Top
logo

జీవి మనుగడపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టీఫెన్‌ హాకింగ్‌

Highlights

మరో 600 ఏళ్లలో మనం నివసిస్తున్న భూమి ఇలా ఆవాసయోగ్యంగా ఉండదు. నిప్పుల ముద్దలా మారిపోతుంది. ఎక్కడా జీవి మనుగడ...

మరో 600 ఏళ్లలో మనం నివసిస్తున్న భూమి ఇలా ఆవాసయోగ్యంగా ఉండదు. నిప్పుల ముద్దలా మారిపోతుంది. ఎక్కడా జీవి మనుగడ సాగించే అవకాశాలే ఉండవు. ఇదేదో అభూత కల్పనలు, కట్టుకథలు కావు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ శాస్త్రీయంగా వేస్తున్న అంచనాలు. మనిషి మనుగడ భవిష్యత్తులోనూ కొనసాగాలని కోరుకుంటే సౌర కుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలకు వలస వెళ్లిపోవడమొక్కటే ఏకైక మార్గమని స్పష్టం చేస్తున్నారాయన.

రాబోయే 600 ఏళ్లలోపే భూగోళం ఓ అగ్నిగోళంలా, నిప్పుల బంతిగా మారుతుందని ప్రముఖ భౌతికశాస్ర్తవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు. పెరుగుతున్న జనాభా, విచ్చలవిడి విద్యుత్‌ వినియోగం ఇందుకు కారణమని స్పష్టం చేశారు. ఫలితంగా భూమిమీద మానవజాతి మనుగడ అంతరించిపోతుందని హెచ్చరించారు. బీజింగ్‌లో నిర్వహించిన ఓ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మన తర్వాతి తరాలు మరికొన్ని లక్షల సంవత్సరాలు జీవించాలంటే వేరే గ్రహానికి వెళ్లక తప్పదని హాకింగ్ తేల్చి చెప్పారు. సౌర కుటుంబానికి ఆవలకి తరలిపోవడమే దీనికి పరిష్కారమని చెప్పారు. భూమిని పోలి, జీవ మనుగుడకు అస్కారమున్న ఆల్ఫా సెంటారీ అనే మరో నక్షత్ర సముదాయం సౌరకుటుంబానికి చేరువలో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ భూమిని పోలిన గ్రహం ఉండే అవకాశముందని అందులో నివాసం ఏర్పరచుకునే అవకాశాలను అన్వేషించాలని ఆయన చెప్పారు.

కాంతివేగంతో సమానంగా ప్రయాణించగలిగే చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించడం ద్వారా రెండు దశాబ్దాల్లో అక్కడకు చేరుకోవచ్చని హాకింగ్‌ తెలిపారు. భూమిని పోలి ఉన్న మరో గ్రహానికి ప్రయాణించేందుకు అవసరమయ్యే పరిశోధనలకు సాయం అందించాలని ఇన్వెస్టర్లను కోరారు. ఈ వ్యవస్థ ద్వారా అంగారక గ్రహంపైకి అరగంటలోనూ, ప్లూటోపైకి కొన్ని రోజుల్లోనూ, ఆల్ఫా సెంటారీ నక్షత్రసముదాయంలోకి 20 ఏళ్లలోనూ చేరుకోవచ్చని స్టీఫెన్ హాకింగ్ వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కూడా మానవ జాతిని మింగేస్తుందని హాకింగ్‌ ఇప్పటికే మానవాళిని హెచ్చరించారు. కృత్రిమ మేథతో మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story