రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ల రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ల రిజర్వేషన్లు ఖరారు
x
Highlights

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు భారీ ముందడుగు పడింది. ఎట్టకేలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ మినహా...

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు భారీ ముందడుగు పడింది. ఎట్టకేలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ మినహా మొత్తం 30 జిల్లాల్లోని పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇక ఏ పంచాయతీ ఏ కేటగిరీకి వెళ్తుందనే విషయాన్ని అధికారులు ఖరారు చేయనున్నారు. వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ నెలాఖరులోగా పంపించనున్నారు. దీంతో ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 12 వేల 751 పంచాయతీలున్నాయి. ఇందులో ఎస్టీలకు 3 వేల 146, ఎస్సీలకు 2 వేల 113, బీసీలకు 2 వేల 345, జనరల్ కేటగిరీలో 5 వేల 147 పంచాయితీలను కేటాయించారు. షెడ్యూల్‌ ఏరియాల్లో ఎస్టీలకు 1 వెయ్యీ 281 పంచాయతీలు కేటాయించగా ఇందులో 641 పంచాయతీలను మహిళలకు, 640 ఎస్టీ జనరల్ కేటగిరీలో కేటాయించారు.

వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1 వెయ్యీ 177 పంచాయతీలను వారికే కేటాయించారు. అలాగే మిగతా పంచాయతీల్లో 688 ఎస్టీలకు కేటాయించారు. దీంతో ఎస్టీ రిజర్వ్‌డ్‌ పంచాయతీలు భారీగా పెరిగినట్లైంది. మొత్తం 19.48 శాతం పంచాయతీలు ఎస్టీలకే కేటాయించినట్లైంది. గత హయాంలో రాష్ట్రంలోని గిరిజన తండాలను ప్రభుత్వం పంచాయతీలుగా గుర్తించింది. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచ్‌ల పాలన మొదలుకానుంది. వందశాతం గిరిజనులున్న పంచాయతీల్లో ఇక నుంచి స్వయంపాలన మొదలుకానుంది. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో సగం మంది సర్పంచ్‌లు మహిళలే కానున్నారు.

నిజానికి పంచాయతీ పాలకవర్గాల సమయం గత ఆగష్టులో ముగిశాయి. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. అయితే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే రిజర్వేషన్ల ఖరారు ఆలస్యం కావడంతో ఎన్నికలు నిర్వహించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో జనవరి 10 లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ నెలాఖరు లోపు రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఈసీకి అందితే ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ భారీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. 12 వేల 751 పంచాయతీల్లో 11 వేలకు పైగా పంచాయతీలను కైవసం చేసుకునేందుకు భారీ కసరత్తు చేస్తోంది. ఇందులో ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను ఏకగ్రీవంతోటే ఖాతా వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories