చెట్టే కదా అని నరికితే.. శిక్షే

చెట్టే కదా అని నరికితే.. శిక్షే
x
Highlights

ఓ వైపు ప్రభుత్వం మొక్కలు నాటడాన్ని పెద్ద ఎత్తున చేపడుతుంటే మరోవైపు దశాబ్దాలుగా తలెత్తుకొని నిల్చిన వృక్షాలు నేలకొరుగుతున్నాయి. ఇకపై ఇది చెల్లదు....

ఓ వైపు ప్రభుత్వం మొక్కలు నాటడాన్ని పెద్ద ఎత్తున చేపడుతుంటే మరోవైపు దశాబ్దాలుగా తలెత్తుకొని నిల్చిన వృక్షాలు నేలకొరుగుతున్నాయి. ఇకపై ఇది చెల్లదు. ఇంట్లో అయినా మొక్కలు, చెట్లను ఇష్టారాజ్యంగా కొట్టేయడం కుదరదు. ఒక చెట్టు కొట్టేయాలంటే అందుకు తగిన కారణాలు చూపి అటవీశాఖ అధికారుల అనుమతి పొందాల్సిందే. లేకుంటే వాల్టా చట్టం ప్రకారం వేలాది రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజల చేత, వివిధ సంస్థల ద్వారా కోట్లాదిగా మొక్కలు నాటిస్తోంది. పచ్చదనం పెరిగేతేనే సకాలంలో వర్షాలు పడటంతో పాటు పర్యావరణం అహ్లాదకరంగా ఉంటుందని ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. నాటిన మొక్కలు చెట్లుగా పెరిగే వరకు జియో ట్యాగింగ్ చేసి సంరక్షించే పనిని వివిధ సంస్థలకు అప్పగిస్తోంది.

కాంక్రీట్ జంగిల్లా మారుతున్న నగరాల్లో పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ..చాలా మంది తమ ఇంటి ముందు వెలుతురు కోసమని..విద్యుత్ తీగలకు అడ్డొస్తున్నాయని.. ఆకులు రాలి చెత్త వస్తుందని ఏపుగా పెరిగిన వృక్షాలను కొట్టేస్తున్నారు. ఇకపై అలా నరికేస్తే ఊరుకోబోమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థలు, అటవీ అధికారుల అనుమతి లేకుండా కొట్టేస్తే వాల్టా చట్టం కింద కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు.

ఏదైనా చెట్టును తొలగించాల్సి వస్తే ఆ సమాచారాన్ని ముందుగా అక్కడి డివిజన్ అటవీ శాఖాధికారికి నిర్దేశిత ఫార్మాట్‌లో తెలియజేయడంతో పాటు నిర్ణీత రుసుము చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే సంబంధిత అధికారులు అనుమతినివ్వాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెయ్యి నుంచి 50 వేల వరకు జరిమానా విధిస్తారు. తొలగించడానికి వీల్లేని జాబితాలోని చెట్లను నరికితే వాటి విలువపై రెండు నుంచి ఐదు రెట్ల వరకు ఫైన్ వేస్తారు. హైదరాబాద్ లో పలుచోట్ల చట్టాన్ని అతిక్రమించి చెట్లు నరికినవారికి 10 నుంచి 50 వేల వరకు జరిమానా వడ్డించారు అధికారులు.

చెట్టు కొట్టేయాలంటే దానికి బదులు మరో వృక్షాన్ని పెంచుతానని సర్కారుకు హామీ పత్రం ఇవ్వాలని రాష్ట్ర వాల్టా చట్టంలో సవరణలు చేస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఇక నుంచి పక్కాగా అమలు చేయనున్నారు. చెట్లు నరకాలంటేనే భయం కలిగేలా చట్టం అమలు చేస్తామంటున్న అధికారులు.. ఆచరణలో ఏమాత్రం సక్సెస్ అవుతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories