..అనే రాజకీయ పార్టీని స్థాపించి, ఎనిమిది పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు సరికొత్తదారి చూపిన షబ్నం మౌసి జీవితం ఆధారంగా, సినిమా కూడా తెరకెక్కింది. షబ్నం స్ఫూర్తిగా తమిళనాడు, కేరళ, యూపీతో పాటు అనేక రాష్ట్రాల్లో ట్రాన్స్‌ జెండర్‌ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో చంద్రముఖి, చట్టసభల్లో అధ్యక్షా అనేందుకు సిద్దమంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories