టార్గెట్‌ పాలిటిక్స్... ఎంపీ ఔర్‌ ఎమ్మెల్యే!!

టార్గెట్‌ పాలిటిక్స్... ఎంపీ ఔర్‌ ఎమ్మెల్యే!!
x
Highlights

రాజకీయ పార్టీల్లో కార్యకర్త అయినా, ఓ మోస్తరు నేతయినా, చివరికి వారి లక్ష్యం ప్రజాప్రతినిధి కావడం. అందులోనూ ఎంపీ లేదా ఎమ్మెల్యే టార్గెట్. అందుకోసం...

రాజకీయ పార్టీల్లో కార్యకర్త అయినా, ఓ మోస్తరు నేతయినా, చివరికి వారి లక్ష్యం ప్రజాప్రతినిధి కావడం. అందులోనూ ఎంపీ లేదా ఎమ్మెల్యే టార్గెట్. అందుకోసం పార్టీకి రేయింబవళ్లు పని చేస్తారు. పోస్టర్లు అతికించడం, జెండాలు మోయడం, మీటింగ్‌లు అరెంజ్ చేయడం, పార్టీలో కార్యకర్త నుంచి కీలక పదవులకు చేరడం, చివరిక ప్రజాప్రతినిధిగా నిలబడేందుకు పార్టీ టికెట్‌ దక్కడం. చివరికి వీరి అంతిమ లక్ష్యం ప్రజాప్రతినిధి. ముఖ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులకైతే, ఇక తర్వాత తమకు ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందని గంపెడాశలో ఉంటారు. అయితే, చాలా పార్టీల్లో, జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారికి సైతం ఈసారి కూడా టికెట్‌ దక్కే ఛాన్స్ కనపడ్డం లేదు. ముఖ్యంగా 12 నియోజవర్గాలున్న, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో, అన్ని పార్టీల జిల్లాల అధ్యక్షులదీ దీన పరిస్థితే.

మొదట అధికార టీఆర్ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుని సంగతి చూద్దాం. టీఆర్ఎస్‌ ఉద్యమ పార్టీగా ఉన్న, అధికార పార్టీగా ఉన్నా, పార్టీని తన భూజాలపై వేసుకుని నడిపిన వ్యక్తి తక్కళ్ళపళ్ళి రవిందర్ రావు. గత రెండు ఎన్నికల్లో పాలకుర్తి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ఉద్యమ నేపథ్యం కలిగిన నేతగా పేరున్నా, ఇప్పటివరకు ఒక్కసారి కుడా పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనుకుని పాలకుర్తిలో అంతా సిద్దం చేసుకున్న తరుణంలో, టిడిపి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, టీఆర్ఎస్‌లోకి వచ్చి, పాలకుర్తి టికెట్‌ను ఎగరేసుకుపోయారు. అయితే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకున్నా, ఎమ్మెల్సీ, లేదా కార్పోరేషన్ పదవి దక్కే అవకాశం ఉంది. శాసనసభలో అధ్యక్షా అనే ఛాన్స్‌ దక్కకపోవడంతో, తీవ్ర నిరాశలో కూరుకుపోయారు తక్కళ్ళపళ్ళి రవిందర్.

కాంగ్రెస్‌ డీసీసీ ప్రెసిడెంట్‌‌దీ అదే సిచ్యువేషన్. ప్రస్తుతం కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి సుదీర్గకాలంగా పార్టీ కార్యకర్తగా ఉన్నారు. అధికారం ఉన్నా లేకున్నా, పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే సిీనియర్ల లాబీయింగ్‌తో, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ లభించలేదు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా, నాలుగన్నరేళ్ళుగా పార్టీని నడిపిన అనుభవం ఉన్న నాయిని, వరంగల్ పశ్చిమను ఆశించారు. గతంలో పోటీ చేసిన కొండపల్లి దయాసాగర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఈమద్యే రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోకి వచ్చిన వేంనరేందర్ రెడ్డి ఇదే టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ నియోజకవర్గంలో బస్తిీ యాత్రలు, పలు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న నాయినికి మాత్రం, టిక్కెట్ దక్కే అవకాశాలు సన్నగిల్లాయి. తీవ్ర పోటి, మరోవైపు కాంగ్రెస్, టిడిపి పొత్తు కూడా నాయినికి అడ్డంకిగా మారుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని పార్టీల అధ్యక్షులదీ ఇదీ పరిస్థితి. పార్టీలను నడిపిన వారెవ్వరికీ, ఈసారి అభ్యర్థిగా ఛాన్స్‌ దక్కేలా లేదు. అయితే ఇంకా కొన్ని పార్టీలు, అభ్యర్థులను ప్రకటించలేదు. ఒకవేళ, జిల్లా అధ్యక్షుల్లో ఎవరికో ఒకరికి టికెట్‌ దక్కితే మాత్రం, వాళ్లు అదృష్టవంతులే.

Show Full Article
Print Article
Next Story
More Stories