తమిళనాట ఉత్కంఠ

తమిళనాట ఉత్కంఠ
x
Highlights

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ అమితాసక్తికరంగా తయారయ్యాయి. గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి క్రమంగా...

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ అమితాసక్తికరంగా తయారయ్యాయి. గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి క్రమంగా ముదిరి పరాకాష్ఠకు చేరింది. తమిళనాడులో టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన అన్నాడిఎంకే వర్గం ఎమ్మెల్యేలు 18 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ ధనపాల్ తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదాస్పదమైనది. పళనిస్వామి సర్కారు బలపరీక్షకు రాష్ట్ర హైకోర్టు విధించిన గడువుకు రెండు రోజుల ముందు తీసుకున్న ఈ పక్షపాత చర్యలోని మర్మమేమిటో తెలిసిందే. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వేరు కుంపటి కారణంగా మైనారిటీలో పడి కుప్పకూలే ప్రమాదం ఉన్న ఎడప్పాడి పళని స్వామి ప్రభుత్వాన్ని కాపాడటం కోసమే స్పీకర్ ఈ చర్యకు ఉపక్రమించారు. స్పీకర్ అనర్హత నిర్ణయంపై దినకరన్ వర్గం మళ్లీ న్యాయుస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానాల ఆదేశాలు, ఉపదేశాల మాట ఎలా ఉన్నా, దేశంలోని స్పీకర్ వ్యవస్థ పక్షపాత రహిత ప్రజాస్వామిక స్వభావాన్ని కోల్పోతున్న వైనాన్ని తమిళనాడు రాజకీయ పరిణామాలు మరొక సారి నిరూపించాయి.

పళని స్వామి ప్రభుత్వం వేరు కుంపటి పెట్టుకొన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ద్వారా శాసనసభలో తన మెజారిటీని నిలబెట్టుకునే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు తక్షణం బలపరీక్ష పెట్టాలని దినకరన్ వర్గం ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును కోరింది. బలపరీక్ష నిర్వహించేందుకు గవర్నర్ జాప్యం చేస్తుండటంతో దినకరన్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. బలపరీక్షను ఈ నెల 20వ తేదీలోపు జరుపరాదని హైకోర్టు స్టే విధించడంతో పళని స్వామి ప్రభుత్వానికి మెజారిటీ సాధించేందుకు కొంత వ్యవధి దొరికినట్లయింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కారణంగా ఆ సంఖ్య 215కి తగ్గడంతో ప్రభుత్వం నిలబడేందుకు అవసరమైన సంఖ్యాబలం 108కి చేరుతుంది. దాంతో 111 మంది శాసనసభ్యులున్న పళని స్వామి ప్రభుత్వం కొనసాగడంలో సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులూ ఉండవు. గవర్నర్ కూడా అందుకు మౌనంగా అందుకు అంగీకరించడమంటే, ఈ మొత్తం రాజకీయ పరిణామాల వెనుక పళనిస్వామి ప్రభుత్వం ఏ విధంగానైనా కొనసాగించాలన్న కేంద్రం హస్తం ఉందేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ప్రజా మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏర్పరచిన పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడినపుడు తాజాగా ఎన్నికలు నిర్వహించడమే ప్రజాస్వామిక సంప్రదాయం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం శాసనసభ్యులపై అనర్హత వేటు వేయడంపై న్యాయ సమీక్ష జరగవలసి ఉన్నది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా పరిగణించి, వారిని అనర్హులుగా ప్రకటించిన తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగ బద్ధమైనదా కాదా అన్న విషయం తేల్చాల్సి ఉంది. 2011లో కర్నాటకలో యడ్యూరప్ప ప్రభుత్వ హయాంలో ఆనాటి స్పీకర్ 11 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడాన్ని గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది.

గత ఏడాది ఉత్తరాఖండ్‌లో ప్రతిపక్షంతో చేతులు కలిపిన అసమ్మతి వర్గాన్ని ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే తమిళనాడులో దినకరన్ వర్గం ప్రతిపక్షంతో చేతులు కలపిన దాఖలాలు లేకపోయినా వారిని అనర్హులుగా స్పీకర్ ప్రకటించడం అప్రజాస్వామిక చర్యగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి నుంచి తన ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపణల్లో నిజం ఉండొచ్చు లేకపోవచ్చూ. రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోతున్న పరిస్థితిని కేంద్రం చక్క దిద్దేందుకు ప్రయత్నించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తే, పౌర పాలన కుంటుపడి ఆ రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమాలపై ప్రతికూల ప్రభావం పడుతంది. దాంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. గవర్నర్ చర్యతో ప్రళనిస్వామి ప్రభుత్వం శాసనసభలో మెజారిటీ సాధించి అధికారంలో కొనసాగ వచ్చు. అయితే ఆ పరిణామం ప్రజాస్వామ్య ప్రక్రియకు కళంకంగా నిలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories