చింతమనేనికే చుక్కలు చూపించిన టోల్‌ప్లాజ్ సిబ్బంది

చింతమనేనికే చుక్కలు చూపించిన టోల్‌ప్లాజ్ సిబ్బంది
x
Highlights

వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేనికి టోల్‌ ప్లాజా సిబ్బంది చుక్కలు చూపించారు. ఎప్పటిలాగే తన మార్కు ఓవరాక్షన్ చేయబోయిన చింతమనేనికి సడన్...


వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేనికి టోల్‌ ప్లాజా సిబ్బంది చుక్కలు చూపించారు. ఎప్పటిలాగే తన మార్కు ఓవరాక్షన్ చేయబోయిన చింతమనేనికి సడన్ షాకిచ్చారు. తాను ఎమ్మెల్యేను మొర్రో అంటూ మొత్తుకున్నా వినిపించుకోకుండా చింతమనేని కారును నిలిపివేశారు. కారుకు నెంబర్ ప్లేట్‌ లేకపోవడం, కనీసం ఎమ్మెల్యే స్టిక్కర్, పాస్‌ కూడా లేకపోవడంతో చింతమనేని వాహనానికి అనుమతివ్వలేదు. దాంతో కారును టోల్‌ ప్లాజాలోనే వదిలేసి వెళ్లిపోయారు చింతమనేని. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్‌ నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్‌అనేవిధంగా తనకెదురు చెప్పేవాళ్లకు చుక్కలు చూపించే చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌కే చుక్కెదురైంది. ఈసారి రివర్స్‌లో చింతమనేనికే చుక్కలు చూపించారు టోల్ ప్లాజా సిబ్బంది. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సరే చింతమనేని కారును విడిచిపెట్టలేదు. ఎమ్మెల్యేను మొర్రో అంటూ మొత్తుకున్నా గుంటూరు జిల్లా కాజా టోల్‌ ప్లాజా సిబ్బంది వినిపించుకోకపోవడంతో కారును అక్కడే వదిలేసి బస్సులో వెళ్లిపోయారు చింతమనేని.

ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారంలో కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు వివరణ ఇవ్వాలని టోల్‌గేట్‌ సిబ్బందిని ఆదేశించారు. అయితే చింతమనేని వివాదంపై స్పందించిన టోల్‌గేట్ సిబ్బంది... ఎమ్మెల్యే కారుపై నెంబర్ లేదని, ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేదని వివరణ ఇచ్చారు. పైగా చింతమనేని మంకీ క్యాప్ ధరించడంలో గుర్తుపట్టలేకపోయామని సంజాయషీ ఇచ్చారు. గన్‌మన్లను చూసిన తర్వాత కారును వదిలిపెట్టామని, కానీ చింతమనేని వెహికల్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారని తెలిపారు. చివరకు చింతమనేనికి క్షమాపణ చెబుతున్నామని టోల్‌గేట్‌ సిబ్బంది చెప్పారు.

టోల్‌ గేట్‌ వివాదంలో మరో మాట కూడా వినిపిస్తోంది. చింతమనేని ఎప్పటిలాగానే తన స్టైల్లో రెచ్చిపోయారన్న ప్రచారం జరుగుతోంది. టోల్‌ గేట్‌ సిబ్బంది చింతమనేని కారును ఆపగానే తనకు అలవాటైన రీతిలో దూషణకు దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టోల్‌ ప్లాజా సిబ్బంది అదే స్థాయిలో రివర్స్‌ కావడంతో చింతమనేని తన కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే, అందరికీ చుక్కలు చూపించే చింతమనేనికే టోల్‌ గేట్‌ సిబ్బంది రివర్స్‌లో చుక్కలు చూపించారంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories