టీ కాంగ్రెస్‌లో సీనియర్ లేఖ కలకలం

టీ కాంగ్రెస్‌లో సీనియర్ లేఖ కలకలం
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు క్రీయాశీలకంగా మారుతున్నారా ? పార్టీ వ్యవహారాలపై అధినేత రాహుల్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారా ? లేఖాస్త్రాలు సంధిస్తూ...

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు క్రీయాశీలకంగా మారుతున్నారా ? పార్టీ వ్యవహారాలపై అధినేత రాహుల్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారా ? లేఖాస్త్రాలు సంధిస్తూ తమ పని తాము చేసుకుపోతున్నారా ? అంటే అవుననే సమాధానాలు టెన్ జన్‌పధ్ నుంచి గాంధీ భవన్‌ వరకు వినిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి తెరపైకి వస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల్లోని లోపాలను అధినేత రాహుల్‌కు వివరిస్తూ రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత ఎంఎస్ఆర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌లో వెలమలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఓ బాంబు పేల్చారు. అధికార పార్టీలో అదే కులానికి చెందిన వారు రాజ్యం ఏలుతుంటే...! రాష్ట్ర నేతలు మాత్రం ఆ వర్గాన్ని దూరం చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీ అధినేతకు లేఖ రాశారు.

ఆరోగ్యం సహకరించకపోవడంతో కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెస్సార్‌ దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో నేరుగా అధినేతకు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీకి అండగా ఉంటున్న వెలమలను చేజేతులా దూరం చేసుకుంటున్నారంటూ రాహుల్‌కు రాసిన లేఖలో ఆరోపించారు. ఇటీవలే స్టేట్ ఎన్ఎస్‌‍యూఐ ఎన్నికలో వెలమ వర్గానికి చెందిన బాలుమూరి వెంకట్రావు గెలిచారు. అయితే గ్యాంబ్లింగ్ జరిగిదంటూ పీసీసీ నేత ఒకరు అధికారిక ప్రకటన రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరు నేతల వ్యవహారశైలి వల్ల మొత్తం వర్గం దూరమయ్యే పరిస్ధితులు వచ్చాయంటూ ఆరోపించారు.

ఎమ్మెస్సార్ లేఖపై అధినేత రాహుల్ వెంటనే స్పందించారు. లేఖ అందిన మరుక్షణమే ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్‌గా వెంకట్ పేరు అధికార వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అంతటితో ఆగకుండా రాహుల్ ఎమ్మెస్సార్‌కి మరో లేఖ రాశారు. పార్టీలో మీలాంటి వారి సలహాలు సూచనలు తప్పకుండ పాటిస్తామంటూ ఇచ్చాడు. దీంతో వివాదం సద్ధమణిగినా ఇదే అదునుగా రాహల్‌కు వివిధ అంశాలపై లేఖలు రాయాలని ఎమ్మెస్సార్‌తో పాటు సీనియర్ నేతలు భావిస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories