logo
సినిమా

లాస్ట్‌ జర్నీ

లాస్ట్‌ జర్నీ
X
Highlights

ఇండియన్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి అంతిమయాత్ర ఈరోజు జరగనుంది. విలే పార్లే సేవా సమాజ్ హిందూ శ్మశానవాటికలో...

ఇండియన్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి అంతిమయాత్ర ఈరోజు జరగనుంది. విలే పార్లే సేవా సమాజ్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు శ్రీదేవి కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. ఇక అతిలోక సుందరిని ఆఖరిచూపు చూసేందుకు నటీనటులు, అభిమానులు, సినీరాజకీయ, పారిశ్రామికవేత్తలు శ్రీదేవి నివాసానికి క్యూకట్టారు.

అందాలతార అతిలోక సుందరి శ్రీదేవి అంత్యక్రియలు మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరగనున్నాయి. ఉదయం 9గంటలకు ముంబై అంధేరిలోని గ్రీన్ ఏకర్స్ నుంచి సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌కు శ్రీదేవి పార్థీవదేహన్ని తరలించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అభిమానుల సందర్శనకు అనుమతించనున్నారు. ఇక మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటిగంట వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రెండు గంటలకు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం మూడున్నరకు విలే పార్లే హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

శ్రీదేవి అంత్యక్రియలపై కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యంత భావోద్వేగ సమయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ భర్త బోనీకపూర్, కుమార్తెలు ఖుషి, జాహ్నవితోపాటు కపూర్, అయ్యప్పన్ కుటుంబ సభ్యులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

శ్రీదేవి ఇంటి పరిసరాలన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు పెద్దఎత్తున తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అతిలోక సుందరి అంతిమయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, నటీనటులు ముంబైకి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి తెలుగు సినీ ప్రముఖులు కూడా ముంబైకి క్యూకట్టారు.

Next Story