logo
సినిమా

'స్పైడ‌ర్' రివ్యూ

స్పైడ‌ర్ రివ్యూ
X
Highlights

'ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌ముందే స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారిని కాపాడి సంతోషించే క‌థానాయ‌కుడు.. ఓ మ‌నిషిని చంపి వాళ్ల...

'ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌ముందే స‌మ‌స్య‌ల్లో ఉన్న‌వారిని కాపాడి సంతోషించే క‌థానాయ‌కుడు.. ఓ మ‌నిషిని చంపి వాళ్ల బంధువులు ఏడిస్తే అది చూసి సంతోషించే శాడిస్టిక్ ప‌ర్స‌నాలిటీ డిజార్డర్ ఉన్న‌ ప్ర‌తినాయ‌కుడు.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచే మైండ్‌గేమ్ సినిమానే స్పైడ‌ర్‌'. అగ్ర క‌థానాయ‌కుడు మ‌హేష్‌బాబు, అగ్ర ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ద్విభాషా చిత్ర‌మిది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య ప్ర‌తినాయ‌కుడిగా, క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీత‌మందించారు. బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'స్పైడ‌ర్' సినిమా స‌మీక్ష‌లోకి వెళితే..

క‌థ త‌న అర్హ‌త‌ల‌తో బాగా డ‌బ్బు సంపాదించే ఉద్యోగం తెచ్చుకోగ‌లిగే అవ‌కాశ‌మున్నా.. క్రైమ్ జ‌ర‌గ‌క‌ముందే ఆపే అవ‌కాశ‌ముండేలా ఇంట‌లెజిన్స్ బ్యూరోలోని కాల్ ట్యాపింగ్ విభాగంలో ప‌నిచేస్తుంటాడు శివ (మ‌హేష్‌బాబు). పై అధికారుల‌కు తెలియకుండా త‌నే ఓ సాఫ్ట్ వేర్ త‌యారు చేస్తాడు శివ‌. ఎవ‌రైనా ఫోన్‌లో బెదిరించినా, ఏడిచినా, హెల్ప్ అని అడిగినా త‌న సాఫ్ట్ వేర్ ఓపెన్ అవుతుంది. దాంతో శివ అల‌ర్ట్ అయి..ప్ర‌మాదంలో ఉన్న వారిని కాపాడుతుంటాడు. అయితే ఓ అమ్మాయికి సంబంధించి ఇలాంటి ఓ కేసులో విఫ‌ల‌మౌతాడు శివ‌. అంతేకాకుండా.. ఆ అమ్మాయితో పాటు ఆమెని కాపాడ‌మ‌ని పంపిన‌ త‌న ఫ్రెండ్‌, లేడీ పోలీస్ కూడా ఘోరంగా చ‌నిపోవ‌డంతో.. ఇద్ద‌రి అమ్మాయిల ప్రాణాలు కాపాడ‌లేక‌పోయాన‌న్న బాధ‌తో త‌న ఉద్యోగానికి రాజీనామా చేయాల‌నుకుంటాడు. అయితే అప్ప‌టివ‌ర‌కు ఈ డిపార్ట్‌మెంట్‌పై ఆస‌క్తి చూపించ‌ని శివ నాన్న(జ‌య‌ప్ర‌కాష్‌) కూడా 'ఇది క్రైమ్‌కి ముగింపు అని ఎందుకు అనుకుంటున్నావ్‌? ఇది క్రైమ్‌కి ఆరంభం అనుకోవ‌చ్చు క‌దా. అత‌ను మ‌రెంతమందిని చంపాల‌నుకుంటాడో? వాడ్ని నువ్వు ఎందుకు ఆప‌కూడ‌దు' అంటూ శివ‌ని మోటివేట్ చేసి ఈ కేస్‌ని సీరియ‌స్ గా తీసుకునేలా ఎంక‌రేజ్ చేస్తాడు. దాంతో.. చ‌నిపోయిన ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ ద్వారా ఓ క్లూ సంపాదించి కూపీ లాగుతాడు. త‌ద్వారా.. ఈ హ‌త్య‌ల‌కు కార‌ణం భైర‌వుడు అనే విష‌యం తెలుసుకుంటాడు శివ‌. అస‌లు భైర‌వుడు ఎవ‌రు? అత‌ని నేప‌థ్యం ఏమిటి? ఎందుకు మ‌నుషుల్ని చంపుకుంటూ పోతున్నాడు? అత‌న్ని ఎదుర్కొనే ప్రాసెస్‌లో శివ‌కి ఎదురయ్యే స‌మ‌స్య‌లేమిటి? మెడికో స్టూడెంట్ చార్లీ (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌) ఈ ఆప‌రేష‌న్‌లో శివ‌కి ఎలా హెల్ప్ అవుతుంది? ప‌ర‌మ కిరాత‌కుడైన భైర‌వుడిని శివ ఎలా అంత‌మొందించాడు? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధాన‌మే 'స్పైడ‌ర్‌'. విశ్లేష‌ణ‌ ఇది ప‌క్కా మురుగ‌దాస్ మార్క్ సినిమా. మ‌హేష్‌లాంటి స్టార్ క‌థానాయ‌కుడు ఉన్నా.. హీరోయిజాన్ని ఓవ‌ర్ బిల్డ‌ప్ చేయ‌కుండా మాన‌వ‌త్వం అనే అంశం చుట్టూ సినిమాని న‌డిపించాడు. తొలి స‌న్నివేశం నుంచే ఇదో సీరియ‌స్ సినిమా అన్న విష‌యాన్ని క‌న్వే చేశాడు మురుగ‌దాస్‌. పెద్ద పెద్ద నేచ‌ర్ డిజాస్ట‌ర్‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే మ‌న‌లో ఉన్న మాన‌వత్వాన్ని ఎందుకు నిద్ర‌లేపాలి? మొబైల్ స్క్రీన్‌పై కేటాయించే స‌మ‌యాన్ని కూడా స‌మ‌స్య‌ల్లో ఉన్న తోటి మ‌నిషి కోసం ఎందుకు కేటాయించలేక‌పోతున్నాం అంటూ త‌న ఆవేద‌న‌ని త‌న క‌థానాయ‌కుడిచేత చెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. స‌మ‌స్య‌ల్లో ఉన్న వారిని కాపాడ‌డ‌మే హీరో టార్గెట్‌గా పెట్టి.. అత‌న్ని ఓ 'హెల్ప్ మైండెడ్ ప‌ర్స‌న్' గా చూప‌డడంలో స‌క్సెస్ అయ్యాడు. ప‌తాక స‌న్నివేశాల‌కి ముందు వ‌చ్చే ఓ స‌న్నివేశంలో.. ఆటోలో ఉన్న ర‌కుల్‌తో మ‌హేష్‌ మాట్లాడే సీన్ చూస్తే చాలు.. మురుగ‌దాస్ త‌న హీరోని ఎంత ఫోక‌స్డ్‌గా చూపించాల‌కున్నాడో అర్థ‌మౌతుంది. 'మ‌నం పుట్టి పెరిగే వాతావ‌ర‌ణం మ‌న మీద ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది?' అనే దాన్ని విల‌న్ పాత్ర‌కి.. అత‌ని పుట్టుక నుంచి బాగా ఎఫెక్టివ్‌గా చూపించాడు. 'ప‌రిచ‌యం లేని మ‌నిషికి ఏమీ ఆలోచించ‌కుండా చేసే సాయ‌మే మాన‌వత్వం అని న‌మ్మే క‌థానాయ‌కుడు.. ఓ ఊరిని వ‌ల్ల‌కాడు చేసేసి సిటీని కూడా స్మ‌శానం చేయాల‌నుకునే విల‌న్‌'.. ఇలా రెండు విభిన్న ధృవాల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌ని కొన్ని స‌న్నివేశాల్లో బాగా చూపాడు మురుగ‌దాస్‌. అలాగే మురుగ‌దాస్ సినిమాల్లో క‌నిపించే మాంటేజ్ సాంగ్స్ ఇందులోనూ ఉన్నాయి. బూమ్ బూమ్ పాట‌లో హీరో యాక్టివిటీస్‌ని, మిస్టీరియ‌స్ గ‌ర్ల్‌ పాట‌లో హీరోయిన్ యాక్టివిటీస్‌ని బాగా చూపించాడు. అంతేకాదు.. పుచ్చ‌కాయ పుచ్చ‌కాయ లాంటి మాస్ పాట‌లో కూడా ఓ మాంటేజ్ షాట్‌ని వాడే వినూత్న ప్ర‌య‌త్నం చేశాడు మురుగ‌దాస్. న‌టీన‌టులు-సాంకేతిక నిపుణుల ప‌నితీరు ఈత‌రం అగ్ర క‌థానాయకుల్లో మ‌హేష్ చేసిన‌న్ని ప్ర‌యోగాలు మ‌రో హీరో చేసి ఉండ‌రు. అందుకే కాస్త కొత్త ఆలోచ‌న ఉంటే చాలు.. దాన్ని మ‌హేష్‌తోనే చేయాల‌నుకుంటారు ఏ ద‌ర్శ‌కుడైనా. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమా సినిమాకి న‌టుడిగా ఎదుగుతున్న మహేష్‌.. ఈ సినిమాలో చాలా స్టైలీష్‌గా క‌నిపిస్తూనే సినిమాకి త‌గ్గ సీరియ‌స్ మోడ్‌ని చివ‌రివ‌ర‌కు కంటిన్యూ చేశాడు. మ‌హేష్ క‌ళ్ల‌ల్లో క‌నిపించే ఇంటెన్సిటీని ఈ స‌బ్జెక్ట్‌కి చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నాడు మురుగ‌దాస్‌. అలాగే మురుగ‌దాస్ ఆలోచ‌న‌ల్ని తెర‌పై చూప‌డంలో మ‌హేష్ నూటికి నూరు శాతం స‌క్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో త‌మిళ తెర‌కు పరిచ‌య‌మ‌వుతున్న మ‌హేష్‌కి అక్క‌డ ఇది ఓ మంచి లాంఛింగ్ మూవీ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ర‌కుల్‌కి స్క్రీన్ స్పేస్ త‌క్కువ‌. సాధార‌ణంగా మైండ్ గేమ్ సినిమాల్లో హీరోయిన్ల పాత్ర ఎంత ఉంటుందో అంతే ఉంది ఈ సినిమాలో కూడా. ఒక్క ప్రీ క్లైమాక్స్‌లో త‌ప్ప‌.. ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఆమె పాట‌ల‌కి ముందు వ‌చ్చే సీన్స్‌లో మాత్ర‌మే క‌నిపిస్తుంది. మెడికో స్టూడెంట్ కావ‌డం అనే రీజ‌న్‌ని చివ‌రి స‌న్నివేశాల్లో బాగా ఉప‌యోగించుకున్నారు. ఇక ఈ సినిమాలో స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్‌.. విల‌న్ పాత్ర‌లో క‌నిపించిన ఎస్‌.జె.సూర్య. ఈ పాత్ర క‌నిపించేది ఇంట‌ర్వెల్ ముందు సీన్ నుంచే. అయితే ఇంట‌ర్వెల్‌ స‌న్నివేశంలో వ‌చ్చే రెండు ర‌కాల సిట్యుయేష‌న్స్‌లో అత‌ని ఎక్స్‌ప్రెష‌న్స్ బాగున్నాయి. భ‌ర‌త్‌, జ‌య‌ప్ర‌కాష్‌, దీపా రామానుజ‌మ్, ప్రియ‌ద‌ర్శి త‌మ ప‌రిధుల్లో చ‌క్క‌గా న‌టించారు. ఇక సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. హారిస్ జైరాజ్ పాట‌ల్లో 'బూమ్ బూమ్‌', 'సిసిలియా', 'మిస్టీరియ‌స్ గ‌ర్ల్' పాట‌లు ట్యూన్స్ ప‌రంగా బావున్నాయి. ఇక నేప‌థ్య సంగీతంలో అయితే త‌న స్థాయి ఏమిటో చూపించాడు హారిస్. సంతోష్ శివ‌న్ ఫొటోగ్ర‌ఫీ సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. మురుగదాస్ రాసిన మాట‌ల్లో 'ప‌రిచ‌యం లేని మ‌నిషికి ఏమీ ఆశించ‌కుండా చేసే సాయ‌మే మాన‌వ‌త్వం', 'ప‌క్క‌నున్న మ‌నిషిని లైక్ చేయండి.. మ‌న‌లోని మ‌నిషిని షేర్ చెయ్యండి' బాగా పేలాయి. విల‌న్ చేతిలో చిక్కుకున్న త‌న త‌ల్లిని కాపాడుకోవ‌డానికి హీరో త‌న ఫ్రెండ్స్ కి ఇచ్చే సూచ‌న‌లు, ఇంట‌వ్రెల్ కి ముందు మ‌హేష్, భ‌ర‌త్‌పై వ‌చ్చే రోల్ కోస్ట‌ర్ సీన్, కొండ రాయి దొర్లే స‌న్నివేశం, క్లైమాక్స్ లోని హాస్పిట‌ల్ సీన్‌లో ద‌ర్శ‌కుడిగా త‌న మార్క్ చూపాడు మురుగదాస్. అలాగే సూర్య‌ని మ‌హేష్ షూట్ చేసే సీన్ కూడా బాగుంది. ఇక‌, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ గురించి చెప్పుకోవాలంటే.. సినిమాలోని ప్ర‌తి సీన్, పాట‌ రిచ్‌గా ఉన్నాయి. ఎక్క‌డా నిర్మాత‌లు కాంప్ర‌మైజ్ కాలేద‌న్న‌ది తెర‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్‌ మ‌హేష్ స్టైలీష్ లుక్‌, న‌ట‌న‌ య‌స్‌.జె.సూర్య పాత్ర, ఎక్స్‌ప్రెష‌న్స్‌ హ‌రిస్ జైరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సంతోష్ శివ‌న్ ఫొటోగ్ర‌ఫీ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌ మైన‌స్ పాయింట్స్‌ స్లో నెరేష‌న్‌ సెకండాఫ్‌లో కొన్ని స‌న్నివేశాలు పాటలు వచ్చే సంద‌ర్భాలు (ముఖ్యంగా సినిమా ప్రారంభ‌మైన 45 నిమిషాల్లోనే మూడు పాట‌లుంటాయి) బాట‌మ్ లైన్- థ్రిల్ చేసే స్పైడ‌ర్‌ రేటింగ్ - 3/5

Next Story