విద్యార్ధుల్ని పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు

x
Highlights

ఎల్ కేజీ నుంచే ఐఐటీ స్పెషల్ టీచింగ్ ఇస్తూ.. దేశంలోనే గొప్ప పేరును సంపాదించుకున్న మన కార్పోరేట్ కాలేజీలు అందుకు తగ్గట్లుగా విద్యార్థులను...

ఎల్ కేజీ నుంచే ఐఐటీ స్పెషల్ టీచింగ్ ఇస్తూ.. దేశంలోనే గొప్ప పేరును సంపాదించుకున్న మన కార్పోరేట్ కాలేజీలు అందుకు తగ్గట్లుగా విద్యార్థులను పీల్చిపిప్పిచేస్తున్నాయి. యేడాది పొడగునా చదువులు, పరీక్షలంటూ రకరకాల ప్రయోగాలు చేస్తున్న కాలేజీలు ఇంటర్ స్టూడెంట్స్ ను సైతం వదలడం లేదు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోయి వారం తిరగకముందే ప్రత్యేక క్లాసుల పేరుతో అప్పుడే క్లాసులు మొదలుపెట్టాయి. సెకండ్ ఇయర్ పోర్షన్ లో కొంత భాగాన్ని ఇప్పుడే కంప్లీట్ చేసేందుకు ముందస్తు తరగతులను తీసుకుంటున్నాయి.

హైదరాబాద్ లో పేరుమోసిన శ్రీ ఛైతన్య, నారాయణ కాలేజీలే కాకుండా వాటి అడుగుజాడల్లో నడుస్తున్న మిగతా కళాశాలలు కూడా విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోగానే సెకండియర్ క్లాసులు తీసుకుంటున్నాయి. కనీస విరామం ఇవ్వకుండా, మనశ్శాంతి లేకుండా పాఠాలు బోధిస్తున్నాయి. ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

నిబంధనల ప్రకారం విద్యార్థులకు వేసవి సెలవులివ్వాలి. వారి మానసిక ఉల్లాసం కోసం చదువులకు విరామం ప్రకటించాలి. ప్రత్యేక క్లాసులు, క్రాష్ కోర్సుల పేరుతో ఎలాంటి క్లాసులు తీసుకోవద్దు. వీటిపై సర్కారు నిబంధనలు కూడా ఉన్నాయి. అయినా కార్పోరేట్ స్కూళ్లు ఆ నిబంధనలను చెవికెక్కించుకోవడం లేదు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు అయిపోయి వారం కాలేదు అప్పుడే మళ్లీ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇన్నాళ్లూ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం రాత్రీ పగలు కష్టపడి పుస్తకాల్లో మునిగిన పిల్లలు దాన్నుంచి బయటపడే అవకాశం కూడా ఇవ్వకుండా తరగతులు నడిపిస్తున్నాయి. క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. ఉదయం 8 గంటలకే మొదలవుతున్న క్లాసులు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో మాదిరిగా తరగతులను తీసుకుంటున్నాయి.

సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్ లేదా జేఈఈ లేక మరేదైనా కోర్సుల కోసం చదవడం, ప్రత్యేక క్లాసులకు వెళ్లడం ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు అలాంటి పరిస్థితే తీసుకొస్తున్నాయి కార్పోరేట్ కళాశాలలు. ఎండాకాలం సెలవులను గడపకుండా చేస్తున్నాయి. వారం రోజులు కూడా కాలేదు అప్పుడే కాలేజీకి క్యూ కడుతున్నారు. ఫ్రెండ్స్ అంతా సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తుంటే తాను మాత్రం క్లాసులు వినాల్సి వస్తుందని చెబుతున్న ఓ విద్యార్థి వ్యధ వర్ణనాతీతం. ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తూ క్లాసులు తీసుకోవద్దని ఇలాంటి తరగతుల నిర్వహణ వల్ల ఎదిగే పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. కష్టపడి చదివిన పిల్లలకు కనీస విరామం ఇవ్వాలని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories