ఆ దర్గాలో రాత్రివేళ ఎవరూ ఉండకూడదు.. కారణమేంటి?

ఆ దర్గాలో రాత్రివేళ ఎవరూ ఉండకూడదు.. కారణమేంటి?
x
Highlights

రంగారెడ్డి జిల్లా కొత్తూర్‍ మండలం ఇన్ముల‌ నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న ఈ జహంగీర్‍పీర్‍ దర్గాకు ఎంతో చరిత్ర ఉంది. దేశంలోనే అత్యధిక భక్తులు...

రంగారెడ్డి జిల్లా కొత్తూర్‍ మండలం ఇన్ముల‌ నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న ఈ జహంగీర్‍పీర్‍ దర్గాకు ఎంతో చరిత్ర ఉంది. దేశంలోనే అత్యధిక భక్తులు సందర్శించే దర్గా ఇది.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‍కు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జహంగీర్‍ పీర్ దర్గాకు గత 60 ఏళ్ళ నుంచి భక్తుల తాకిడి పెరిగింది. మొదట కేవలం ఆదివారం మాత్రమే భక్తులు వస్తుండేవారు.కానీ ఇప్పుడు అన్ని రోజుల్లోను సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. ఆదివారాలయితే ఇది సందర్శకులతో కిక్కిరిసి పోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహరాష్ట్ర, కర్నాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తలచిన పనులు నెరవేరుతుండటంతో దర్గాపై నమ్మకం పెరుగుతూ వస్తోంది. సంతానం లేని వారు,కుటుంబ సమస్యలు ఉన్న వారు ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఇక్కడ మొక్కు తీర్చుకుంటే తీరుతాయన్నది ఒక నమ్మకం..

హజరత్ పీర్ దర్గాకు వచ్చేవారు ముఖ్యంగా మేకలను, గొర్రెలను బలిస్తుంటారు. ఇలా మేకలను బలిస్తే వాటిని పెద్ద కందూర్‍ అని పిలుస్తారు. స్థోమత లేని మరికొంతమంది.. కిలో, రెండు కిలోల మటన్ తీసుకువచ్చి సమర్పిస్తారు... దీన్ని సప్త కందూర్‍ అంటారు. మరీ బీదరికంలో ఉన్న వారు మాలీదా చేసి దర్గాకు సమర్పిస్తారు. ఎవరి స్థోమతను బట్టి వారు ఇక్కడ సమర్పించుకుంటారు. ఆదివారం ఒక్క రోజే రెండు వందల నుంచి మూడు వందల యాటలను బలిస్తారని వారు అంటున్నారు.

దేశంలో ఉన్న దర్గాల్లో ఎక్కువ మంది భక్తులు దర్శించే దర్గాలో ఈ జహంగీర్‍ పీర్ దర్గా ఒకటి. వందల ఏళ్ల క్రితం ఇరాక్‍ దేశంలోని బగ్దాద్‍ నగరానికి చెందిన హజ్రత్‍ సయ్యద్‍ జహంగీర్‍ పీర్‍, అతని సోదరుడు హజ్రత్‍ సయ్యద్‍ బురానుద్దీన్‍ పీర్‍లు 700 వందల ఏళ్ళ క్రితం మన దేశానికి వచ్చినట్టు చరిత్ర చెబుతుంది. భారతదేశంలోని మొదట డిల్లీకి చేరుకుని అటు నుంచి ఔరంగాబాద్‍, గుల్బర్గా అటు నుంచి ప్రస్తుతం ఉన్న కొత్తూర్‍ శివారులోకి వచ్చి జీవ సమాధి ఐనట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

జహంగీర్ పీర్ దర్గాకు సందర్శకుల తాకిడి ఇంతా అంతా కాదు.. అనుకున్న పనులు అవ్వాలన్నా,, మొక్కులు తీరాలన్నా.. కుల, మతాలకు అతీతంగా అందరూ తరలి వచ్చేది ఇక్కడికే. హజరత్ పీర్ దర్గా అంటే అందరికీ అంత గురి.. ఇక్కడ జహంగీర్ పీర్ సమాధి సందర్శనకు వచ్చే వారు.. త్వర త్వరగా తమ మొక్కులు చెల్లించుకుని చీకటి పడే వేళకి తిరిగి వెళ్లిపోతారు... రాత్రివేళ మాత్రం ఉండరు.. అందుకు కారణం ఈ దర్గా చరిత్ర వారికి తెలుసు..

హజ్రత్‍ సయ్యద్ జహంగీర్‍ పీర్‍ ఇక్కడ ప్రార్థనలు చేసే వారని చరిత్ర చెబుతోంది. ఆయన ఇక్కడే సజీవ సమాధి అయ్యారు. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అడవి కావడంతో ఎవరు సంచరించే వారు కాదు..

చీకటి పడితే క్రూర మృగాలు సంచరించేవి.. జహంగీర్ పీర్ కు సేవ చేయడానికి ఆ క్రూర మృగాలు వస్తాయన్నది సందర్శకుల విశ్వాసం.. అందుకే చీకటి పడితే సందర్శకులూ వెళ్లిపోతారు.. జహంగీర్ పీర్ తన భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తాడన్నది నమ్మకం.. అంతేకాదు.. జహంగీర్ పీర్ సమాధిని ప్రతీరోజు ఓపెద్ద పులి వచ్చి తోకతో శుభ్రం చేస్తుందని చరిత్ర తెలిసిన వారు చెప్పే మాట..

అందుకే సందర్శకులు సాయంత్రం దాటాక అక్కడ ఉండరు.. రాత్రి వేళ ఈ దర్గాలో సంచరించరు.. చీకటి పడిందంటేచాలు.. ఆ దర్గా నిర్మానుష్యంగా మారిపోతుంది..

అసలు జహంగీర్ పీర్ మహత్యంపై కూడా కథనాలున్నాయి. ఒకరోజు మేకల కాపరి తన మేకలు గొర్రెలు తప్పిపోయి ఓ చెట్టు కింద బెంగగా కూర్చోగా అక్కడికి వచ్చిన జహంగీర్‍ పీర్‍ ఆ గొర్ల కాపరికి ఆ మేకలు ఎక్కడున్నాయో చెప్పడంతో ఆయన మహిమ వెలుగు చూసిందని చెబుతున్నారు. నాటి నుంచి ఆయన్ను కొలవడం ప్రారంభించారని, అన్నాదమ్ములు హజ్రత్‍ సయ్యద్‍ జహంగీర్‍ పీర్‍, ఆయన సోదరుడు హజ్రత్‍ సయ్యద్‍ బురానుద్దీన్‍ పీర్‍ సమాధులు భక్తుల ప్రార్ధనలు అందుకుంటున్నాయని దర్గా అభివృద్ది కమిటీ మాజీ మెంబర్‍ ఎండీ ఖలీద్‍ అంటున్నారు.

కాగా హజరత్ పీర్ దర్గా ఎప్పటినుంచో ఉన్నా.. .. గత పాలకుల నిర్లక్ష్యంతో అబివృద్ధికి నోచుకోలేకపోయింది. ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఈ దర్గాను దర్శించుకున్నారు. ఆ సమయంలో తెలంగాణా వస్తే ఇక్కడ 51 పొట్టేళ్ళను బలిస్తానని మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో గతేడాది నవంబర్‍ 10న దర్గాను సందర్శించి అప్పటి మొక్కులు తీర్చుకున్నారు. 51 పొటెళ్ళను బలిచ్చి 5 వేల మందికి భోజనాలు పెట్టారు. ఈ సందర్భంగా దర్గా అభివృద్దికి ఆయన వరాల జల్లు కురిపించారు. దర్గా ప్రాంగణంలో పార్కింగ్‍, షాపులు, ఇతర సముదాయాల కోసం వంద ఎకరాలు సేకరించి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా దర్గా అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటు దర్గా సమీపంలోని గ్రామాల అభివృద్ధికి10 లక్షలు, తండాల అభివృద్ధికి 5 లక్షల రూపాయల నిధులు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‍ ప్రకటించారు. కానీ నేటికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరనేలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories