Top
logo

టీటీడీపై అలకవీడిన చినజీయర్ స్వామి

Highlights

దాదాపు పదిహేనేళ్ల తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి. గతంలో...

దాదాపు పదిహేనేళ్ల తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి. గతంలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత తర్వాత దానిని పునర్నిర్మించే వరకు శ్రీవారిని దర్శించుకోనన్న చినజీయర్ స్వామి మనస్సు మార్చుకున్నట్టున్నారు. ఒకటిన్నర దశాబ్దం క్రితం కూల్చిన మండపానికి నిర్మాణపనులు ప్రారంభించగానే కోర్టు కేసులతో బ్రేక్ పడుతున్నాయి. దీంతో వేయికాళ్ల మండప పునర్నిర్మాణమే అటకెక్కినట్టు కనిపిస్తుంది. దీంతో మనస్సు మార్చుకున్న చినజీయర్ స్వామి నేడు శ్రీవారి సాత్తుమొర కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు. అసలు దీనంతటికీ కేంద్ర బిందువైన వెయ్యికాళ్ల మండపం వివాదంపై ప్రత్యేక కథనం.

తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయాన్ని 3వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఎందరో రాజులు, వారి సామంతులు అంచెలంచెలుగా నిర్మించారు. ఆలయం ఎదుట వున్న వెయ్యికాళ్ళ మండపాన్ని 1472లో విజయనగర సామ్రాజ్యానికి రాజు సాళువ నరసింహరాయలు దాయాది అయిన సాళువ మల్లయ్యదేవ మహారాజు నిర్మించాడు. మొదట్లో శ్రీవారు మాడవీధులలో ఊరేగేటపుడు మండపానికి వేంచేసేవారు. అక్కడ ప్రత్యేక పూజలు, నైవేద్యం జరిగిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు జరిగేవి. అయితే విజయనగర సామ్రాజ్యంతోనే ఈ ఆచారం కూడా అంతరించిపోయింది.

తర్వాతి కాలంలో ఈ మండపం భక్తులకు ఆసరాగా మారింది. ఆలయ పాలనను చూసిన మహంతులు ఈ మండపాన్ని భక్తుల కోసం వినియోగించేవారు. టీటీడీ ఏర్పడిన తర్వాత లడ్డు కౌంటర్లు, బ్యాంకు కౌంటర్లు, ఎంప్లాయిస్ క్యాంటిన్, మ్యూజియం, పురోహిత సంఘం, పోలీసు స్టేషన్, దుకాణాలు వంటివి ఈ మండపంలోనే ఏర్పాటు చేసింది. ఆలయం ఎదుట దక్షిణ, తూర్పు మాడ వీధుల మూలన వున్న వెయ్యికాళ్ళ మండపాన్ని భక్తుల సౌకర్యార్థం అంచెలంచెలుగా తొలగించడం మొదలుపెట్టింది బోర్డు.

మొదట 1970లో తూర్పు మాడ వీధిలో వున్న వెయ్యికాళ్ళ మండపాన్ని కొంత తొలగించి అక్కడ పలు నిర్మాణాలు చేపట్టింది టీటీడీ. అటు తరువాత ఆలయం ఎదుట వున్న సన్నిధి వీధిని వెడల్పు చేయడానికి అంటూ ఉత్తరం వైపున కొంతభాగాన్ని తొలగించారు. అనంతరం 1983లో వెయ్యికాళ్ళ మండపాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. అందుకు కారణాలు లేకపోలేదు.1974 శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రథోత్సవ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు భక్తులు రథ చక్రాల క్రింద పడి చనిపోయారు. 11 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అప్పటి రాష్ర్ట ప్రభుత్వం ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని వేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తుల రద్దీని తట్టుకొనే విధంగా మాడ వీధులు విశాలంగా లేనందువల్ల తోపులాట, తొక్కిసలాట జరిగాయని ఆ కమిటీ తేల్చింది. మాడ వీధులను అభివృధ్ధి చెయ్యడానికి వీల్లేకుండా ప్రైవేట్ ఆస్తులు వుండడంతో భవిష్యత్తులోనూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు వున్నాయని నివేదిక సమర్పించింది.

భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సలహాల కోసం 1975 జులైలో టీటీడీ సెమినార్ నిర్వహించింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తుల రద్దీ దృష్ట్యా మాడవీధులను వెడల్పు చేయాలని, అందుకోసం ప్రైవేట్ ఆస్తులతోపాటు వెయ్యికాళ్ళ మండపాన్ని తొలగించాలని నిపుణులు సూచించారు. భక్తుల సౌకర్యార్ధం క్యూ కాంప్లెక్స్ ల నిర్మాణాలు, పుష్కరిణిని అభివృద్ధి చేయడం, మాడవీధులను విశాలంగా మార్చడం, మూడో ప్రాకారం నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని మాస్టర్ ప్లాన్ సూచించారు.

పురాతన నిర్మాణమైన వెయ్యికాళ్ళ మండపం తొలగింపునకు టీటీడీ ఆగమ పండితుల సలహా కోరింది. వెయ్యికాళ్ళ మండపానికి ఆగమ శాస్త్రంలో పెద్దగా ప్రాధాన్యత లేదని.. మరో ప్రాంతంలో నిర్మించాలని సూచించారు పండితులు. దీనితో 1983 అక్టోబర్ 31న జరిగిన పాలకమండలి సమావేశంలో వెయ్యికాళ్ళ మండపాని తొలగించి మరో ప్రాంతంలో పునర్నిర్మించాలని నిర్ణయించినప్పటికి, ఎందుకనో ఆ నిర్ణయం అమలుకాలేదు. కాని తిరిగి 2002 బ్రహ్మోత్సవాలలో మరోసారి మాడ వీధులలో తోపులాట చోటుచేసుకుంది. గరుడసేవ సందర్భంగా తొక్కిసలాటలో 50 మంది వరకు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరోసారి వెయ్యికాళ్ళ మండపం తొలగింపు తెరపైకి వచ్చింది.

2002 డిసెంబర్ 28న జరిగిన పాలకమండలి సమావేశంలో వెయ్యికాళ్ళ మండపాన్ని మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. 2003 జనవరి 30న జరిగిన పాలకమండలి సమావేశంలో వెయ్యికాళ్ళ మండప నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు 72 కోట్లు కేటాయించారు. 2003 మే నెలలో తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇలా దాదాపు ఏడాదిపాటు అంచెలంచెలుగా ఈ నిర్మాణాన్ని తొలగించి శ్రీవారి ఆలయానికి అనుగుణంగా చదును చేశారు టీటీడీ అధికారులు. అయితే నాడు ఈ మండపాన్ని కూల్చడాన్ని చినజీయర్ స్వామి వ్యతిరేకించారు. అయినా నాటి సీఎం చంద్రబాబు వెనక్కు తగ్గలేదు. కూల్చిన చోటే మండపం నిర్మించే వరకు తాను శ్రీవారిని దర్శించబోనని చినజీయర్ స్వామి ప్రకటించారు.

మండపం కూల్చివేత తర్వాత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో మండప పునర్నిర్మాణానికి చినజీయర్ స్వామి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే నాటి సీఎం వైఎస్ సూచనలతో మండపం కూల్చిన చోటే తిరిగి 200 స్థంబాలతో మరో మణిమండపం నిర్మిచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. కొత్త మండప నిర్మాణంపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి. తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సూచనల మేరకు కూల్చేసిన మండపాన్ని మహా మణిమండపం పేరుతో తిరిగి నిర్మించాలని జేఈఓ అధ్యక్షతన ఓ కమిటీ వేసింది టీటీడీ. ఈ హైపవర్ కమిటీ తిరుపతిలోని అలిపిరితో పాటు తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించి చివరకు నారాయణగిరి గార్డెన్ లో మణిమండపం నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

మణిమండప నిర్మాణానికి 18 కోట్లు కేటాయించడంతోపాటు టెండర్లు కూడా ఆహ్వానించింది టీటీడీ పాలకమండలి. ఈ టెండర్ల ప్రక్రియ నడుస్తుండగానే నారాయణగిరి గార్డెన్ లో మండపం నిర్మించరాదంటు హైదరాబాదుకి చెందిన కిశోర్ స్వామి, లక్ష్మీనాధాచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో మహా మణిమండప నిర్మాణం మళ్లీ ఆగిపోయింది. మండపాన్ని కూల్చివేసి దాదాపు 15 ఏళ్లవుతున్నా మండప పునర్మిర్మాణం అడుగైనా ముందుకు కదల్లేదు. ఇన్నేళ్లు తన అత్యంత ఇష్టదైవం.. శ్రీనివాసుని దర్శించుకోలేదు చినజీయర్ స్వామి. ఆరేళ్ల క్రితం తిరుమల వచ్చినప్పటికీ స్వామివారిని దర్శించకుండానే వెనుదిరిగారు. వెయ్యికాళ్ల మండపం పునర్మిర్మాణంపై నీలినీడలు తొలగకపోవడం.. నిర్మాణ ప్రక్రియలో కదలిక రాగానే కోర్టు కేసులు అడ్డుపడుతుండటంతో మండపం నిర్మాణంపై చినజీయర్ స్వామి వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.

Next Story