Top
logo

మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం ప్రియులకు శుభవార్త
X
Highlights

మద్యంప్రియులకు శుభవార్త. వివిధ రకాల మద్యం బ్రాండులు, వాటి ఎంఆర్‌పీ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా...

మద్యంప్రియులకు శుభవార్త. వివిధ రకాల మద్యం బ్రాండులు, వాటి ఎంఆర్‌పీ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ప్రారంభించారు. వినియోగదారుల్లో చైతన్యం కల్పించడానికే ‘లిక్కర్ ప్రైస్ యాప్‌’ను తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు అరచేతిలోకి మద్యం ధరలు వచ్చేయడంతో వైన్‌షాపుల ఆగడాలకు కళ్లెం పడినట్టయ్యింది.

మద్యం ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘లిక్కర్ ప్రైస్ యాప్‌’ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆవిష్కరించారు. మద్యం అమ్మకాల్లో దుకాణాదారులు పారదర్శకత పాటించాలని ఉద్దేశంతోనే ఈ యాప్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. వైన్‌షాపులు, బార్ల యజమానులు తమ దుకాణాల్లో మద్యం ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆయన స్పష్టం చేశారు.

తాజా యాప్‌తో మద్యం విక్రయందారులు ఆటలు కట్టించొచ్చన్నారు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌. ఏదైనా బ్రాండ్ ఆల్కహాల్‌ను ఎంఆర్‌పీ రేట్ల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గమనిస్తే.. యాప్ ద్వారా వివరాలు తెలుసుకొని వారిని ప్రశ్నించొచ్చన్నారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులకు జరిమానా కూడా విధించనున్నట్లు అకున్‌ సబర్వాల్‌ హెచ్చరించారు.

అబ్కారీ శాఖలో నిరంతర పర్యవేక్షణ, జవాబుదారీతనం కోసం సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఆ శాఖ ఇంచార్జి కమిషనర్ సోమేష్ కుమార్ చెప్పారు. అన్ని రకాల మద్యానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఈ యాప్‌లో లభ్యమవుతుందని సోమేష్ తెలిపారు. యాప్‌ పనితీరును ఆయన వివరించారు. భవిష్యత్తులో ఈ యాప్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

ఎమ్మార్పీ కంటే అదనపు రేట్లకు ఎవరైనా మద్యం అమ్మితే 7989111222 అనే నెంబర్‌కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. లేదా 1800 425 25 23 అనే నెంబర్‌కు ఉచితంగా ఫోన్ చేసి సంబంధిత షాపుపై ఫిర్యాదు చేయొచ్చు. అయితే, మద్యం కల్తీలు, ఎమ్మార్పీకంటే ధరలు పెంపుపై ఈ యాప్ ఎంత వరకు పనిచేస్తోందో వేచి చూడాలి.

Next Story