స్పీచ్ కు ఫిదా అయిన యావత్ భారతావని

Highlights

పలుకుపలుకులో తియ్యదనం. మాట మాటలో కమ్మదనం. నిండైన ఆత్మవిశ్వాసం. మెండైన ఆత్మాభిమానం. యువతకు స్ఫూర్తినిచ్చే తారకమంత్రం. మగువల తెగువకు నిదర్శనమైన...

పలుకుపలుకులో తియ్యదనం. మాట మాటలో కమ్మదనం. నిండైన ఆత్మవిశ్వాసం. మెండైన ఆత్మాభిమానం. యువతకు స్ఫూర్తినిచ్చే తారకమంత్రం. మగువల తెగువకు నిదర్శనమైన ప్రతిభాపాటవం. చెరగని చిరునవ్వు. ప్రశంసకు వెనకాడని పలకరింపు. అతిరథ మహారథుల సమక్షంలో అదిరిపోయే ప్రసంగమిచ్చారు అమెరికన్ ఫస్ట్ డాటర్ ఇవాంకా ట్రంప్. గ్లోబల్‌ ఎంట్రపెన్యూర్‌ సమ్మిట్‌లో ఆద్యంతం ఇన్‌స్పిరేషనల్‌గా మాట్లాడారు. వంటింటి నుంచి వ్యాపార సామ్రాజ్యం దాకా మహిళాశక్తికి ఎదురులేదని జోష్‌ఫుల్‌గా స్పీచ్‌ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు.

సమ్మోహన ప్రసంగం
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు– జీఈఎస్‌ 2017’లో మొదటిరోజు సమ్మోహన ప్రసంగం చేశారు ఇవాంకా ట్రంప్. అమెరికా అధ్యక్షుడి సలహాదారు హోదాలో పాల్గొన్న ఇవాంక, తన స్పీచ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. డిజైన్ గౌనుతో సదస్సుకు హాజరైన ఇవాంక, నవ్వుతూ, తుళ్లుతూ, స్ఫూర్తిదాయక మాటలు చెబుతూ, సదస్సులో పాల్గొన్న ప్రతిఒక్కరిలోనూ ఉత్సాహం నింపారు.

"మహిళతోనే మార్పు సాధ్యం. స్త్రీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఎక్కువ మందికి లాభం. సమాజంపై దాని ప్రభావం ఎన్నో రెట్లు ఉంటుంది. మహిళలు తమ సంపాదనను తిరిగి తమ ఫ్యామిలీ, సంబంధీకులపైనే పెట్టుబడిగా పెడతారు. మహిళలకు సాధికారత కల్పించని మానవ పురోగతి అసంపూర్ణమేనని నమ్ముతున్న ప్రధాని మోదీని మనస్పూర్తిగా అభినందిస్తున్నా’ అంటూ కొనియాడారు ఇవాంక.

భారతీయులకు వందనం
"70వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న భారతీయులకు నా శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి ఇండియా. వ్యాపార దక్షత, వ్యాపారాపేక్ష, శ్రమ ద్వారా భారత ప్రజలు, 13 కోట్లమందికిపైగా పౌరులకు పేదరికపు కోరలనుంచి విముక్తి కల్పించారు. ఇదో అద్భుత పురోగతి. అందుకే మీకు వందనం"

ఒక మోదీ, ఒక హైదరాబాద్
భాగ్యనగరాన్ని, నరేంద్రమోదీని మార్పుకు ఒక నిదర్శనంగా ప్రస్తావించారు ఇవాంకా ట్రంప్. "ప్రపంచానికి ఆశాదీపం భారతదేశం. ఇలాంటి గొప్ప దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తున్న మీకు(ప్రధానికి) ధన్యవాదాలు. మీరు సాధించిన విజయం అసాధారణం. టీ అమ్మే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగారు. మార్పు సాధ్యమేనని నిరూపించారు. ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోంది. అధునాతన టెక్నాలజీ అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడిక్కడి టెక్నాలజీ కేంద్రాలు సిటీకి మారుపేరైన బిర్యానీని కూడా మరిపిస్తున్నాయి" అని చమత్కరించారు ఇవాంక.

‘‘మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇక్కడే చదువుకున్నారు ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని టి–హబ్‌ వచ్చే సంవత్సరం కొత్త కేంద్రాన్ని ప్రారంభించబోతోంది. ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్‌గా అవతరిస్తోంది. ఈ ముత్యాల నగరానికి గొప్ప నిధి ఇక్కడి ప్రజలే. తమ ఆశలు, ఆకాంక్షల్ని ఎన్నడూ వదిలిపెట్టకుండా మెరుగైన భవిష్యత్తు కోసం శ్రమించే స్వాప్నికులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థల్లో పారిశ్రామికవేత్తల విప్లవం కొనసాగుతోంది" అని ఇవాంక అన్నారు.

భారతీయులు ప్రపంచానికే ఆదర్శం
భారత డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అద్బుతాలు సాధిస్తున్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేస్తున్నారు. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రుడిని దాటి మార్స్‌ దాకా వెళ్లింది. ఇండియన్ ప్రజలు మాకెంతో స్ఫూర్తినిస్తున్నారు. జీఈ సదస్సుకు భారత్‌ ప్రాతినిధ్యం వహించడం మొదటిసారి. ఇది అమెరికా, ఇండియా బంధాన్ని బలపరుస్తోంది. ఆర్థిక, రక్షణ రంగాల్లో స్నేహాన్ని బలోపేతం చేస్తోంది. అందుకే మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఈ ఏడాది మొదట్లో అన్నారు, ఇండియా అమెరికాకు నిజమైన స్నేహితుడని" అని ఇవాంక కొనియాడారు.

మేమే మెజారిటీ
జీఈ సదస్సులో 52శాతం మహిళలు పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందన్నారు ఇవాంక. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని, తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెప్పారు. "ఈ సదస్సులో పాల్గొన్న మహిళలకు నా ప్రత్యేక అభినందనలు. జీఈ సదస్సు థీమ్, మహిళ ప్రథమం, శ్రేయస్సు అందరికీ..నేను చాలా గర్వంగా చెబుతున్నాను, జీఈ సదస్సులో పాల్గొనేందుకు దాదాపు 15 వందల మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఎంపిక కావడం ఇదే మొదటిసారి. పురుషులు అధికంగా ఉన్న ఉన్న ఇండస్ట్రీలో నేను గతంలో పారిశ్రామికవేత్తగా, ఎగ్జిక్యూటివ్‌గా దగ్గర్నుంచి అన్నీ చూశా. పనిలో తమను తాము నిరూపించుకోవాలంటే మహిళలు మగవారి కన్నా ఎక్కువ పనిచేయాలి. ఒక్క మహిళ నిలబడితే కుటుంబం, సమాజం, వ్యవస్థలు నిలబడతాయి" అన్నారు ఇవాంక.

"మా నాన్న ప్రెసిడెంట్‌ ఎన్నికయ్యాక మహిళలతో సహా అమెరికన్ల కోసం పనిచేసే అవకాశం వచ్చింది. అందుకే వ్యాపారాలను వదిలేశాను. మహిళలు తమ కుటుంబాలకు ప్రాధాన్యమిస్తూనే కెరీర్‌ను కూడా చూసుకునేలా మేం పాలసీలు డిజైన్ చేస్తున్నాం. పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య 10శాతం పెరిగింది. ఇప్పుడు అమెరికాలో కోటీ 10లక్షలమంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. సొంత కాళ్లపై నిలబడేందుకు నిరంతరం కృషి చేస్తున్న మహిళా వ్యాపారవేత్తలు మనకు మార్గదర్శులు" అని మహిళలకు స్ఫూర్తినిచ్చే ప్రసంగమిచ్చారు ఇవాంక.

చట్టాల్లో వివక్ష ఇంకెన్నాళ్లు?
ప్రపంచవ్యాప్తంగా చట్టాలు సమానంగా లేవన్నారు ఇవాంక ట్రంప్. మహిళలు, పురుషుల విషయంలో చట్టాల్లో వివక్ష ఉందన్నారు. ఈ విషయంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు చాలా వరకూ మార్పులు చేశాయని, అయినా మార్పు ఇంకా జరగాల్సింది ఉందన్నారు. ‘‘కొన్ని దేశాల్లో భర్తల పర్మిషన్ లేకుండా మహిళలు పనిచేయలేరు. స్త్రీలు బయట పనిచేసేందుకు వారి కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు ఆటంకగా మారాయి. ఇండియాలో పని విషయంలో మగ–ఆడ మధ్య తారతమ్యాలు లేకుండా సమానత్వం వస్తే వచ్చే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 150 బిలియన్‌ డాలర్ల మేర పెరుగుతుంది" అని అంచనా వేశారు ఇవాంకా ట్రంప్.

ఆ ముగ్గురు ఎందరికో ఆదర్శం
జీఈ సదస్సులో ముగ్గురు యువ మహిళా పారిశ్రామికవేత్తలను పరిచయం చేశారు ఇవాంకా ట్రంప్. మొదట శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన దారా దోట్జ్‌ గురించి చెప్పారు. ప్రాణాల్ని నిలబెట్టే కొన్ని రకాల వస్తువుల్ని త్రీడీ ప్రింటింగ్ ద్వారా అందుబాటులోకి తేవడానికి తేవడానికి ఫీల్డ్ రెడీ అనే సంస్థను దారా దోట్జ్‌ ప్రారంభించారని కొనియాడారు.

భళా రాజ్యలక్ష్మీ
"బెంగళూరుకు చెందిన రాజ్యలక్ష్మీ ఎందరికో ఆదర్శం. తన కుమారుడికి బాల్యం నుంచే ఫిట్స్ ఉంది. ఆ బాధ ఆమెను కుంగదీసింది. కానీ బాధపడుతూ కూర్చోలేదు. ఆ కసితో ఆమె ఒక స్మార్ట్‌ గ్లవ్‌ను రూపొందించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అది పని చేస్తుంది. రకరకాల జబ్బులు, అనారోగ్యాలు గుర్తిస్తుంది, వాటి తీవ్రతను అంచనా వేస్తుంది. ఇప్పుడు ఆమె స్థాపించిన టెరాబ్లూ కంపెనీ, గ్రామాలు, రిమోట్‌ ఏజెన్సీల్లో స్పెషాలిటీ హెల్త్‌ కేర్‌ అందించేందుకు కృషి చేస్తోంది. రాజ్యలక్ష్మీ ధైర్యం, పట్టుదల అందరికీ ఆదర్శం. మీకు కంగ్రాట్స్" అని రాజ్యలక్ష్మీని ఇవాంక కొనియాడారు.

వెలుగుల రేహాన్
ఇక రేయాన్ కమలోవా గురించి పరిచయం చేశారు ఇవాంక. 15 ఏళ్ల వయస్సులోనే, రెయిన్‌ హార్వెస్టింగ్‌పై పరిశోధనలు చేసి, సమాజానికి మేలు చేస్తోందని ప్రశంసించారు. "అజర్‌బైజాన్‌కు చెందిన రేహాన్ కమలోవా ఏకకాలంలో ఒక ఇంటిని వెలిగించు అనే బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వర్షపు నీటి నుంచి ఇంధనాన్ని తయారుచేసే కంపెనీని ఏర్పాటు చేయడానికి ఆమెకు వయస్సు అడ్డురాలేదు" అన్నారు ఇవాంక.

మహిళల సరికొత్త ఒరవడి
గత దశాబ్దంలో నూతన ఉత్పత్తుల రూపకల్పనలో మహిళలు ఎంతో పురోగతి సాధించారని అన్నారు ఇవాంక. ఎంతో మంది మహిళలు ఉత్పాదక రంగంలో అద్భుతాలు సాధిస్తున్నారని చెప్పారు. గత దశాబ్దంలో మహిళా పారిశ్రామికవేత్తలు 90లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని...మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు, సాంకేతికత, సహాయ సహకారాలు అందించాలన్నారు. స్త్రీలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది ఇవాంక ప్రసంగం. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటకూ అభినందనగా చప్పట్లు మార్మోగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories