ఐదుగురు మంత్రుల‌కు సీఎం కేసీఆర్ చెక్

ఐదుగురు మంత్రుల‌కు సీఎం కేసీఆర్ చెక్
x
Highlights

కేబినెట్ విస్తరణకు తెలంగాణ సర్కార్ త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుత కేబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు...

కేబినెట్ విస్తరణకు తెలంగాణ సర్కార్ త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుత కేబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10రోజులపాటు ఫామ్‌హౌజ్‌లో ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై తుది కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తన కేబినెట్‌లో మార్పులు, చేర్పులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అందుకు దాదాపు మూహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గం విస్తరణ చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10రోజుల నుంచి ఫామ్‌హౌజ్‌లో సీఎం.. పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో ముగ్గురు, నలుగురు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వారందరినీ తప్పించి, పలువురు మహిళలను కేబినెట్లోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి తప్పించే వారిలో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి చందూలాల్, హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరో మంత్రి పేరు కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. అయితే, ఆయన ఎవరనేది త్వరలో తేలనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు.. కొత్తగా కేబినెట్‌లోకి వచ్చే వారిలో ప్రస్తుత స్పీకర్ మధుసుదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ప్రస్తుత చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖలను నియమించనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించినందున స్వామిగౌడ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావును నియమించనున్నారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే మంత్రులకు పార్టీలోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, రెడ్డి సామాజిక వర్గంలో పట్టు సాధించేందుకు నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోబోతున్నారు కేసీఆర్.

మంత్రివర్గంలో మహిళలు లేరన్న విమర్శలను తిప్పికొట్టేందుకు కొందరి పేర్లను సీఎం పరిశీలించారు. అందులో కొండా సురేఖ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇక కోవా లక్ష్మీ, రేఖా నాయక్ పేర్లు కూడా పరిశీలించారు. అయితే, ఆదివాసీలు, లంబాడీల గొడవల కారణంగా కోవా లక్ష్మీకి ఇస్తే లంబాడీల నుంచి వ్యతిరేకత వస్తుందని, మరో ఎమ్మెల్యే రేఖానాయక్‌పై కొన్ని అవినీతి, ఆరోపణలు రావడంతో పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటుదక్కుతుందో, ఎవరికి ఉద్వాసన పలుకుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories