గులాబీ గూటిలో టెన్షన్‌... ఆశావహుల మాటేమిటి మరి?

గులాబీ గూటిలో టెన్షన్‌... ఆశావహుల మాటేమిటి మరి?
x
Highlights

టీఆర్ఎస్ పార్టీ మొదటి జాబితాలో టికెట్టు లభించిన వారు ప్రచారంలో దూసుకుపోతుంటే...ఇప్పటికీ పేర్లు ప్రకటించని 14 నియోజకవర్గాల్లోని నేతలు, తమపేరు ఎప్పుడు...

టీఆర్ఎస్ పార్టీ మొదటి జాబితాలో టికెట్టు లభించిన వారు ప్రచారంలో దూసుకుపోతుంటే...ఇప్పటికీ పేర్లు ప్రకటించని 14 నియోజకవర్గాల్లోని నేతలు, తమపేరు ఎప్పుడు ప్రకటిస్తారా అని టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. అసలు టికెట్టు వస్తుందా రాదా అనే మీమాంసంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,105 నియోజక వర్గాల్లో అభ్యర్దులను ఒకేసారి ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు. ప్రతిపక్షాలు తేరుకోకముందే ప్రచారంలో దూసుకుపోవాలని ఆదేశించారు. ముందే అభ్యర్థులను ప్రకటించడం వెనక వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నా, మిగిలిన 14 స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించకపోవడంతో, అక్కడ టికెట్టు ఆశించిన నేతలు ఇప్పుడేం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ఎవరికి వారు నియోజకవర్గాల్లో తమకే టికెట్టు దక్కాలనే బల ప్రదర్శనకు దిగుతున్నారు.

అయితే టీఆర్ఎస్, పేరుకు 14 నియోజకవర్గాల్లో అభ్యర్దులను ప్రకటించాల్సి ఉన్నా... అందులో ఏడు మాత్రమే సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. మిగతా వాటిల్లో రెండు ఎంఐఎం స్థానాలు చార్మినార్, మలక్‌పేట...బీజేపీ స్థానాలైన, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, నియోజకవర్గాల్లోనూ, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై అనేక ప్రచారాలు సాగుతున్నాయి. ఇవేకాక చొప్పదండి, వరంగల్ ఈస్ట్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఈ ఐదు స్థానాలు టీఆర్ఎస్ సిట్టింగ్‌లవి కావడంతో, వారంతా అయోమయంలో పడ్డారు. ఇటు అధిష్టానం నుంచి టెకెట్టు ఇస్తామనే హామీ రాక, టికెట్టు రాదనే సంకేతమూ రాక సతమతం అవుతున్నారు. నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టాలో లేదో అర్థంకాక అటు ప్రగతి భవన్ చుట్టూ, ఇటు తమ గాడ్ ఫాదర్ మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇక మిగిలిన జహీరాబాద్, కోదాడ, హుజూర్ నగర్, నిజయోక వర్గాలు కాంగ్రెస్ కంచుకోటలు. అక్కడి నేతలు గీతారెడ్డి, పద్మావతి, ఉత్తమ్ కూమార్ రెడ్డిలను ఓడించడానికి బలమైన అభ్యర్దుల వేటలో ఉంది గులాబీ పార్టీ. అయితే ఇక్కడి నియోజకవర్గాల్లో కూడా టికెట్టు ఆశిస్తున్న నేతలు, పార్టీ నుంచి తమకే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తుతం వినాయక నిమజ్జనం తరువాత అభ్యర్దులను ప్రకటించని నియోజకవర్గాల్లో పేర్లు ప్రకటిస్తారని పార్టీలోని ముఖ్యనేతలంటున్నారు. మొత్తానికి టికెట్టు వస్తుందో రాదో తెలియక, 14 స్థానాల్లో ఆశావహులు సతమతమవుతున్నారు. ఒకవేళ టెకెట్టు రాకపోతే పార్టీ మారే, ఆలోచనలో కూడా కొందరున్నారు. అయితే మరికొందరూ మాత్రం పార్టీ ఆధినేత తమకు టికెట్టు ఇచ్చినా, ఇవ్వకున్నా న్యాయం చేస్తారని భావిస్తున్నారు. చెప్పేదేదో ముందే చెబితే, ఈ టెన్షన్ తప్పుతుంది కదా అని వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories