ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్ లు...

ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్ లు...
x
Highlights

ఎన్నికల వేళ అన్ని పార్టీల్లో జంపింగ్ జపాంగ్ లు ఎక్కువైపోయారు.. పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఒకరు.. తాము చెప్పిన వారికి ఇవ్వలేదని మరొకరు.. సిటింగ్ లకూ...

ఎన్నికల వేళ అన్ని పార్టీల్లో జంపింగ్ జపాంగ్ లు ఎక్కువైపోయారు.. పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఒకరు.. తాము చెప్పిన వారికి ఇవ్వలేదని మరొకరు.. సిటింగ్ లకూ సీట్లివ్వలేదని ఇంకొకరు. ఏ పార్టీ తీరు చూసినా.. ఇలాంటి అలకలు, బుజ్జగింపులతో సీన్ రసవత్తరంగా మారిపోతోంది. ఎన్నికలెదు ర్కొంటున్న తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల్లోనూ దాదాపు ఇదే సీన్..సాధారణంగా అన్ని పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరిక లెక్కువుంటాయని చంకలెగరేసే టీఆరెస్ తాజాగా కొండా దెబ్బకి డీలా పడిపోయింది. టిక్కెట్ల కేటాయింపులో తేడాలతో చాలా మంది టిఆరెస్ ను వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చేసుకున్నారు.. అందుకు కొనసాగింపా అన్నట్లుగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తాజాగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చేసుకున్నారు... దాదాపు వారం క్రితమే ఇద్దరు కీలక నేతలు తమ పార్టీలోకి వస్తారని.. మరిన్ని సంచలనాలుం టాయని రేవంత్ ప్రకటించినప్పుడు రెండు, కాదు మూడు అని రెట్టించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత కేటిఆర్ ఫోన్ కాల్ తో కాస్త మెత్తబడ్డారు..

కేసిఆర్ ఆదేశాల మేరకు కేటిఆర్ స్వయంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ పార్టీ మారొద్దంటూ బతిమిలాడారు.. అప్పటికి సరేనని మెత్త బడ్డ కొండా మరుసటి రోజు తాను పార్టీ మారడం లేదంటూ మరోసారి గట్టిగా చెప్పారు.. మీడియా రకరకాలుగా వార్తలు రాస్తోందంటూ మండి పడ్డారు. కొండా ఇలా చెప్పి ఒక రోజు కూడా గడవకుండానే మళ్లీ సంచలనానికి తెర లేపారు.. కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారని తెలుసుకున్న కేటిఆర్ కొండాకు ఫోన్ చేసి పార్టీలోనే కొనసాగాల్సిందని మరీ మరీ కోరారు.. అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పి కొండా టిఆరెస్ కు గుడ్ బై కొట్టేశారు.చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మృదు స్వభావి.. పారిశ్రామిక వేత్త..కొండా గెలిచిన తర్వాత స్థానికంగా ఆయన ఇష్టానికి విరుద్ధంగా పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. స్థానికంగా ఉన్న మంత్రి మహేందర్ రెడ్డితో ఆయనకు పొసగడం లేదు.. స్థానికాంశాల్లో కూడా తన మాటను కాదని, తనకు విలువ ఇవ్వకుండా కొందరు నేతలు ఇష్టాను సారం నిర్ణయాలు తీసుకుంటున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు.. ఈ సంకేతాలను గమనించిన కాంగ్రెస్ పెద్దలు కొండాకు గాలమేసి లాగారు.. మొదట కేసిఆర్ సూచనతో మనసు మార్చుకున్న కొండా.. ఆ తర్వాత తన నిర్ణయానికే కట్టుబడ్డారు.. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని టిఆరెస్ కి రాజీనామా చేసేశారు.. కొండాకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఖాయమైంది.


కొండా విశ్వేశ్వర రెడ్డి తర్వాత టిఆరెస్ నుంచి జారుకునే ఇతర నేతలెవరన్న చర్చ జరుగుతోంది. టిఆరెస్ లో సిటింగ్ లకు సీట్లు గల్లంతవడం కూడా పార్టీ మార్పుకి కారణమైంది. టిఆరెస్ కు చెందిన రమేష్ రాథోడ్ కు సీటు హుళక్కి అవడంతో ఆయన కాంగ్రెస్ పంచన చేరి టిక్కెట్ పొందారు. అలాగే పరకాల సీటు కోసం పట్టుబట్టిన కొండా సురేఖ టిఆరెస్ నేతలతో చిన్న సైజు యుద్ధమే చేశారు. చివరకు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.. అదే బాటలో గజ్వేల్ టిక్కెట్ కోసం నర్సారెడ్డి, దేవర కొండ సీటుకోసం బాలూనాయక్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే ఆందోల్ టిక్కెట్ కోసం బాబూ మోహన్ బిజెపిలోకి మారిపోయారు. అదే బాటలో బొడిగ శోభ కూడా బిజెపి తీర్ధం తీసుకున్నారు.ఇక కాంగ్రెస్ కోరుట్ల సీటునాశించి కొంత ప్రచారం కూడా చేసుకున్న వెంకట్ బిజెపిలో చేరిపోయారు. ఇక పారాచూట్ నేతలకు టిక్కెట్లు కేటాయించడం కూడా జంపింగ్ లకు కారణమవుతోంది. ఈమధ్యనే టిఆరెస్ లో చేరిన కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బరిలో నిలుస్తున్నారు.. చాలా చోట్ల గెలుపు గుర్రాల పేరుతో అప్పటికప్పుడు వేరే పార్టీల నుంచి అభ్యర్ధులకు గాలమేసి పార్టీలు లాగుతుండటంతో ఏ నేత ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోడం గందరగోళంగా మారుతోంది. ఇలా చెప్పుుకుంటూ పోతే చాలా ఉదంతాలే ఉన్నాయి.. గెలుపే మంత్రంగా రాజకీయ పార్టీలు రచిస్తున్న మంత్రాంగం వల్ల ఇలా నియోజక వర్గానికో కథ పుట్టుకొస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories