ఏపీలో స్తంభించిన జనజీవనం!

ఏపీలో స్తంభించిన జనజీవనం!
x
Highlights

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు బంద్ కొనసాగుతోంది....

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు బంద్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుటా బైటాయించిన సీపీఐ, సీపీఎం నేతలు, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులపై నిరసన తెలిపి ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తుండటంతో జనజీవనం స్తంభించింది. ఈ బంద్‌కు వైసీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేయగా, ప్రజలు కూడా బంద్ లో పాల్గొంటున్నారు. అత్యవసర వాహనాలు మినహా మరే వాహనాలు రహదారులపై కనిపించడం లేదు.

విశాఖ జిల్లా మద్దెలపాలెం వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 695 బస్సులు నిలిచిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ఏజన్సీ ప్రాంతంలో 144 సెక్షన్ నిర్వహించారు. కడప, శ్రీకాకుళం, విజయవాడ ప్రాంతాల్లో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో కదం తొక్కిన వామపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భారీ ర్యాలీని నిర్వహించాయి. తిరుపతి, మంగళం, తిరుమల డిపోల నుంచి బస్సులను బయటకు కదలనీయలేదు. ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. పలు ప్రాంతాల్లో డ్రోన్ లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలను పోలీసులు చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఏలూరు, తణుకులో బస్సులను విపక్షాలు అడ్డుకున్నారు. మరోవైపు ఏలూరులో వామపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బంద్ నేపథ్యంలో జూట్‌ మిల్లును మూసివేశారు. అటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే కొవ్వూరు ఆర్టీసీ డిపో ఎదుట వామపక్ష నాయకులు, కార్యకర్తల ధర్నాకు దిగాయి. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జంగారెడ్డిలో వామపక్షాలు, వైసీపీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. విభజన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కాకినాడ ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. బంద్ సందర్భంగా ఆర్టీసీ స్వచ్ఛందంగా బస్సులను నిలిపివేసింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. మరోవైపు రాజమండ్రిలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తున్నారు. జనసేన పార్టీతోపాటు జర్నలిస్టులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ బంద్‌కు మద్దతునిచ్చాయి. విద్యా, వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించి బంద్‌లో పాల్గొంటున్నారు. రాజమండ్రి కాంప్లెక్స్ వద్ద బైటాయించిన నేతలు బస్సులను అడ్డుకున్నారు.

కడప జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వామపక్షాల పిలుపు మేరకు చేపట్టిన బంద్‌కు అన్ని వర్గాల మద్దతు లభించింది. తెల్లవారుజాము నుంచే వామపక్ష నేతలు బస్టాండ్ల కూడళ్లకు చేరుకుని నిరసనలు చేపట్టారు. జిల్లాలో బంద్‌తో 900 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విభజన హమీలను అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ఇక కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర సీపీఐ నాయకులు ఆందోళన దిగాయి. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే, అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఆందోళనకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగాయి. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. దీంతో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బంద్‌ నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories